మహద్గురు శ్రీశ్రీశ్రీ... పూర్ణానందుల వారు నిరూపానందకు శ్రీసత్యానందుల
వారి రూపంలో అనుగ్రహించారని తెలుసుకున్నాం కదా! ఇక్కడ ఒక విషయం
చెప్పుకోవాలి. నిజానికి అక్కడ శ్రీసత్యానందుల వారు ఉండేవారు, కానీ
నిరూపానంద వచ్చినప్పుడు మాత్రం శ్రీపూర్ణానందుల వారు మాత్రమే కనపడేవారు,
మాట్లాడేవారు, ఉపదేశం చేసేవారు, ఎలా బ్రతకాలో నేర్పేవారు. ఏకకాలంలో అక్కడ
సున్నిపెంటలోనూ ఉండేవారు, ఇక్కడ వీడితోనూ ఉండేవారు. ‘వారికేం కర్మ
మహామూర్ఖశిఖామణి అయిన నిరూపానందను అనుగ్రహించడానికి వారే స్వయంగా రావాలా?
ఏం ఆ మాత్రం దానికి ఇంకెవరినో పంపవచ్చు కదా!’ అని అనిపించవచ్చు. ఏమో! వారు
వాడినెందుకు అలా అనుగ్రహించదలచారో ఎవరికి ఎరుక? బ్రహ్మర్షుల లీలలు చర్యలు
చూసి ఆనందించవలసినవే, అనుభవించవలసినవే కాని, ఇది ఎందుకు? అది ఎందుకు? అని
ప్రశ్నించే హక్కు, అధికారం, స్థాయి, సామర్థ్యం ఎవరికీ ఉండవు. అందుకే
నిరూపానంద ఎప్పుడూ “ఇదంతా వాడి (గురువు) బిచ్చం, కరుణ, కృప” అని అంటాడు.
‘బిచ్చం’ అనే మాట వినడానికి కాస్త మొరటుగా ఉన్నా, అది నిజమే కదా అని
అస్మదీయుడి అభిమతం. ఇక తరువాతి భాగంలోకి వెడదాం.
ఒకరోజు నిరూపానందను శ్రీసత్యానందస్వామి వారు ‘శ్రీదక్షిణామూర్తి’ మంత్రమును సంపాదించమని చెప్పారు. దాని అవసరం ఏముంది అని నిరూపానంద అడుగగా, “ఆ మంత్రం అవసరం నీకు ఉంది శివా...!” అని అన్నారు. ఎందుకో తెలీదు గాని స్వామివారు అడిగారు కదా అని నిరూపానంద ఆ మంత్రం కోసం చాలా వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు తెలిసి నిరూపానంద ఆ మంత్రం కోసం కనీసం రెండు నెలల పాటు తీవ్రంగా వెతికాడు. తన కోసం కాదు, స్వామి వారు అడిగారు అని. నిరూపానంద రామాయణ భారత భాగవతాలు, పురాణాలు మూలాగ్రంథాలు చిన్ననాటి నుండే చాలా చదివాడు, కానీ అతనికి మంత్రశాస్త్ర గ్రంథ పరిచయం తక్కువ. అతనికి ఆ మంత్రం ఏ గ్రంథంలో దొరుకుతుందో తెలియదు. అతని జీవితంలో ఒక మంత్రం కోసం ఇంతగా వెతకడం అదే మొదలు. ఒకసారి ఆ మంత్రం కోసం నిరూపానంద శృంగేరీపీఠానికి చెందిన ఒక స్వామి వారిని శ్రీదక్షిణామూర్తివారి మంత్రం ఎక్కడ దొరుకుతుందో చెప్పమని అడిగాడు, కానీ ఆ స్వామీజీ నిరూపానందతో “నీకు ఉపనయనం అయిందా? నీ సాధనా స్థాయి ఏమిటి?” ఇత్యాది ప్రశ్నలన్నీ అడిగారు. దానికి నిరూపానంద, ఆ మంత్రం తన కోసం కాదు అని, శ్రీసత్యానందస్వామి వారు అడిగారు అని, తనకు ఉపదేశం చేయనవసరం లేదు, కానీ అది ఎక్కడ లభ్యమవుతుందో మాత్రమే చెప్పమని కోరాడు. దానికి ఆ స్వామీజీ తాను ఏమీ చెప్పనని, వెళ్ళిపోమని చెప్పాడు. బాధగా వెనుదిరిగిన నిరూపానంద, తర్వాత తన కులపురోహితుల వద్దకు వెళ్ళి అడిగితే ఆయన సాయంత్రం ఇంటికి రమ్మని అన్నారు. ఆనాటి సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిన నిరూపానంద ఆయన ఇంటి ప్రహరీ (కాంపౌండ్) గేటు బయటే రెండు గంటలకు పైగా అలా కదలక మెదలక నిలబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆ పురోహితుడు అతనిని చూస్తూ కూడా, వేరే వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు గాని, ఇతనిని కనీసం లోపలికి రమ్మని చెప్పడు, వెళ్ళిపోమని చెప్పడు. రెండున్నర గంటల నిరీక్షణ అనంతరం ఆ కులపురోహితుడు నిరూపానందను పిలిచి “ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నించాడు. నిరూపానంద శ్రీదక్షిణామూర్తి మంత్రం ఏ గ్రంథంలో దొరుకుతుందో చెప్పమని, వెళ్ళి వెదుకుతానని అడుగగా “అటువంటిదేమీ నేను చెప్పను, నీవు వెళ్లవచ్చు” అని నిర్ద్వంద్వంగా చేప్పేసరికి, నిరాశతో తన ప్రయత్నం ఫలించలేదని వెనుదిరిగాడు. ఇక్కడ నిరూపానందకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే, తాను తనకు మంత్రోపదేశం అవసరం లేదు అని , ఆ మంత్రం దొరికే గ్రంథం ఎక్కడ దొరుకుతుందో మాత్రమే చెప్పమని ఎంత వినయంగా వారి పాదాలు పట్టుకుని అడిగినా, వారు విషయం చెప్పకపోగా అతనిని అవమానకరంగా, వెటకారంగా మాట్లాడటం. అది కూడా అతని మంచికే జరిగిందని, అసలు శ్రీసత్యానందులవారు నిరూపానందకు శిక్షణ నిమిత్తమై ఇలా పని చెప్పారని చాలా కాలం తర్వాత కానీ అర్థం కాలేదు. ఇలా ఆ ఊరిలో నిరూపానంద ఒక వారం పాటు ఉండి, విఫలయత్నుడై తిరిగి స్వామి వారి వద్దకు వచ్చి అన్నీ చెప్పాడు. అందుకు స్వామి వారు “ఇంత పట్టుదలతో కూడిన నీ ప్రయత్నం వ్యర్థం కాదు శివా...! ఇక సరిగ్గా ఏడు రోజులు వెతుకు. ఏడవ రోజు దొరుకుతుంది” అని చెప్పారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
“సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు”
0 comments:
Post a Comment