Thursday, May 21, 2026

ఆత్మపథ నిర్దేశకుడు – 12

0

 

ఓం నమో భగవతే పూర్ణానందాయ||

నిరూపానంద ఈ విధంగా ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన శ్రీపూర్ణానంద స్వామివారు ఇచ్చిన బీజాక్షరం సాధన చేస్తూ ఉండగా, స్వామివారిని ప్రత్యక్షంగా కలిసిన కొన్ని రోజులకు ఒక సంఘటన జరిగింది. ఒకనాడు తిరుపతిలోని అతని మిత్రుడు 'రెడ్డి' గారు ఉన్నారు కదా! అతను తనకు 'ఖేచరీ' మంత్రం ఉపదేశం అయిందని చెప్పి, ఆ సాధన చేస్తున్నాను అని చెప్పారు. అదేమిటో తెలియని నిరూపానంద దాని గురించి అడుగగా, ఆయన ఆ మంత్రం విశేషాలు చెప్పి, ఆ మంత్రం తనకు శ్రీసత్యానంద స్వామి వారు ఇచ్చారు అని, కానీ దానిని తన అనుమతి లేనిదే ఎవరికీ ఇవ్వరాదని చెప్పారు కనుక ఆ మంత్రం మాత్రం చెప్పలేనని తెలిపారు. దానితో బాటు 'షణ్ముఖి' విద్య గురించి కూడా తెలిపారు. అసలు ఈ మంత్రాల గురించి మన నిరూపానందకు కనీస అవగాహన కూడా లేదు. నిజానికి అతను చేసే పూజలలో దేవతా అష్టోత్తర శత, సహస్ర నామాలు, కవచాలు ఉంటాయి గాని, ఇలాంటి మంత్రాలు తెలియవు. అదీగాక ఆ రెడ్డిగారు కుండలినీ విద్య, సాధన గురించి, ఆయుర్వేద వైద్యవిధానాలు, ఔషధాలు, రహస్యాల గురించి చెబుతూ ఉండేవారు. నిరూపానందకు అవేవీ ఎక్కకపోయినా, అర్థంకాక పోయినా పెద్దవారు చెప్పే ప్రతి మాట వినే అలవాటు ఉండుట వలన, శ్రద్ధగా ఆసాంతం వినేవాడు.

ఒకసారి నిరూపానంద శ్రీసత్యానంద స్వామి రూపంలో ఉన్న శ్రీపూర్ణానంద స్వామివారిని కలిసినప్పుడు, వారి పాదసేవ చేస్తూ, వారితో  ఆ విద్యల గురించి రెడ్డిగారు చెప్పారు అని తెలుపగా, స్వామివారు  "నీకు అవి అవసరం అనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాడిని శివా! నీకు ఎప్పుడు, ఏది ఇవ్వాలో నీ గురువుకు తెలుసు శివా!" అన్నారు. మనవాడికేమో తన గురువు ఎవరో తెలియదు. అతను స్వామివారితో "నాకు ఆ మంత్రాల గురించి తెలియదు, వాటి అవసరం ఏమైనా నాకు ఉందేమో కూడా తెలియదు. నేను కేవలం అయన చెప్పిన విషయం మీతో చెప్పానే తప్ప, వాటి కోసం నేను ఆశించడం లేదు" అని వినయంగా చెప్పాడు. అందుకు సంతసించిన శ్రీగురుదేవులు నిరూపానందను ఆశీర్వదించి పంపారు.

