08.09.2026
ఆత్మపథ నిర్దేశకుడు- 17
ఆ రోజు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ‘సతీ సావిత్రి’ కథ చెబుతూ, ఆ కథలో అంతర్గతంగా ఉన్న శ్రీసూర్యోపాసన గురించి సవివరంగా, అద్భుతంగా వివరించారు. అసలే మనవాడి దృష్టిలో శ్రీసూర్యభగవానులవారు తన ‘తండ్రి’ అనే భావన వ్రేళ్ళూనుకుంది. అందులోనూ శ్రీమహద్గురువులు ఉపదేశించిన మహాసౌర మంత్రం ఉండనే ఉంది. కనుక ఉత్సాహంగా కొన్ని గంటల పాటు అద్భుతంగా సాగిన ఆ ప్రవచనాన్ని ఆసాంతం ఆసక్తితో, అనురక్తితో, ఉత్సుకతతో విన్నాడు. ప్రవచనం పూర్తి కాగానే నిరూపానంద నాతో, రెడ్డిగారు, మరియు ఇంకొక పెద్దాయనతో “నేను శ్రీ సామవేదం వారిని శమీవృక్ష పూజ శ్లోకం గురించి అడుగుతాను. నాకు తెలిసి ఖచ్చితంగా వీరి దగ్గరే మనకు ఆ శ్లోకం దొరుకుతుంది చూడండి” అన్నాడు. అందుకు ‘రెడ్డి’ గారు “ఆయన ఇవ్వకపోవచ్చు గోవిందా...! నీకు ఆ మధ్యన శ్రీదక్షిణామూర్తి మంత్రం విషయంలో జరిగిన అనుభవాలు గుర్తు ఉండే ఉంటాయి. కనుక ఈయన కూడా ఇస్తారు అనేది సందేహమే! అదీగాక ఆయన చుట్టూ వందలమంది గుమిగూడి ఉన్నారు. వాళ్ళను దాటి అక్కడకు నిన్ను ఎవరూ వెళ్ళనివ్వరు. కనుక నీ ప్రయత్నం విరమించుకో!” అని చెప్పారు. అప్పుడు నిరూపానంద మాతో “ఏముంది! స్వామివారు ఇచ్చిన అమ్మవారి మంత్రం ఉంది కదా...! ఆయనే అన్నారుగా, నీకు ఏది కావాలన్నా అమ్మనే అడగమని. అడుగుతాను. కొడుకు అడిగితే ఆ మాత్రం ఇవ్వదా ఏమిటి? అదీగాక ఇదేమన్నా నా కోసం అడుగుతున్నానా? స్వామివారి కోసమే కదా! వారు చెప్పిన పని చేసేయడమే, అమ్మను అడిగేయడమే!” అన్నాడు. ఇక్కడ నిరూపానందకు ఒక రకమైన తిక్క ఉంది. ఎవరైనా “ఈ పని జరగదు” అంటే “ఎందుకు జరగదు. మనం కనీస ప్రయత్నమైనా చేశామా! లేదు కదా! కావాలంటే ప్రయత్నించి ఓడిపోదాం. అసలు ప్రయత్నమే చేయకుండా రాదు, కాదు, జరగదు అంటే ఎలా?" అని వాదించి, ఆ పనికి పూనుకునే ఒక రకమైన మొండిఘటం. ఒక విధంగా గురుదేవులకు కూడా వాడి ఆ పిచ్చి చేష్టలే నచ్చుతాయేమో అనిపిస్తుంది, ఆయన వీడిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకునే విధానం చూసి.
ఏమో...! లోగుట్టు పెరుమాళ్ళుకెరుక!
