నిరూపానంద పూజలు ఎక్కువగా చేసేవాడు. శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్పినట్లు
ఒకే చోట త్రవ్వితే నీళ్ళు పడతాయి గాని, కొంచెం ఒక చోట, ఇంకొంచెం మరియొక చోట
త్రవ్వితే లాభమేమి? అలా ఎంతకాలం? అలాగే ఈ నిరూపానంద కూడా కాసేపు ఈ మంత్రం,
మరి కాసేపు ఆ మంత్రం అనుకుంటూ అలా ఒక్కొక్కటి జపం చేస్తూ ఉండే వాడు.
ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. నిరూపానందలో జన్మతః ఒక విచిత్ర స్వభావం
ఉండేది. రోజులో చాలాసార్లు అతనికి ఏ ఆలోచనలు లేకుండా, మానసిక స్థబ్ధత
ఉండేది. అందరూ అతనిని అడిగేవారు ‘ఏమి ఆలోచిస్తున్నావు’ అని. ‘నేను ఏమీ
ఆలోచించడం లేదు. ఆలోచనా రహిత స్థితిలో ఉన్నాను’ అని ఎన్ని సార్లు చెప్పినా
ఎవ్వరూ నమ్మేవారు కాదు, ఇప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. కానీ అతని ధోరణి
అతనిదే. అలా ఆలోచనా రహితంగా ఉండడం అనేది ఏమిటో, మహద్గురువులు చెప్పేవరకు
అతనికి ‘ఎరుక’ కాలేదు. అవునులే...! అది వారి దివ్యానుగ్రహమేగా!
నిరూపానంద తన ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం అవ్వగానే, తనకు తెలియకుండానే ‘నారాయణ’ నామజపం మొదలెట్టాడు. నిలబడినా, కూర్చొన్నా, నిద్రపోయినా, మేల్కొన్నా, పలకరింపులో, ఆఖరికి విసర్జన వేళలో కూడా ‘నారాయణ’ నామస్మరణమే. ఆ నాలుగు అక్షరాలు శ్రీమహద్గురువులు వాటిచేత ఎందుకు జపం చేయించేవారో గాని, అది వాడి జీవన గమనాన్ని విపరీతంగా మార్చివేసింది. ఎవరినైనా అతను “నమో నారాయణ” అని పలుకరించేవాడు. అతనిని చూసి చాలా మంది అలాగే మొదలెట్టారు. ఇప్పటికీ కొందరు అతనిని అలాగే పిలుస్తారు కూడా ‘ఏం నమో నారాయణా’ అని.
అతనికి తెలీకుండానే ఒక పద్ధతిలో కూర్చునేవాడు. అలా కూర్చొనగానే అతనికి ఇంకా ఎక్కువగా మానసిక స్థబ్ధత ఏర్పడేది. తర్వాత అతను ఎవరినైతే గురువు అనుకుని ఒక క్షుద్ర తాంత్రికునికి వెట్టి చాకిరీ చేసేవాడో, అతను ఒకసారి నిరూపానందతో “ఇలా ‘వజ్రాసనం’లో కూర్చొనడం వల్ల, నిరంతరం ‘నారాయణ’ నామ జపం చేయడం వల్ల నా నుండి నువ్వు తప్పించుకుంటున్నావు. లేకపోతే ఎప్పుడో నా చేతిలో అయిపోయిఉండేవాడివి” అని అన్నాడు. కానీ మన పిచ్చి నిరూపానందకు ఇవేవీ అర్థం కావు, ఒకవేళ అయినా గురువులు ఎప్పుడూ అలాగే అంటారు, అది వారి అనుగ్రహ భాషణం అని భ్రమించేవాడు. తన బుద్ధి (ఆ రూపంలో ఉన్న మహద్గురువు – ‘యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత’ కదా) ఆ తాంత్రికుడి గురించి ఎంత హెచ్చరిస్తున్నా, మాయకు లోబడిన నిరూపానంద, తనలో తాను “నీకేం తెలీదు. గురు చరిత్రల గురువు ఎలా ఉంటారో చెప్పారుగా. ఇలా కూడా ఉంటారేమో. గురువుని అనుమానించడం పాపం” అని భ్రమలోనో, ప్రమలోనో ఉండిపోయేవాడు. ఇక్కడ శ్రీగురుచరిత్రను తప్పుపట్టడం లేదు, దానిలో చెప్పినది అర్థం కాని నిరూపానంద వంటి వారు ఎలా మోసపోతారో చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. ఆ తాంత్రికుడు తానే నిరూపానంద ఇంటిలో సమస్యలు కలుగజేసేవాడు, మళ్ళీ తానే వాటిని ఆపి, గురువుగా తాను అతనికి ఎంతో మేలు చేస్తున్నట్టుగా నటించేవాడు. ఆ తాంత్రికుడు చాలాసార్లు అతనిని తెల్లవారు ఝామున రమ్మని, అతనికి ‘కుండలినీ యోగం’ నేర్పుతానని చెప్పేవాడు. నిరూపానందకు ఆ యోగం గురించి ఏమీ తెలియదు. ఎవరో షట్చక్రాల గురించి చెప్పేవారు. ఇతను వినేవాడు. దాని వలన తనకు కలిగేది ఏమిటో కూడా తెలియని ‘వెర్రి నాగన్న’ మన నిరూపానంద. అందుకనే తనకు తెలీని ఆ యోగం గురించి తెలుసుకుందామని ఆ తాంత్రికుడితో ‘సరే’ అని చెప్పేవాడు. కానీ తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర లేచి ఏదైనా చేయగలిగే నిరూపానందకు, విచిత్రంగా ఆ తాంత్రికుడు చెప్పిన రోజు మాత్రం ‘నిద్ర’ లేవడం అయ్యేది కాదు, లేదా మరచిపోయేవాడు. ఇలా జరిగిన ప్రతిసారి ఆ తాంత్రికుడు ఇతనిని నువ్వు రాకపోవడం వల్ల అది కోల్పోయావు, ఇది కోల్పోయావు అని తిట్టేవాడు. చాలా సంవత్సరాల తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఆ సమయంలో నిరూపానంద ఆ తాంత్రికుడి వద్దకు వెళ్ళకుండా ఏదో ఒక వంకతో ఆపింది “శ్రీమహద్గురు పూర్ణానందుల వారు” అని. ఆ క్షుద్రుడికి కూడా తెలియదు, మహద్గురువులు ఈ లీలా నాటకాన్ని నిరూపానంద చేత ఆడిస్తున్నారని. అయినా పరమగురువుల లీలా నాటకాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా! ఆహా...! విచిత్రం కదా. శ్రీపరమగురువుల లీలలు చిత్రవిచిత్రం కదా! వారెవరో తెలియని, గురువు అంటే ఏమిటో ఎరుగని, కనీసం తమని పట్టించుకోని మన మహామూర్ఖశిఖామణి నిరూపానందను అడుగడుగునా కాపాడటం అనేది, చదవడానికి వినడానికి మీకు ఎలా ఉన్నదో నాకు తెలియదు గాని, నాకైతే ఇలా వ్రాస్తున్నప్పుడు ‘రోమాంచితం’ అవుతున్నది. ఎంతైనా మహద్గురువులు పరమ కరుణాసాగరులు కదా!
ఈ కథ ఇలా నడుస్తుండగా ఒకనాడు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందుల వారు అతనికి ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించి, స్వయంగా భిక్ష వేసి, ఆ నిరూపానందకు తామే మంత్రోపదేశం, యోగవిద్య అనుగ్రహించి కొన్ని సంవత్సరాలు తమతో ప్రత్యక్షంగా చరించే దివ్యానుగ్రహాన్ని ప్రసాదించారు. కానీ.... ఇవేవీ వారు శ్రీపూర్ణానందులుగా తెలిసేలా చేయలేదు... తమని తాము “శ్రీసత్యానందస్వామి”గా పరిచయం చేసుకుని తమ లీలా విలాసాన్ని వాడికి ప్రకటించారు. ఆ వివరాలు వచ్చే సంచికలో చదువుదాం. సరేనా...గురుబాంధవులారా...
ఓం నమో భగవతే పూర్ణానందాయ ||
0 comments:
Post a Comment