Thursday, June 4, 2026

ఆత్మపథ నిర్దేశకుడు – 14

0

 ఆత్మపథ నిర్దేశకుడు – 14


ఓం నమో భగవతే పూర్ణానందాయ||
మహద్గురు శ్రీపూర్ణానంద స్వామీజీ నిరూపానందకు శ్రీప్రత్యంగిర విద్య సాధనలో శ్రీసత్యానందస్వామి వారికి కలిగిన అనుభవాలలో కొన్నింటిని ఇలా వివరించారు. "సత్యానంద స్వామి యొక్క గురువు స్వామి విమలానంద. స్వామి విమలానంద వారి గురువు స్వామి శివానంద (హృషీకేశ్). ఈ సత్యానంద స్వామికి సన్యాసం యోగం ఉంది అని జాతకంలో చూసి తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆయన పసిబిడ్డగా ఉన్నప్పుడే, హృషీకేశ్ కి వెళ్ళి, ఆ బిడ్డను స్వామి శివానంద వారికి అప్పగించారు. స్వామి శివానంద మహద్గురువులు. నిజానికి సత్యానంద స్వామి స్వామి శివానంద వారి ఒడిలోనే ఆడుకునేవాడు కూడా. తర్వాత ఆయన స్వామి శివానంద వారి ప్రెస్ లో కొంతకాలం పనిచేశారు. శివానందుల వారు దేహత్యాగం చేసిన తర్వాత, ఒక సారి తన మోక్ష సాధనకు గురువు అనుగ్రహం లభించలేదనే బాధతో సత్యానంద స్వామి విషం త్రాగి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించబోతుండగా స్వామి విమలానంద వచ్చి "చేసింది చాల్లే! ఇక బయలుదేరు" అని, తనతో తీసుకు వెళ్ళారు. స్వామి విమలానంద, ఈ సత్యానంద స్వామికి శ్రీప్రత్యంగిర మంత్రం ఉపదేశించాక, ఆయన గంగానదీ తీరంలో ఆ మంత్రం సాధన చేస్తున్నప్పుడు రెండు రాయల్ బెంగాల్ పులులు ఆయనకు దగ్గరగా వచ్చి ఆడుకోవడం మొదలెట్టాయి శివా...! వాటిని చూడగానే ఆయనకు భయం వేసింది. వెంటనే ఆయన పరుగెత్తి గంగానదిలోకి వెళ్ళి నిలబడ్డారు. అవి అలాగే కాసేపు ఆడుకుని, తరువాత వెళ్ళిపోయాయి. అటు పిమ్మట స్వామి విమలానందను కలిసినపుడు తానేమీ చెప్పక మునుపే వారు "అలా ఎందుకు భయపడి పారిపోతావు, వచ్చింది అమ్మ అయితే. నిన్ను అనుగ్రహించడానికే కదా వచ్చింది! అంత మాత్రానికే భయపడి పారిపోతావా? అది కూడా గంగానది లోకి. ఏమి? అవి నదిలోకి రాలేవు అనుకున్నావా? ఈ విషయం ఎలా మరచి పోయావు?" అన్నారు.

