ఆత్మపథ నిర్దేశకుడు – 13
అలా స్వామివారికి పాదసేవ (పాదాలు నొక్కడం) చేస్తున్న నిరూపానంద కళ్ళలోకి
చూసిన స్వామివారు, చిరునవ్వు
నవ్వి, “అది ప్రత్యంగిర మాలామంత్రం
శివా...! మూలమంత్రం వేరే ఉంది... అది ఉపదేశిస్తాను”
అన్నారు. అందుకు నిరూపానంద “నాకు మాలామంత్రం-మూలమంత్రాల మధ్య భేదం తెలియదు. అదీగాక
ఈ ప్రత్యంగిర ఎవరో తెలియదు. ఇంతకుముందు నరసింహ స్వామి మంత్రం చేయమంటేనే వద్దు
అన్నాను. ఇప్పుడు ఇది ఎందుకు నాకు? అవసరమా?
స్వామీ! నాకెందుకో తెలియని భయం కలుగుతోంది”అన్నాడు. అందుకు శ్రీపూర్ణానంద
స్వామివారు సుమధురమైన మందహాసంతో వాడిని చూచి, “ఇవన్నీ నువ్వు ఇంత క్రితం చేసినవే
శివా!” అన్నారు. బదులుగా నిరూపానంద “నేనా...? అసలు ఆ అమ్మవారి పేరు వినడమే
ఇప్పుడు. నేనెప్పుడూ ఆ మంత్రసాధన చేయలేదే!” అనగానే, స్వామి వారు “ఇప్పుడు అంటే ఈ జన్మలో
కాదు శివా...! క్రితం జన్మలలో నువ్వు
చేసిన సాధన ఇప్పుడు పూర్తి అయ్యే సమయం ఆసన్నమైనది. అందుకే అమ్మవారు 'రెడ్డి' ద్వారా నీకు తనను తాను
ప్రకటించుకున్నారు. నేను ఆయనకు గానీ, ఇంకెవరికీ మూలమంత్రం ఉపదేశించలేదు. ఇప్పుడు నీకు
ఉపదేశిస్తాను. దీనివలన నీకు ఎంతో మేలు ఒనగూరుతుంది. అమ్మ నీకు సర్వకాల
సర్వావస్థలలోనూ నీకు తోడుగా ఉంటుంది. ఎలాగూ నువ్వు తప్పుడు పనులకు దేనినీ వాడవు.
కనుక నీకు అర్హత ఉన్నది” అని పలికి, తన దగ్గరకు పిలిచి శ్రీ ప్రత్యంగిర మాలామంత్రం మరియు మూలమంత్రం
రెండింటినీ ఉపదేశించారు. అది విన్న వెంటనే నిరూపానంద "అరే! ఇదేంటి? మా ఇంటికి వచ్చిన బ్రాహ్మణులవారు
ఇచ్చిన 'బీజాక్షరం' ఇందులో ఉందేమిటి స్వామీ?" అని అడిగాడు. బదులుగా
స్వామివారు గుంభనంగా నవ్వుతున్నారు. మనవాడికి ఏమీ అర్థం కాలేదు. నేను అడిగితే ఈయన
నవ్వుతాడేంటి అని అనుకున్నాడు. పాపం ఈ పిచ్చివాడికి ఏం తెలుసు అప్పుడు కూడా
వచ్చినది వారేనని. గురువు ఎప్పుడు, ఎక్కడ,
ఏ రూపంలో, ఎందుకు తమ దర్శనం అనుగ్రహిస్తారో అనేది
మన వెర్రి నిరూపానందకు ఏం తెలుసు? అసలే మనవాడికి మర్కట లక్షణాలు ఎక్కువ, అంతకు మించి సందేహ ప్రాణి. అందుకే
స్వామి వారిని “ఈ మంత్రం సిద్ధి పొందాలంటే ఎన్ని లక్షలు చేయాలి. చాలామంది ఏదైనా
మంత్రాన్ని ఇన్ని వేలు, లక్షలు లేదా కోట్లు జపం చేయాలి, తద్దశాంశం హోమం లేదా తర్పణాలు, తద్దశాంశం బ్రాహ్మణ భోజనం... ఇలా ఏవేవో నియమాలు ఉంటాయి అంటారు
కదా! మరి నేనేం చేయాలి, ఎలా చేయాలి, నాకు
ఉన్న పరిస్థితులలో అవన్నీ చేయగలనా?” అని ప్రశ్నించగా, మహద్గురువులు వాడిని చూచి ప్రేమగా “అవేవీ నీకు అవసరం లేదు
శివా...! నీ దగ్గరకు వచ్చే
మంత్రాలు పూర్ణ సిద్ధిగానే వస్తాయి. నీవేమీ చేయనవసరం లేదు. జపం మాత్రం చేయి చాలు.