ఈ చరిత్రను కొనసాగించే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ రెడ్డిగారు మరియు నిరూపానంద మధ్య ఉన్న బంధం ఒక అవినాభావ బంధం. కొందరు అది' ఆవు-దూడ' బంధం అని కూడా అనేవారు. రెడ్డిగారికి ఏమి తెలిసినా అది నిరూపానందకు చెబుతారు, అలాగే నిరూపానందకు ఏ విషయం తెలిసినా రెడ్డిగారికి చెబుతాడు. ఆ చెప్పేవాటిలో తనకు గురూపదేశం అయిన మంత్రాలు, సాధనలు, తనకు అయిన దర్శనాలు, వాటి విశేషాలు కూడా చెప్పేవాడు. ఎందుకు ఇలా చేస్తాడంటే, నిజానికి రెడ్డిగారు అత్యంత మంచి మనిషి. ఎవరికీ హాని చేసేవాడు కాదు. అలాగే మనలో చాలామంది అతను చేసే కొన్ని పనుల వంటివి పట్టించుకోము. ఉదాహరణకు మన నడుస్తూ వెళ్ళే దారిలో అక్కడక్కడ రాళ్ళు, ముళ్లు ఉంటే మనం మహా అయితే కొన్ని మాత్రం ఏరుకుంటూ, పక్కకు తొలగిస్తూ వెడతామేమో! కానీ రెడ్డిగారు అలా కాదు. ఎంతదూరం వీలైతే అంత దూరం వాటిని ఏరడం, పక్కన పడేయడం, లేదా కాలితో పక్కకు నెట్టడం. ఇలా దారిపొడుగునా చేస్తూనే ఉండేవారు. అలాగే తోటి ప్రాణుల పట్ల, మూగజీవుల పట్ల చాలా ప్రేమ చూపేవారు. అదే అలవాటు నిరూపానందకు కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ అలిపిరి వైపు నుండి కాలినడకన తిరుమలకు వెడుతూ ఉండేవారు. అది కాస్తా దాదాపు 20 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలపాటు, ఏ వాతావరణ పరిస్థితులోనైనా, ఎలా ఉన్నా ప్రతి శనివారం తిరుమలకు నడిచి, లేదా ద్విచక్రవాహనంలో వెళ్ళడం, అక్కడ సాధన చేయడం అలవాటుగా మారింది. నిజానికి నిరూపానంద జీవితంలో జరిగిన ప్రతి సాధనకు, దర్శనాలకు, నిదర్శనాలకు, అద్భుతాలకు అన్నింటికీ  ప్రత్యక్ష సాక్షులు కొందరు ఉన్నారు. వారిలో ఈ రెడ్డిగారు మరియు ఇది వ్రాస్తున్న భిక్షువు కూడా ఉన్నారు. ఈ రెడ్డిగారు నిరూపానందకు కనిపించిన, తెలిసిన మంత్రాలు, దర్శనాలు అన్నీ విపులంగా వ్రాసేవారు.  

ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు 'రెడ్డి' గారు, తనకు స్వామివారు 'శ్రీప్రత్యంగిర' అమ్మవారి మంత్రం ఇచ్చారని, అది నిరూపానంద కూడా చేయవచ్చునని తెలిపారు. అందుకు నిరూపానంద అంగీకరించక, ఉగ్రదేవత ఉపాసన చేయడం పట్ల  నాకు ఆసక్తి లేదు అని తెలిపాడు. అయినా అతనిని ఒప్పించి, 'రెడ్డి' గారు ఆ మంత్రం అతనికి నేర్పారు. మరి మనవాడు సామాన్యుడు కాదుగా, నేరుగా వెళ్ళి సత్యానంద స్వామివారి పేరుతో నిరూపానందను అనుగ్రహిస్తున్న, శ్రీపూర్ణానంద స్వామివారికి ఆ మంత్రం గురించి చెప్పాడు. అది వినగానే స్వామివారు ఒక్కసారిగా అతని కళ్ళలోకి సూటిగా చూశారు. మనవాడికి ఏం చేయాలో తెలియలేదు.

అప్పుడు స్వామి వారు ఆ మంత్ర సాధన అతను చేయవచ్చునా? లేదా? ఏమన్నారు?

ఆ వివరాలు తదుపరి భాగంలో చూద్దాం.

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు|| 

 [PU1]

