ఇలా శ్రీదక్షిణామూర్తి వారి
‘మూర్తి’ దర్శనం జరిగిన పిమ్మట, ఒకనాడు మనం అపుడెప్పుడో మాట్లాడుకున్న, నిరూపానంద హితుడైన ‘రెడ్డి’ గారు నిరూపానందతో ‘శ్రీనృసింహస్వామి’ వారిని ఆరాధించమని చెప్పారు. నిరూపానంద దానికి ససేమిరా అంగీకరించలేదు. ఎందుకంటే అతని బంధువులలో కొందరు నృసింహ
స్వామివారిని పూజిస్తే, ఆయన ఉగ్రమూర్తి కనుక నిరూపానందకు కూడా విపరీతమైన కోపం పెరిగిపోతుందని, దానివలన అతను మతిభ్రమణకు గురి అయ్యే
అవకాశం చాలా ఉందని, ఇలా
లేనిపోని పనికిమాలిన మాటలు చెప్పడం వలన, అతను శ్రీనృసింహ స్వామివారు అన్నా... శ్రీమహాకాళి అన్నా... ఇతర ఉగ్రదేవతలు (విషయం తెలియక పోవుట వలన ‘అలా’ భావిస్తే) అన్నా... చాలా దూరంగా ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే, వారి ఆరాధన వలన తన జీవితం దారితప్పుతుంది
అని భావించేవాడు. కానీ
అతని భావనలు,
అతని బంధువుల మాటలు, ఎంతటి సత్యదూరాలో, తదనంతర కాలంలో మాత్రమే అతనికి అవగతమైంది (కేవలం శ్రీగురుని అనుగ్రహం వలన మాత్రమే).
ఇలా ఆ ‘రెడ్డి’ గారు అనగానే నిరూపానంద, నేను చేయనంటే చేయను అని వాదించాడు. ఈ సంభాషణ జరిగిన స్థలం యస్.వి. యూనివర్సిటీ గ్రంథాలయం మెట్ల మీద, రాత్రి సమయంలో. కానీ ‘రెడ్డి’ గారికి మన మహామూర్ఖశిఖామణి నిరూపానంద సంగతి మహాబాగా తెలుసు, వీడు ప్రతి మంచి పనికి ముందు ‘కాదు’ ‘వద్దు’ అంటాడు, తర్వాత చేస్తాడు అని. అలా ఆ ‘రెడ్డి’ గారి మాట కాదు అనలేక మన నిరూపానంద ‘శ్రీనృసింహ కరావలంబ స్తోత్రం’లో మొదటి శ్లోక మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు. తదనంతర కాలంలో, అతని జీవితంలో ఆ ‘శ్రీగురు నృసింహులవారు’ ఏ విధంగా పెనుమార్పులకు కారణం అయ్యారో... ఎందుకు ‘శ్రీలక్ష్మీనృసింహు’లను అతను తన ‘అమ్మ’ ‘నాన్న’లుగా పూర్తిగా భావించడం మొదలుపెట్టాడో తర్వాతి భాగంలో చూద్దాం.
సర్వం
శ్రీపూర్ణానందార్పణమస్తు
0 comments:
Post a Comment