స్వామి విమలానంద వారు కులు మనాలి దగ్గర ఉన్న మాన్ తలాయ్ లో తపోనిష్ఠలో ఉంటారని, సంవత్సరానికి ఒకసారి తపోనిష్ఠ నుండి బాహ్య ప్రపంచానికి వస్తారని వారు తెలిపారు. అలా ఒకసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చి, సత్యానంద స్వామితో కలిసి అడవి మార్గంలో నడిచి వెడుతుండగా దాదాపు పదిమంది నక్సలైట్లు వారిని చుట్టుముట్టారు. వీళ్ళు సన్యాసుల వేషంలో ఉన్న పోలీసులేమోనని అనుమానించి వారిని చంపుతామని హెచ్చరిస్తూ, అప్పట్లో వారి దగ్గర ఉన్న అత్యాధునిక తుపాకులు ఎక్కుపెట్టగా, స్వామి విమలానంద వారిని చూచి నవ్వుతూ "మీది వృధా ప్రయాస! మమ్మల్ని చంపే ఆయుధం ఇప్పటి వరకు తయారు కాలేదు. అలాగే చంపేవాడు కూడా ఇప్పటి వరకు పుట్టలేదు. మీ తుపాకుల నుండి ఒక్క తూటా కూడా బయటకు రాదు. కావాలంటే ప్రయత్నించండి" అని అనగానే ఆ నక్సలైట్లు వారి తుపాకులు పేల్చడానికి ప్రయత్నించగా, ఆశ్చర్యకరంగా ఒక్క తూటా కూడా బయటకు రాలేదు, ఏ తుపాకీ పనిచేయలేదు. ఎంత ప్రయత్నించినా అదే తంతు. చేసేది ఏమీ లేక వాళ్ళందరూ స్వామి విమలానంద వారి పాదాలపై బడి, "మీరు మారువేషంలో ఉన్న పోలీసు ఇన్ఫార్మర్లు అనుకున్నాము, కానీ మీరు మహానుభావులు. ఈ తుపాకులు లేకపోతే పోలీసుల నుండి మమ్మల్ని మేము రక్షించుకోలేము. మా దగ్గరున్న ధనం మొత్తం మీకు ఇచ్చేస్తాము. దయచేసి మా తుపాకులు మళ్ళీ పని చేసేలా మమ్మల్ని అనుగ్రహించండి" అని వారిని వేడుకున్నారు. అందుకు స్వామి విమలానంద నవ్వుతూ "భయపడకండి. మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత మాత్రమే మీ తుపాకులు పని చేస్తాయి. మీ ధనం మాకు అవసరం లేదు" అని చెప్పి, సత్యానంద స్వామి వారితో కలిసి ముందుకు సాగారు. ఈ మొత్తాన్ని భయంతో చూస్తున్న సత్యానంద స్వామి "ఇదేమి ఆశ్చర్యం స్వామీ! వాళ్ళు చంపుతాను అంటే మీరేమో శాంతంగా ఉన్నారు. మీరు చెప్పగానే వాళ్ళ తుపాకులు కూడా పనిచేయలేదు. ఎలా?" అని అడుగగా, బదులుగా స్వామి విమలానంద నవ్వుతూ "అదేం లేదు శివా! శ్రీప్రత్యంగిర అమ్మవారి మంత్రాన్ని ప్రయోగించాను, వాళ్ళ తుపాకులు పనిచేయలేదు. అంతే...! అమ్మవారు ఉండగా మనకేమి భయం" అన్నారు.

ఇలా అమ్మవారి సాధన వివరాలు (కొన్ని గుప్తపరచవలసినవి ఉన్నాయి) నిరూపానందకు తెలిపిన శ్రీపూర్ణానంద స్వామీజీ "నువ్వు కూడా మంత్రాన్ని ప్రయోగించి చూడవచ్చు శివా! నీకే అర్థం అవుతుంది" అని అన్నారు.

ఒక సాధకుడికి మంత్ర సాధనలో ఎదురయ్యే అనుభవాల గురించి తెలియజేయడం, భవిష్యత్తులో నిరూపానందకు అటువంటి పరిస్థితి ఎదురైనపుడు వాడు భయవిహ్వలుడు కాకుండా ఉండటానికి సిద్ధపరిచేందుకు ఇవన్నీ చెప్పారు.

అంతా విన్న, తెలుసుకున్న నిరూపానంద ఆలోచిస్తూ, స్వామి వారి ఆశీస్సులు తీసుకుని, 'రెడ్డి' గారి వద్దకు వెళ్ళి, ఆయనకు కూడా అన్నింటినీ చెప్పి, ఇంటికి చేరుకొని అమ్మవారి సాధన మొదలు పెట్టాడు.

మరి స్వామి వారు చెప్పిన ప్రయోగాలు చేశాడా? లేదా?
అతనికి ఎదురైనా అనుభవాలు, అనుభూతులు ఏమిటి?
ఇలాంటివన్నీ తరువాయి భాగాలలో తెలుసుకుందాం.

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు||

Monday, June 1, 2026

ఆత్మపథ నిర్దేశకుడు – 13

0

 