నువ్వు ఒక్కసారి చెప్పినా నీ వద్దకు వచ్చిన మంత్రాలు నీకు ఫలితాన్ని
అనుగ్రహిస్తాయి. శ్రీప్రత్యంగిర అమ్మవారు నీకు ఎప్పడు ఏ అవసరం వచ్చినా తీరుస్తుంది, నిన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంటుంది
శివా! నీకు ఏది కావాలన్నా అడుగు అమ్మవారు ఇస్తారు” అని చెప్పగా, అందుకు నిరూపానంద తన సహజ మర్కట చాపల్య
మనస్తత్వంతో “నిజంగానే అమ్మ నేను అడిగితే స్పందిస్తారా? నమ్మవచ్చా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే
సామెత ఉంది కదా స్వామీ! అది తప్పుడు అభిప్రాయం అయినప్పటికీ, అసలే కలియుగం, అందులోనూ నాలాంటి తక్కువ స్థాయి
వాడికి, ఏమీ రానివాడికి, స్థిరత్వమే లేని వాడికి కూడా అమ్మ
అనుగ్రహం దొరుకుతుందా? అయినా
అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి?” అని ప్రశ్నల, సందేహాల పరంపర గుప్పించాడు. అందుకు విసుగు ఏమాత్రం చెందని శ్రీపూర్ణానంద
స్వామీజీ "దానిదేముంది శివా!
పరీక్షిస్తే పోతుంది" అని
నవ్వుతూ అన్నారు. అందుకు నిరూపానంద "నేను మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలతో
విసిగిస్తాను కదా...! ఏవేవో సందేహాలు పెట్టుకుంటాను కదా...! అర్థం పర్థం లేని
విషయాలు అడుగుతాను కదా! మీకు కోపం రాదా? విసుగు పుట్టదా? స్వామీ!" అని అడిగాడు.
అందుకు స్వామివారు "అవన్నీ ఎందుకు శివా! నువ్వు ఏమైనా అడుగు. ఎన్నైనా
అడుగు. నేనేమీ అనుకోను. ఇక్కడ ఉన్నదే నీకు సమాధానాలు ఇవ్వడానికి, సరైన మార్గం చూపడానికి... నీ గురువు
నీ మీద చూపించే కృప అపారం శివా...! నిన్ను శ్రీశైలంలోని సున్నిపెంటకు పూర్ణానంద స్వామి
దగ్గరకు నిన్ను తీసుకు వెళ్ళాలి శివా...!
అప్పుడు తెలుస్తుంది నీకు అన్నీ ఏమిటో! అలాగే అమ్మవారి మంత్రాన్ని
పరీక్షిస్తే సరిపోతుంది కదా! ప్రయోగించి చూడు!" అన్నారు. అప్పుడు నిరూపానంద
"అదేంటి స్వామీ! ప్రయోగాలు అంటారు... అవి క్షుద్ర మాంత్రికులు, తాంత్రికులు చేసే పనులు కదా!" అని అడుగగా, స్వామివారు నవ్వి, "అలాంటిదేమీ లేదు శివా...!
రామాయణ, భారతాలలో , పురాణాలలో ఇలా అన్నింటిలో చెప్పిన, వాళ్ళు చేసిన అస్త్రప్రయోగాల
మాటేమిటి? అంతెందుకు? సంకల్పం చెప్పేటప్పుడు నువ్వు
చేస్తున్నదేమిటి? మంత్రం
సాధనలో 'జపే వినియోగః' అని చెప్పేది ఏమిటి? అలాగే ఏదైనా సరే సత్కార్యం కోసం, ఆత్మోద్ధరణ కోసం, మోక్షసాధన కోసం, లోకోపకారం కోసం చేసే కోరికలు, ప్రయోగాలు ఉత్తమం. అలా కాకుండా
ఎవరినో బాధ పెట్టడానికి, హింసించడానికి, చంపడానికి అలాంటి ప్రయోగాలు
క్షుద్రం అవుతాయి. 'క్షుద్రం' అంటే 'నీచం' అని. తప్పుడు ఆలోచనలతో చేసే
ప్రయోగాలు నీచమైనవి శివా...! నీకు చెప్పేది అమ్మవారి మంత్రం ఫలిస్తుందో, లేదో అని నువ్వు తెలుసుకొనడానికి
చేసే చిన్న ప్రక్రియ. అంతే!" అన్నారు. అప్పుడు నిరూపానంద "ఆ ప్రయోగం
చేయాలంటే నేనేమి చేయాలి? ఎలా తెలుసుకోవాలి" అని
అడిగాడు. అప్పుడు స్వామి వారు "నీకైతే ఏ పద్ధతులు అవసరం లేదు శివా...! అమ్మ
మంత్రం చెప్పు చాలు. అలాగే
భవిష్యత్తులో భౌతికంగా నువ్వు చేయాల్సిన
ప్రయోగాలు కూడా ఉన్నాయి శివా...! వాటికి అమ్మ నీకు సహాయం చేస్తుంది' అని, శ్రీప్రత్యంగిర మంత్రం యొక్క సాధనలో
తమ అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు.
అవి ఏమిటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం.
సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు||
0 comments:
Post a Comment