ఇలా మా మాట వినకుండా నిరూపానంద శ్రీసామవేదం వారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఆడిటోరియంలో శర్మగారు, వారి మాతృశ్రీ గారితో పాటు ముందువరుసలో కూర్చుని ఉంటే, చాలామంది ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడాలని, ఆశీర్వాదం తీసుకోవాలని వేచి ఉన్నారు. ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండగా, అంతమంది జనాలను దాటి వారిని చేరడం, శ్లోకం గురించి అడగడం చాలా కష్టంగా తోచింది మనవాడికి. కానీ ‘మొండివాడు రాజుకన్నా బలవంతుడు’ అనే సామెత లాగా, మన మొండిఘటం అమ్మవారిని ఇలా ప్రార్థించాడు. “అమ్మా...! స్వామివారు నన్ను శమీవృక్ష శ్లోకం గురించి తెలుసుకు రమ్మని పంపారు. ఇప్పటి వరకు దొరకలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఈ సామవేదం వారి వద్దకు వచ్చాను. నువ్వేం చేస్తావో తెలియదు. నేను నీ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తాను. ఆలోగా నా ప్రయత్నం లేకుండానే ఎవరో ఒకరు నా వద్దకు వచ్చి, నన్ను వారి వద్దకు తీసుకు వెళ్ళాలి. సామవేదం వారు నన్ను చూశాక, ఆ శ్లోకాన్ని నాకు బోధించాలి. ఇది జరుగవలసినదే. నా కోసం అడగడం లేదు. స్వామి వారి కోసం అడుగుతున్నాను. కనుక నువ్వు ఆ మంత్రం నాకు ఈ సామవేదం వారి ద్వారా తెలియజేయవలసినది. నువ్వు చేస్తున్నావు. నేను చూస్తున్నాను” అని చెప్పి మంత్రం జపం మొదలుపెట్టాడు. చెప్పాను కదా! మనవాడు జగమొండి అని. హాస్యాస్పదం విచిత్రం ఏమిటంటే వీడు అమ్మ వారిని, స్వామి వారిని “ఇలా జరగాలి” అని గట్టిగా అడుగుతాడు. అది వాడి మూఢనమ్మకమో లేక వారి మీద ఉన్న ఆరాధనో లేక అదో రకమైన వింత ప్రవర్తనో లేక పసి పిల్లల మనస్తత్వమో తెలియదు. వాడు అలాగే అడుగుతాడు. ఒకవేళ ఆ పని జరుగక పోతే మాత్రం బాధ పడడు. అమ్మను గాని, స్వామిని గాని ఏమీ అనడు. అదేంటి అంటే... “మనం అడుగుతాం! అది మన ధర్మం. ఇవ్వాలో వద్దో అది వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకపోయినా నాకు సమ్మతమే!” అంటాడు. “ఇది వారి మీద నీకు ఉన్న భక్తా? లేక ప్రేమా?” అని అడిగితే మాత్రం, నాకు అవేమీ తెలియదు, లేవు కూడా. అవన్నీ పెద్ద పదాలు. నాకు అమ్మ అన్నా, స్వామివారు అన్నా కేవలం చెప్పలేనంత ఇష్టం మాత్రం ఉంది. అంతే” అంటాడు. ఇలాంటి అడ్డదిడ్డమైన మాటలను ఏమని అంటాం?
సరే! ఇక విషయంలోకి వద్దాం.
మన వాడు శ్రీప్రత్యంగిర అమ్మవారి మంత్ర జపం మొదలు పెట్టి రెండుసార్లు జపించి, మూడవసారి మొదలు పెట్టగానే ఎవరో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి, “సామవేదం వారిని కలవాలనుకుంటున్నారు కదా! రండి” అని పిలిచాడు. ఇప్పడు మొదలైంది మన వాడి పైత్య ప్రకోపం. మన వాడు కోరుకున్నదే కదా అమ్మ ఇచ్చింది. అయినా సరే వెంటనే నిరూపానంద “నాకు అవసరం లేదు” అన్నట్టు తలా అడ్డంగా ఊపాడు. అలా మూడవ సారి చేస్తున్న మంత్ర జపం కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే మనవాడికి అనుమానం ఎక్కువ. ఇదేదో కాకతాళీయం అనే భావన పాపం. కానీ ఆయన ఊరుకోకుండా “ఇంతసేపు ఇక్కడ ఉండి, ఇప్పడు వద్దు అంటారేంటి? మీరు రండి మాష్టారు” అని చేయి పట్టుకుని (ఇంతకు ముందు కథలో ఎవరో ఒకతను బాలు గారి దగ్గరకు తీసుకెళ్ళినట్టు), అన్నంతినను, బడికి వెళ్ళను అని మారాంచేసే చిన్న పిల్లాడి చేతిని పట్టుకుని అమ్మ లాక్కెళ్ళినట్టు, అక్కడ అడ్డంగా ఉన్న వారందరినీ ప్రక్కకు జరగమని గదమాయిస్తూ, అందరూ ప్రక్కకు జరిగి దారి ఇవ్వగా సామవేదం వారి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఇప్పడు మనవాడికి ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు, ఏమి చేయాలో తత్త్వం బోధ పడలేదు. అప్పటికి మూడవ సారి చేస్తున్న మంత్రం జపం పూర్తి అయింది.
సామవేదం వారి పాదాలకు నమస్కరించి, గరుడ ముద్రలో ఉండి, “విద్యార్థినై వచ్చాను. విద్యాభిక్ష కావాలి” అని దోసిలి పట్టి అడిగాడు. దానికి సామవేదం వారు చిరుమందహాసంతో “ఏమి కావాలి?” అని అడిగేంతలో, మనవాడు “శమీవృక్ష పూజ...” అని చెప్పేటంతలో, సామవేదం వారు మరియు వారి మాతృమూర్తి ఇద్దరూ ఆ శ్లోకాన్ని
“శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ| అర్జునస్య ధనుర్థారీ, శ్రీరామస్య ప్రియదర్శిని||”
అని ఉపదేశించారు. మనవాడికి అసలే జ్ఞాపక శక్తి ఎక్కువ. కనుక “ఒక్క నిముషం స్వామీ వ్రాసుకుంటాను”
అని కాగితం, కలం కోసం వెదకుతుండగా, సామవేదం వారే, ప్రక్కనున్న వ్యక్తిని “ఒక కాగితం,
కలం ఇవ్వడి ఈ అబ్బాయికి” అని చెబితే, వాళ్ళు ఇచ్చారు. వారు ఒక్కొక్క పదాన్ని సవివరంగా
చెబుతూ ఉంటే, మనవాడు త్వరపడకుండా మెల్లగా వ్రాసుకున్నాడు. ఇక్కడే చిత్రమైన సంఘటన జరిగింది.