Wednesday, May 20, 2026

ఆత్మపథ నిర్దేశకుడు – 11

0

 మహద్గురు శ్రీపూర్ణానంద స్వామివారిని నిరూపానంద కలవడానికి మూడేళ్ళ క్రితం ఒక 55-60 ఏళ్ళ వయస్సు కలిగిన ఒక అపరిచిత బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చారు. ఆయన స్ఫురద్రూపి, చక్కని తేజస్సుతో కూడిన ముఖవర్చస్సు కలిగిన వారు. ఆయన నిరూపానంద ఇంటికి వచ్చి దాహంగా ఉంది, మంచి నీరు కావాలని అడిగారు. వచ్చిన వారు ఎవరో తెలియదు.  కానీ నిరూపానంద యొక్క తల్లిగారు, వారిని లోపలికి ఆహ్వానించారు.  వారికి మంచినీరు సమర్పించాక, ఆయన తన కుమార్తె వివాహం చేయడానికి తగిన ధనం లేక, సహాయం కోసం తిరుగుతూ ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. గమ్మత్తు ఏమిటంటే ఆ కాలనీలో ఆయన మరియొక ఇంటికి వెళ్ళకుండా, ఎవరినీ కలవకుండా  నేరుగా నిరూపానంద ఇంటికి మాత్రమే రావడం.  నిరూపానంద తల్లి ఆయనను ఏమైనా తింటారేమో అని అడిగారు. ఆయనకు ఆకలిగా ఉండుట వలన వారికి భోజనం పెట్టాక, తరువాత కాసింత విశ్రాంతి తీసుకుని, నిరూపానంద తల్లి ఇచ్చిన చీర, రవికె, కొద్దిగా  పైకం తీసుకున్నారు. అటు పిమ్మట నిరూపానందను  పిలిచి, "నీ గురువు నీకు దర్శనం ఇచ్చే సమయం ఆసన్నమయింది. అందుకు నేను ఒక బీజాక్షరం చెబుతాను. దానిని నీ శ్వాస ఎన్ని సార్లు నడుస్తుందో, అన్ని సార్లు జపం చేయడానికి ప్రయత్నించు. ఏ నియమాలు నీకు అవసరం లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ జపం కొనసాగించు. భవిష్యత్తులో  నీ గురువు నీకు దర్శనం ఇచ్చాక  అదేంటో నీకు అర్థం  అవుతుంది"  అన్నారు. ఇవన్నీ జరిగినది నిరూపానంద అంత క్రితం తాను తన గురువు అని అనుకున్న ఆ క్షుద్ర తాంత్రికుని వదలి వేసిన తరువాత. అసలే ఒకడిని నమ్మి 13 ఏళ్ళు కోల్పోయిన జీవితం. ఇప్పుడు అలా మరియొకరిని నమ్మవచ్చా? లేదా? అనేది తెలియదు. ఏదేమైనప్పటికీ వారి పవిత్రమైన ముఖవర్చస్సు చూశాక, నిరూపానంద మరియొక మాట మాట్లాడక సరేనన్నాడు. వెంటనే ఆయన నిరూపానందకు ఆ బీజాక్షరం ఉపదేశించారు. వారి పాదాలకు సాష్టాంగదండప్రణామములు ఆచరించిన నిరూపానంద శిరస్సు నిమిరి, ఆశీర్వదించి, వారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటి వరకు కనబడలేదు. శ్రీపూర్ణనందుల వారిని చూశాక గాని, నిరూపానందకు అర్థం కాలేదు, వచ్చినది వారేనని. అదీగాక శ్రీపూర్ణానందుల వారు నిరూపానందకు మొదటగా ఇచ్చిన ఒక మహామంత్రంలోని బీజం కూడా అదే (దాని గురించితరువాత చెప్పుకుందాం). అప్పటికి గాని మన వాడికి బుర్రలో విషయం వెలగలేదు. అదే మాట శ్రీపూర్ణానంద స్వామీజీతో అన్నప్పుడు వారు కేవలం నవ్వి, 'అలాగా శివా! మంచిది' అన్నారు తప్ప, ఆ వచ్చింది 'నేనే' అని మాత్రం చెప్పలేదు.  చిత్రం ఏమిటంటే "ఆ వచ్చినది మీరేనా?" అని నిరూపానంద స్వామి వారిని అడగ  లేదు, వారు కూడా చెప్పలేదు. కానీ ఆ విషయాన్ని శ్రీకృష్ణానందేశుల వారికి చెప్పగా, వారు నవ్వి "ఇప్పటికి అర్థం అయిందా!" అని చిరునవ్వుతో తలపై చిన్నగా చరిచి, నిమిరి "నీ గురువుకు నీ మీద అపారమైన ప్రేమరా! అందుకే అనుక్షణం నిన్ను అంటిపెట్టునే ఉన్నారు. కానీ కర్మ పరిపాకం అయ్యేదాకా నీకు సత్యం బోధపడలేదు. అసలు వారే లేకపోతే నువ్వు ఎపుడో పోయి ఉండేవాడివి" అన్నారు. అప్పుడు నిరూపానంద వారిని "నేనేమీచేయను కదా! నాకేమీ రాదు కదా!  అయినా నా మీద వారికెందుకు ఇంత కరుణ, ప్రేమ, వాత్సల్యం" అని అడుగగా, వారు నవ్వుతూ "గురువు ప్రేమకు కారణాలు శిష్యుడికి అర్థం కావు, ఆ అవసరం కూడా లేదు. అది గురువుకు మాత్రమే తెలుసు. నువ్వేం చేయక పోయినా అన్నీ వారే చూసుకుంటున్నారు. కేవలం వారు చెప్పినప్పుడు, ఆ పనికి నువ్వు పనిముట్టుగా మారడానికి సిద్ధపడితే చాలు. నిజానికి నిన్ను అలా మార్చేది కూడా వారే" అన్నారు. ఆలోచిస్తే మహాభారతంలో పాండవులు అన్నీ చేశాము అనుకున్నారు గానీ, చేసింది, చేయించింది అన్నీ జగద్గురు శ్రీకృష్ణపరమాత్ములే కదా!