ఆత్మపథ నిర్దేశకుడు13

 ఓం నమో భగవతే పూర్ణానందాయ||

అలా స్వామివారికి పాదసేవ (పాదాలు నొక్కడం) చేస్తున్న నిరూపానంద కళ్ళలోకి చూసిన స్వామివారు, చిరునవ్వు నవ్వి, “అది ప్రత్యంగిర మాలామంత్రం శివా...! మూలమంత్రం వేరే ఉంది... అది ఉపదేశిస్తాను” అన్నారు. అందుకు నిరూపానంద “నాకు మాలామంత్రం-మూలమంత్రాల మధ్య భేదం తెలియదు. అదీగాక ఈ ప్రత్యంగిర ఎవరో తెలియదు. ఇంతకుముందు నరసింహ స్వామి మంత్రం చేయమంటేనే వద్దు అన్నాను. ఇప్పుడు ఇది ఎందుకు నాకు? అవసరమా? స్వామీ! నాకెందుకో తెలియని భయం కలుగుతోంది”అన్నాడు. అందుకు శ్రీపూర్ణానంద స్వామివారు సుమధురమైన మందహాసంతో వాడిని చూచి, “ఇవన్నీ నువ్వు ఇంత క్రితం చేసినవే శివా!” అన్నారు. బదులుగా నిరూపానంద “నేనా...? అసలు ఆ అమ్మవారి పేరు వినడమే ఇప్పుడు. నేనెప్పుడూ ఆ మంత్రసాధన చేయలేదే!” అనగానే, స్వామి వారు “ఇప్పుడు అంటే ఈ జన్మలో కాదు శివా...! క్రితం జన్మలలో నువ్వు చేసిన సాధన ఇప్పుడు పూర్తి అయ్యే సమయం ఆసన్నమైనది. అందుకే అమ్మవారు 'రెడ్డి' ద్వారా నీకు తనను తాను ప్రకటించుకున్నారు. నేను ఆయనకు గానీ, ఇంకెవరికీ మూలమంత్రం ఉపదేశించలేదు. ఇప్పుడు నీకు ఉపదేశిస్తాను. దీనివలన నీకు ఎంతో మేలు ఒనగూరుతుంది. అమ్మ నీకు సర్వకాల సర్వావస్థలలోనూ నీకు తోడుగా ఉంటుంది. ఎలాగూ నువ్వు తప్పుడు పనులకు దేనినీ వాడవు. కనుక నీకు అర్హత ఉన్నది” అని పలికి, తన దగ్గరకు పిలిచి శ్రీ ప్రత్యంగిర మాలామంత్రం మరియు మూలమంత్రం రెండింటినీ ఉపదేశించారు. అది విన్న వెంటనే నిరూపానంద "అరే! ఇదేంటి? మా ఇంటికి వచ్చిన బ్రాహ్మణులవారు ఇచ్చిన 'బీజాక్షరం' ఇందులో ఉందేమిటి స్వామీ?" అని అడిగాడు. బదులుగా స్వామివారు గుంభనంగా నవ్వుతున్నారు. మనవాడికి ఏమీ అర్థం కాలేదు. నేను అడిగితే ఈయన నవ్వుతాడేంటి అని అనుకున్నాడు. పాపం ఈ పిచ్చివాడికి ఏం తెలుసు అప్పుడు కూడా వచ్చినది వారేనని. గురువు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో, ఎందుకు తమ దర్శనం అనుగ్రహిస్తారో అనేది మన వెర్రి నిరూపానందకు ఏం తెలుసు? అసలే మనవాడికి మర్కట లక్షణాలు ఎక్కువ, అంతకు మించి సందేహ ప్రాణి. అందుకే స్వామి వారిని “ఈ మంత్రం సిద్ధి పొందాలంటే ఎన్ని లక్షలు చేయాలి. చాలామంది ఏదైనా మంత్రాన్ని ఇన్ని వేలు, లక్షలు లేదా కోట్లు జపం చేయాలి, తద్దశాంశం హోమం లేదా తర్పణాలు, తద్దశాంశం బ్రాహ్మణ భోజనం... ఇలా ఏవేవో నియమాలు ఉంటాయి అంటారు కదా! మరి నేనేం చేయాలి, ఎలా చేయాలి, నాకు ఉన్న పరిస్థితులలో అవన్నీ చేయగలనా?” అని ప్రశ్నించగా, మహద్గురువులు వాడిని చూచి ప్రేమగా “అవేవీ నీకు అవసరం లేదు శివా...! నీ దగ్గరకు వచ్చే మంత్రాలు పూర్ణ సిద్ధిగానే వస్తాయి. నీవేమీ చేయనవసరం లేదు. జపం మాత్రం చేయి చాలు. నువ్వు ఒక్కసారి చెప్పినా నీ వద్దకు వచ్చిన మంత్రాలు నీకు ఫలితాన్ని అనుగ్రహిస్తాయి. శ్రీప్రత్యంగిర అమ్మవారు నీకు ఎప్పడు ఏ అవసరం వచ్చినా తీరుస్తుంది, నిన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంటుంది శివా! నీకు ఏది కావాలన్నా అడుగు అమ్మవారు ఇస్తారు” అని చెప్పగా, అందుకు నిరూపానంద తన సహజ మర్కట చాపల్య మనస్తత్వంతో “నిజంగానే అమ్మ నేను అడిగితే స్పందిస్తారా? నమ్మవచ్చా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే సామెత ఉంది కదా స్వామీ! అది తప్పుడు అభిప్రాయం అయినప్పటికీ, అసలే కలియుగం, అందులోనూ నాలాంటి తక్కువ స్థాయి వాడికి, ఏమీ రానివాడికి, స్థిరత్వమే లేని వాడికి కూడా అమ్మ అనుగ్రహం దొరుకుతుందా? అయినా అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి?” అని ప్రశ్నల, సందేహాల పరంపర గుప్పించాడు. అందుకు విసుగు ఏమాత్రం చెందని శ్రీపూర్ణానంద స్వామీజీ "దానిదేముంది శివా! పరీక్షిస్తే పోతుంది" అని నవ్వుతూ అన్నారు. అందుకు నిరూపానంద "నేను మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలతో విసిగిస్తాను కదా...! ఏవేవో సందేహాలు పెట్టుకుంటాను కదా...! అర్థం పర్థం లేని విషయాలు అడుగుతాను కదా! మీకు కోపం రాదా? విసుగు పుట్టదా? స్వామీ!" అని అడిగాడు.  అందుకు స్వామివారు "అవన్నీ ఎందుకు శివా! నువ్వు ఏమైనా అడుగు. ఎన్నైనా అడుగు. నేనేమీ అనుకోను. ఇక్కడ ఉన్నదే నీకు సమాధానాలు ఇవ్వడానికి, సరైన మార్గం చూపడానికి... నీ గురువు నీ మీద చూపించే కృప అపారం శివా...! నిన్ను  శ్రీశైలంలోని సున్నిపెంటకు పూర్ణానంద స్వామి దగ్గరకు నిన్ను తీసుకు వెళ్ళాలి శివా...!  అప్పుడు తెలుస్తుంది నీకు అన్నీ ఏమిటో! అలాగే అమ్మవారి మంత్రాన్ని పరీక్షిస్తే సరిపోతుంది కదా! ప్రయోగించి చూడు!" అన్నారు. అప్పుడు నిరూపానంద "అదేంటి స్వామీ! ప్రయోగాలు అంటారు... అవి క్షుద్ర మాంత్రికులు, తాంత్రికులు చేసే పనులు కదా!" అని అడుగగా, స్వామివారు నవ్వి, "అలాంటిదేమీ లేదు శివా...! రామాయణ, భారతాలలో , పురాణాలలో ఇలా అన్నింటిలో చెప్పిన, వాళ్ళు చేసిన అస్త్రప్రయోగాల మాటేమిటి? అంతెందుకు? సంకల్పం చెప్పేటప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి? మంత్రం సాధనలో 'జపే వినియోగః' అని చెప్పేది ఏమిటి? అలాగే ఏదైనా సరే సత్కార్యం కోసం, ఆత్మోద్ధరణ కోసం, మోక్షసాధన కోసం, లోకోపకారం కోసం చేసే కోరికలు, ప్రయోగాలు ఉత్తమం. అలా కాకుండా ఎవరినో బాధ పెట్టడానికి,  హింసించడానికి, చంపడానికి అలాంటి ప్రయోగాలు క్షుద్రం అవుతాయి. 'క్షుద్రం' అంటే 'నీచం' అని. తప్పుడు ఆలోచనలతో చేసే ప్రయోగాలు నీచమైనవి శివా...! నీకు చెప్పేది అమ్మవారి మంత్రం ఫలిస్తుందో, లేదో అని నువ్వు తెలుసుకొనడానికి చేసే చిన్న ప్రక్రియ. అంతే!" అన్నారు. అప్పుడు నిరూపానంద "ఆ ప్రయోగం చేయాలంటే నేనేమి  చేయాలి? ఎలా తెలుసుకోవాలి" అని అడిగాడు. అప్పుడు స్వామి వారు "నీకైతే ఏ పద్ధతులు అవసరం లేదు శివా...! అమ్మ మంత్రం చెప్పు చాలు. అలాగే భవిష్యత్తులో  భౌతికంగా నువ్వు చేయాల్సిన ప్రయోగాలు కూడా ఉన్నాయి శివా...! వాటికి అమ్మ నీకు సహాయం చేస్తుంది' అని, శ్రీప్రత్యంగిర మంత్రం యొక్క సాధనలో తమ అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు.

అవి ఏమిటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం.  

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు|| 


 [PU1]