మన వాడు వచ్చిన పని అయిపోయింది కదా అనుకునే లోగా, సామవేదం వారు “దీనితో పాటు ఒక మంత్రం
కూడా ఇస్తాను. అది కూడా చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఒనగూడుతాయి” అని చెప్పి, నిరూపానంద
అడుగకుండానే దగ్గరకు రమ్మని, బీజాక్షర సహితంగా ఒక అమ్మవారి మంత్రాన్ని ముమ్మారు ఉపదేశించారు.
ఆలోచిస్తే అంతా చిత్రంగా ఉండి కదా! మన వాడికి మహద్గురుదేవుల కృపాకటాక్ష వీక్షణల బలంతో ఒకదాని కోసం వెడితే, ఇంకొకటి కూడా దొరికింది, అందులోనూ ఉపదేశం అయింది. ఈ విషయాలను తలచుకుంటున్నప్పుడు, అంతెందుకు ఇలా వ్రాస్తున్నప్పుడు కూడా నాకు రోమాంచితం అవుతున్నది, ఒక మూర్ఖుడిని పరమగురువులు ఇంతలా ఆదరిస్తారా అని ఆలోచిస్తే!
మనవాడు పరమానందభరితుడై, ఏదో పెద్ద బహుమతి సాధించినవాడిలా సామవేదం వారు ఇచ్చిన ఫల ప్రసాదాన్ని తీసుకుని, వారి పాదాలకు నమస్కరించి “ధన్యోహం!” అని చెప్పి, వెనుదిరిగి, మా అందరి దగ్గరకు వచ్చి “చెప్పానా...! అప్పుడే స్వామి చెప్పినట్టు అమ్మ ఏదైనా ఇస్తుందని” అని చిన్నపిల్లాడి “దొరికింది స్వామీ!” అని ఆనందంగా చెప్పాడు. అందుకు స్వామివారు నిరూపానంద బుగ్గ గిల్లి, తలనిమిరి “నాకు తెలుసు శివా...! నువ్వు సాధిస్తావని, అమ్మ నీకు సహాయం చేస్తుందని” అని చెప్పి, ఆ మంత్రాన్ని నిరూపానంద చెప్పక మునుపే వాటిని అతనికి చెప్పారు. దానికి మనవాడు “అదేంటి? మీకు ఇది తెలుసు కదా! మరి నన్నెందుకు వెదుకమని అక్కడికి, ఇక్కడికి ఇన్ని రోజులు, ఇంతలా తిప్పారు” అని అడిగాడు. అందుకు స్వామివారు చిరు మందహాసంతో "ఇప్పడు నువ్వు ఎమ్మెస్సీ మాత్రమే చేశావు. భవిష్యత్తులో నీవు చాలా పరిశోధనలు, ప్రయోగాలు చేయవలసి ఉన్నది శివా...! ఇంకా చాలా చదువుకోవాలి. దానికి చాలా ఓపిక, సహనం, శ్రద్ధ, పట్టుదల, దీక్ష, ఎవరు ఏమన్నా భరించి, వారి వద్ద నుండే అన్నీ సాధించుకునే ఓర్పు, నేర్పు... ఇలా ఎన్నో నీకు అలవాటు కావాలి. అందుకే నీకు ఇలా అలవాటు చేస్తున్నాను శివా...!" అని ఆశీర్వదించి పంపారు.
ఇందులో ఈ భిక్షువుకు అవగతమైన విషయం ఏమిటంటే, నాలాంటి, నిరూపానంద లాంటి వాళ్ళు ఎప్పుడూ వెంటనే జరగాలి అనే ప్రణాళికలు వేస్తూ ఉంటే, పరమగురువులు మాత్రం మాలాంటి అథములను ఎలా ఉద్ధరించాలి అనే దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అవి అర్థం కాక పనులు కాలేదని మేము క్రింద మీద పడిపోతూ ఉంటాం. అయినా మాలాంటి వారిని అనంతమైన సహనంతో భరిస్తూ, మమ్ములను తన చెంతనే ఉండే మహద్భాగ్యాన్ని ప్రసాదించిన మహద్గురుదేవులు శ్రీశ్రీశ్రీ... పూర్ణానంద స్వామీజీ వారికి ఎన్ని సార్లు సాష్టాంగ దండప్రణామములు ఒనరించినా అవి తక్కువే అవుతాయి.
మిగిలిన చరిత్ర తరువాయి భాగాలలో మాట్లాడుకుందాం! సరేనా...!
సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు ||