తిరుపతికి సమీపంలో ఉన్న ‘తొండవాడ’ అనే గ్రామంలో శ్రీఅగస్త్యేశ్వరస్వామి
వారి ఆలయం ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారు, శ్రీ పద్మావతీదేవి వారిని
వివాహం చేసుకున్నప్పుడు నూతన వధూవరులు వివాహమైన మొదటి 6 నెలల పాటు కొండకి
ఎక్కరాదు అను నియమం ఉండుట వలన, శ్రీఅగస్త్యమహాముని విన్నపమును అనుసరించి ఆ
6 నెలల కాలం ఆ నూతన వధూవరులు అక్కడే గడిపారు. అటుపిమ్మట తిరుమలకు వారు
కొత్త కాపురానికి వెళ్లే క్రమంలో వారు అక్కడ నివసించిన గుర్తుగా తొండవాడ
“శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి”గా ‘శ్రీనివాస మంగాపురం’ నందు వెలసినారు. ఆ
ఆలయంలో ఒక సాధువు కొన్ని సంవత్సరముల పాటు ఉండేవారు. వారే హృషీకేష్ నందు
ఉండిన శ్రీస్వామిశివానంద వారి ప్రశిష్యులు, శ్రీవిమలానంద వారి శిష్యులు ఐన
శ్రీసత్యానంద స్వామివారు.
ఇప్పుడు మన కథ మొదలెడదాం.
నిరూపానందను అతని స్నేహితుడు ఒకతను ఈ సత్యానందస్వామికి పరిచయం చేశారు. నిరూపానందను చూడగానే ఆయన “వచ్చావా శివా! ఇంత ఆలస్యం చేశావేంటి?” అని అడిగారు. కానీ మన నిరూపానంద మహామేధావి కదా! ‘ఈయన ఏమిటి ఇలా అడుగుతున్నాడు’ అని అనుకున్నాడు. కానీ పరిచయం అయిన కొన్ని నిముషాలలోనే ఇద్దరూ ఎప్పటినుండో పరిచయం ఉన్న వారివలె మాట్లాడుకోవడం జరిగింది. ఆయనలోని తేజస్సుకు ఆకర్షితుడైన నిరూపానంద అక్కడి నుండి రావడానికి ఇష్టపడకపోయినా, కుటుంబ బాధ్యతలు, తన చదువు ఇతరత్రా కారణాల వలన తిరిగివచ్చాడు. రాగానే తాను గురువుగా భావిస్తున్న, ఇంతకు ముందు చెప్పిన ఆ క్షుద్ర తాంత్రికుని వద్దకు వెళ్ళి, ఆ సాధువు గురించి చెప్పాడు. అది నచ్చని ఆ మోసగాడు ‘నీ గురువును నేను ఉండగా, ఇతరుల వద్దకు ఎందుకు వెళతావు’ అని నిరూపానందను మందలించాడు. కానీ ఎందుకో తెలియదు గాని నిరూపానందకు ఇది నచ్చలేదు. అతని మనస్సు మాటి మాటికీ ఆ సాధువు వద్దకు వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేది. ఆ సమయంలో విచిత్రంగా తిరుపతి నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ సాధువు అక్కడ నుండి నిరూపానందను రమ్మని పిలవడం... మొబైల్ ఫోన్లు లేని ఆ కాలంలో నిరూపానంద మనస్సులో ఆ సంకేతాలు అంది వెంటనే అక్కడికి వెళ్ళడం చాలాసార్లు జరిగేది. అక్కడికి వెళ్ళగానే అక్కడ పూలు వగైరా అమ్ముకునేవారు నిరూపానందతో “నువ్వు రావాలని స్వామి వారు ప్రొద్దున్న నుండి పిలుస్తున్నారు, మరి నీకు ఎలా తెలిసింది రావాలని” అని అడిగేవారు, ఇంకా “ఇందాక స్వామివారికి ప్రసాదం ఇస్తే ‘శివ’ వస్తాడు, వాడికోసం ఈ ప్రసాదం ఉంచాలి అని అన్నారు, ఇదిగో నువ్వు వచ్చావు” అని చెప్పేవారు.
సత్యానందస్వామి వారు నిరూపానందతో చాలా
విషయాలు మాట్లాడేవారు, ఎప్పుడూ ‘శివా...!’ అని ప్రేమగా పిలిచేవారు. అందులో
ఎక్కువగా కుండలినీ యోగసాధన గురించి, మహద్గురు శ్రీపూర్ణానందస్వామివారి
గురించి ఉండేది. వారు ఎప్పుడూ నిరూపానందతో “శివా...! నువ్వు ఇప్పుడు
‘గురువు’ అనుకుంటున్న వ్యక్తి నీ గురువు కాదు శివా! జాగ్రత్తగా ఉండు. అతను
నువ్వు అనుకునేటంత మంచి వ్యక్తి కాదు. నీ గురువు ఒక మహోన్నత వ్యక్తి.
నిన్ను సున్నిపెంటలో శ్రీపూర్ణానందస్వామివారి వద్దకు తీసుకు వెళ్ళాలి శివా!
వారే నీకు. ” అనేవారు (‘వారే నీకు’ అనేవారు గాని, ఆ ‘నీకు’ ఏమిటో వారు
చెప్పేవారు కాదు). కానీ శ్రీపూర్ణానందుల వారు నిరూపానందకు గురుదేవులు అని,
వారి భిక్షతోనే ఈ భిక్షువు బ్రతుకుతున్నాడనే విషయం మాత్రం చెప్పేవారు కాదు.
“ఇతను (తాంత్రికుడు) నాగురువు కాకుంటే మరి ఎవరు?” అని నిరూపానంద
అడిగినప్పుడు, వారు నవ్వుతూ “కాలం ఇంకా సమీపించలేదు శివా...! నువ్వు
అనుభవించాల్సిన కర్మలు ఇంకా చాలా ఉన్నాయి. సరైన సమయంలో నీ గురువు నీ వద్దకు
వస్తారులే” అనేవారు. మరికొన్నిసార్లు “మానస సరోవరంలో ఉండవలసిన ‘హంస’కు
ఇక్కడ ఈ బురదలో పని ఏమిటి శివా...! కర్మ కాకపొతే” అనే వారు. మన వాడికి
అర్థం అయ్యేది కాదు. ఇది జరిగింది 1995 కాలంలో.
నిరూపానందకు శ్రీపూర్ణానందుల వారి నామం వినగానే ఒక ఆత్మీయభావన కలిగేది గాని, ‘మాయ’ వల్ల మళ్ళీ బుద్ధి మరలిపోయేది. ఇలా ఉండగా ఒకనాడు శ్రీసత్యానందస్వామివారు నిరూపానందకు ఒక విచిత్రమైన అనుభూతిని కలుగుజేశారు. అదేమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం.
ఓం నమోభగవతే పూర్ణానందాయ||
0 comments:
Post a Comment