ఓం నమో భగవతే పూర్ణానందాయ||
నిరూపానంద ఈ విధంగా ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన శ్రీపూర్ణానంద స్వామివారు ఇచ్చిన బీజాక్షరం సాధన చేస్తూ ఉండగా, స్వామివారిని ప్రత్యక్షంగా కలిసిన కొన్ని రోజులకు ఒక సంఘటన జరిగింది. ఒకనాడు తిరుపతిలోని అతని మిత్రుడు 'రెడ్డి' గారు ఉన్నారు కదా! అతను తనకు 'ఖేచరీ' మంత్రం ఉపదేశం అయిందని చెప్పి, ఆ సాధన చేస్తున్నాను అని చెప్పారు. అదేమిటో తెలియని నిరూపానంద దాని గురించి అడుగగా, ఆయన ఆ మంత్రం విశేషాలు చెప్పి, ఆ మంత్రం తనకు శ్రీసత్యానంద స్వామి వారు ఇచ్చారు అని, కానీ దానిని తన అనుమతి లేనిదే ఎవరికీ ఇవ్వరాదని చెప్పారు కనుక ఆ మంత్రం మాత్రం చెప్పలేనని తెలిపారు. దానితో బాటు 'షణ్ముఖి' విద్య గురించి కూడా తెలిపారు. అసలు ఈ మంత్రాల గురించి మన నిరూపానందకు కనీస అవగాహన కూడా లేదు. నిజానికి అతను చేసే పూజలలో దేవతా అష్టోత్తర శత, సహస్ర నామాలు, కవచాలు ఉంటాయి గాని, ఇలాంటి మంత్రాలు తెలియవు. అదీగాక ఆ రెడ్డిగారు కుండలినీ విద్య, సాధన గురించి, ఆయుర్వేద వైద్యవిధానాలు, ఔషధాలు, రహస్యాల గురించి చెబుతూ ఉండేవారు. నిరూపానందకు అవేవీ ఎక్కకపోయినా, అర్థంకాక పోయినా పెద్దవారు చెప్పే ప్రతి మాట వినే అలవాటు ఉండుట వలన, శ్రద్ధగా ఆసాంతం వినేవాడు.
ఒకసారి నిరూపానంద శ్రీసత్యానంద స్వామి రూపంలో ఉన్న శ్రీపూర్ణానంద స్వామివారిని కలిసినప్పుడు, వారి పాదసేవ చేస్తూ, వారితో ఆ విద్యల గురించి రెడ్డిగారు చెప్పారు అని తెలుపగా, స్వామివారు "నీకు అవి అవసరం అనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాడిని శివా! నీకు ఎప్పుడు, ఏది ఇవ్వాలో నీ గురువుకు తెలుసు శివా!" అన్నారు. మనవాడికేమో తన గురువు ఎవరో తెలియదు. అతను స్వామివారితో "నాకు ఆ మంత్రాల గురించి తెలియదు, వాటి అవసరం ఏమైనా నాకు ఉందేమో కూడా తెలియదు. నేను కేవలం అయన చెప్పిన విషయం మీతో చెప్పానే తప్ప, వాటి కోసం నేను ఆశించడం లేదు" అని వినయంగా చెప్పాడు. అందుకు సంతసించిన శ్రీగురుదేవులు నిరూపానందను ఆశీర్వదించి పంపారు.
ఈ చరిత్రను కొనసాగించే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ రెడ్డిగారు మరియు నిరూపానంద మధ్య ఉన్న బంధం ఒక అవినాభావ బంధం. కొందరు అది' ఆవు-దూడ' బంధం అని కూడా అనేవారు. రెడ్డిగారికి ఏమి తెలిసినా అది నిరూపానందకు చెబుతారు, అలాగే నిరూపానందకు ఏ విషయం తెలిసినా రెడ్డిగారికి చెబుతాడు. ఆ చెప్పేవాటిలో తనకు గురూపదేశం అయిన మంత్రాలు, సాధనలు, తనకు అయిన దర్శనాలు, వాటి విశేషాలు కూడా చెప్పేవాడు. ఎందుకు ఇలా చేస్తాడంటే, నిజానికి రెడ్డిగారు అత్యంత మంచి మనిషి. ఎవరికీ హాని చేసేవాడు కాదు. అలాగే మనలో చాలామంది అతను చేసే కొన్ని పనుల వంటివి పట్టించుకోము. ఉదాహరణకు మన నడుస్తూ వెళ్ళే దారిలో అక్కడక్కడ రాళ్ళు, ముళ్లు ఉంటే మనం మహా అయితే కొన్ని మాత్రం ఏరుకుంటూ, పక్కకు తొలగిస్తూ వెడతామేమో! కానీ రెడ్డిగారు అలా కాదు. ఎంతదూరం వీలైతే అంత దూరం వాటిని ఏరడం, పక్కన పడేయడం, లేదా కాలితో పక్కకు నెట్టడం. ఇలా దారిపొడుగునా చేస్తూనే ఉండేవారు. అలాగే తోటి ప్రాణుల పట్ల, మూగజీవుల పట్ల చాలా ప్రేమ చూపేవారు. అదే అలవాటు నిరూపానందకు కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ అలిపిరి వైపు నుండి కాలినడకన తిరుమలకు వెడుతూ ఉండేవారు. అది కాస్తా దాదాపు 20 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలపాటు, ఏ వాతావరణ పరిస్థితులోనైనా, ఎలా ఉన్నా ప్రతి శనివారం తిరుమలకు నడిచి, లేదా ద్విచక్రవాహనంలో వెళ్ళడం, అక్కడ సాధన చేయడం అలవాటుగా మారింది. నిజానికి నిరూపానంద జీవితంలో జరిగిన ప్రతి సాధనకు, దర్శనాలకు, నిదర్శనాలకు, అద్భుతాలకు అన్నింటికీ ప్రత్యక్ష సాక్షులు కొందరు ఉన్నారు. వారిలో ఈ రెడ్డిగారు మరియు ఇది వ్రాస్తున్న భిక్షువు కూడా ఉన్నారు. ఈ రెడ్డిగారు నిరూపానందకు కనిపించిన, తెలిసిన మంత్రాలు, దర్శనాలు అన్నీ విపులంగా వ్రాసేవారు.
ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు 'రెడ్డి' గారు, తనకు
స్వామివారు 'శ్రీప్రత్యంగిర' అమ్మవారి మంత్రం ఇచ్చారని, అది నిరూపానంద
కూడా చేయవచ్చునని తెలిపారు. అందుకు నిరూపానంద అంగీకరించక, ఉగ్రదేవత ఉపాసన
చేయడం పట్ల నాకు ఆసక్తి లేదు అని
తెలిపాడు. అయినా అతనిని ఒప్పించి, 'రెడ్డి' గారు ఆ మంత్రం
అతనికి నేర్పారు. మరి మనవాడు సామాన్యుడు కాదుగా, నేరుగా వెళ్ళి
సత్యానంద స్వామివారి పేరుతో నిరూపానందను అనుగ్రహిస్తున్న, శ్రీపూర్ణానంద
స్వామివారికి ఆ మంత్రం గురించి చెప్పాడు. అది వినగానే స్వామివారు ఒక్కసారిగా అతని
కళ్ళలోకి సూటిగా చూశారు. మనవాడికి ఏం చేయాలో తెలియలేదు.
అప్పుడు స్వామి వారు ఆ మంత్ర సాధన అతను చేయవచ్చునా? లేదా? ఏమన్నారు?
ఆ వివరాలు తదుపరి భాగంలో చూద్దాం.
0 comments:
Post a Comment