మళ్ళీ తెల్లవారింది. దైనందిన కార్యక్రమాలు జోరందుకున్నాయి. హడావుడి
మొదలైంది. బరువు బాధ్యతల హెచ్చరికలు మ్రోగుతున్నాయి. ఇలాంటి ఎన్నో
పరిస్థితుల మధ్య ‘వీడి’ మనస్సు పరుగులెడుతోంది. ఏం చేయాలో తెలియదు, ఎలా
మొదలు పెట్టాలో తెలియదు. కార్తీక మాసం ఆరంభం అయింది. మరి ఈ గురు సేవకుడు
ఏం చేయాలి? అనే సందేహం. ఏదో చేసేద్దామని నా మనస్సుకు ఆరాటం.
అప్పుడు నా బుద్ధి నా మనస్సును అడిగింది. “ఓ మనసా! ఎందుకే నీకింత తొందర...?” అని పాట పాడినట్టుగా. అప్పుడు నా మనస్సు అడిగింది “ఓ బుద్ధీ! నన్ను నియంత్రించాల్సిన దానివి నీవే కదా...! ఏం చేయాలో అర్థం కాక, ఎలా ఉండాలో తెలియక, ఏమీ చేతకాక ఇలా నేను ఉంటే, ఎందుకు నువ్వు నాకు దారి చూపడం లేదు. నాకు మంచి చెడు చెప్పాల్సింది నీవే కదా. నీకేం నువ్వు స్వతంత్రురాలివి... నాలాగా కాదు కదా!” అని.
అప్పుడు బుద్ధి మనస్సుతో “ఓ మనసా! నేను నిన్ను నియంత్రించడం అనేది నాకు ఇచ్చిన బాధ్యత. నీ పై స్థితిలో ఉన్నానే కాని, నేను స్వతంత్రురాలిని కాను. నాకు మార్గం చూపేది ‘జ్ఞానం’. అది చూపే బాటలోనే నేను నడిచి నీకు మంచి చెడు చెబుతాను” అని.
అప్పుడు నా మనోబుద్ధులు కలిసి నా జ్ఞానాన్ని ఇలా ప్రశ్నించాయి “అందరూ చెబుతున్నట్లు నీవు సర్వోన్నతురాలివి కదా...! మరి మాకు సరైన నిర్దేశన చేయవచ్చు కదా” అని. అప్పుడు జ్ఞానం ఈ విధంగా తెలిపింది. “ఓ మనోబుద్ధులారా! నేను సర్వోన్నతురాలిని కాదు. నాకు యజమాని ఉన్నారు. వారు సర్వోన్నతులు. వారే శ్రీశ్రీశ్రీ... గురుదేవులు. వారి కంటే ఏదీ ఎక్కువ కాదు. ‘బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వరుడు, వేదవిద్యాతత్త్వజ్ఞుడు, పండితుడు, పరమహంస, మహాయోగయోగేశ్వరులు, ప్రభువు, బ్రహ్మర్షి, భగవంతుడు, పరబ్రహ్మ...’ ఇలాంటి పేర్లకు నిజమైన సాకారం వారు. వారిని తప్ప ఇంకెవరికీ ఈ పేర్లు ఇవ్వకూడని వారు. ఆద్యంత రహితులు, వారే కాల స్వరూపమైనప్పటికీ వారు కాలాతీతులు. సగుణ రూపముతో కనిపించిననూ వారు నిర్గుణులు. అన్ని రూపములు వారే అయిననూ నిరంజనులు. సర్వము తానే అయిననూ సర్వాతీతులు. ఇది అది అని చెప్పడానికి వీలుకాని, చెప్పలేని, చెప్పకూడని సాక్షాత్ పరబ్రహ్మమే వారు. ఈ చరాచర జగత్తు అంతయూ వారి సంకల్పమే అయినప్పటికీ వారు సంకల్పరహితులు. వారికి మన మీద అవ్యాజమైన కరుణ, ప్రేమ భావనలు ఉన్నట్టుగా మనకు తెలిసినా.... వారు భావాతీతులు. మహాజ్ఞాని వలే కనిపించినా వారు జ్ఞానాతీతులు. నీవు, నేను, మనము అన్నీ తానే అయిన ఆ మహాప్రభువే... ఆ మహద్గురువే... ఆ సచ్చిదానంద పరబ్రహ్మమే నా యజమాని”.
ఇలాంటి చర్చ నాలో జరుగుతుండగా... అప్పుడే నాలో అంతర్వాణిలా శ్రీగురువాక్కు ఆదేశించడం మొదలెట్టింది... ఒకరి గురించి వ్రాయమని. ఈ మనిషి పేరు విన్నాక అతని గురించి, చిత్ర విచిత్రమైన అతని జీవన మార్గం గురించి చెప్పడం నాకు కష్టమేమో, అతనికి కలిగిన అనుభూతులు, శ్రీగురువులు అతనికి చూపిన అద్భుతాలు-దర్శనాలు-నిదర్శనాలు ఇవన్నీ చెప్పడం నా వల్ల కాదు కదా అనిపించింది. ఎందుకంటే వాటన్నింటికీ ప్రత్యక్ష సాక్షిని, అతనికి అత్యంత సన్నిహితుడను, స్నేహితుడను అయినప్పటికీ గుప్తంగా జీవనయానం సాగిస్తూ తన గురించి లోకానికి తెలియడం ఇష్టంలేని అతని గురించి చెప్పవచ్చునా అని సందేహం. కానీ గురువాజ్ఞ కదా. మరి ఆ వ్యక్తి గురించి విషయాలు, మహద్గురువులు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందుల వారు, శ్రీశ్రీశ్రీ...రాఖాడీబాబా వారు, శ్రీశ్రీశ్రీ...నిత్యానంద భగవాన్ వారు, శ్రీశ్రీశ్రీ... పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామి వారు, శ్రీశ్రీశ్రీ...కృష్ణానందేశుల వారు అతని జీవితాన్ని నడిపించిన తీరు, అతనికి గమ్యం చూపడానికి వారే అతనిని నడిపించిన వైనం... ఆహా...! వివరించడమే శ్రీగురులీలావిలాసాన్ని పునఃస్మరణ చేసుకోవడం కదా! అనిపించింది.
మరి ఈ గాధకు ఒక పేరు పెట్టాలి కదా! విచిత్రంగా శ్రీశ్రీశ్రీ...మహద్గురువులే ఆ పేరు కూడా సూచించారు.
అదే “ఆత్మపథ నిర్దేశకుడు”.
ఇంతకీ ఆ శ్రీశ్రీశ్రీ...మహద్గురువుల దర్శన, వీక్షణ, స్పర్శ భాగ్యములు
కలిగిన ఆ ‘యోగ’శాలి పేరు చెప్పనే లేదు కదూ.... వస్తున్నా... అక్కడికే...
వాడే “నిరూపానంద”.
ఇక ఈ ధారావాహిక కొనసాగుతుంది.
0 comments:
Post a Comment