అందుకే మన ముందుకు వచ్చిన వారు ఎవరో మనకు తెలియకపోయినా, మనం ఏదీ ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నా, ఇవ్వడం ఇష్టం లేకపోయినా, వారిని మనం కసురుకోవడం, అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడటం వంటి పనులు చేయకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చిన వారు ఎవరో మనకు తెలియదు కదా. పరమగురువులు, దివ్యపురుషులు ఎప్పడు, ఏ రూపంలో, ఏ సమయంలో వస్తారో తెలియదు. ఒకవేళ వచ్చినవారు తప్పుడు ఉద్దేశ్యంతో వచ్చారేమో అనే భావన మనలో ఉంటే, మర్యాదగానే తప్పుకోవడం మంచిది, అంతే గాని అమర్యాదగా మాత్రం ప్రవర్తించరాదు.

అర్థం చేసుకున్నవారికి అర్థం అయినంత.

అంతేగా సాధకా!

తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు!

 

ఆత్మపథ నిర్దేశకుడు – 10

0

ఇలా శ్రీదక్షిణామూర్తి వారి మూర్తిదర్శనం జరిగిన పిమ్మట, ఒకనాడు మనం అపుడెప్పుడో మాట్లాడుకున్న, నిరూపానంద హితుడైన రెడ్డిగారు నిరూపానందతో శ్రీనృసింహస్వామివారిని ఆరాధించమని చెప్పారు. నిరూపానంద దానికి ససేమిరా అంగీకరించలేదు. ఎందుకంటే అతని బంధువులలో కొందరు నృసింహ స్వామివారిని పూజిస్తే, ఆయన ఉగ్రమూర్తి కనుక నిరూపానందకు కూడా విపరీతమైన కోపం పెరిగిపోతుందని, దానివలన అతను మతిభ్రమణకు గురి అయ్యే అవకాశం చాలా ఉందని, ఇలా లేనిపోని పనికిమాలిన మాటలు చెప్పడం వలన, అతను శ్రీనృసింహ స్వామివారు అన్నా... శ్రీమహాకాళి అన్నా... ఇతర ఉగ్రదేవతలు (విషయం తెలియక పోవుట వలనఅలాభావిస్తే) అన్నా... చాలా దూరంగా ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే, వారి ఆరాధన వలన తన జీవితం దారితప్పుతుంది అని భావించేవాడు. కానీ అతని భావనలు, అతని బంధువుల మాటలు, ఎంతటి సత్యదూరాలో, తదనంతర కాలంలో మాత్రమే అతనికి అవగతమైంది (కేవలం శ్రీగురుని అనుగ్రహం వలన మాత్రమే).

ఇలా ఆ రెడ్డిగారు అనగానే నిరూపానంద, నేను చేయనంటే చేయను అని వాదించాడు. ఈ సంభాషణ జరిగిన స్థలం యస్.వి. యూనివర్సిటీ గ్రంథాలయం మెట్ల మీద, రాత్రి సమయంలో. కానీ రెడ్డిగారికి మన మహామూర్ఖశిఖామణి నిరూపానంద సంగతి మహాబాగా తెలుసు, వీడు ప్రతి మంచి పనికి ముందు కాదు’ ‘వద్దుఅంటాడు, తర్వాత చేస్తాడు అని. అలా ఆ రెడ్డిగారి మాట కాదు అనలేక మన నిరూపానంద శ్రీనృసింహ కరావలంబ స్తోత్రంలో మొదటి శ్లోక మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు. తదనంతర కాలంలో, అతని జీవితంలో ఆ శ్రీగురు నృసింహులవారుఏ విధంగా పెనుమార్పులకు కారణం అయ్యారో... ఎందుకు శ్రీలక్ష్మీనృసింహులను అతను తన అమ్మ’ ‘నాన్నలుగా పూర్తిగా భావించడం మొదలుపెట్టాడో తర్వాతి భాగంలో చూద్దాం.

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు