Tuesday, September 8, 2026

ఆత్మపథ నిర్దేశకుడు- 17

0

 

08.09.2026

ఆత్మపథ నిర్దేశకుడు- 17

 కొన్ని రోజుల తర్వాత, నిరూపానంద కొంతకాలం పాటు శమీవృక్ష (జమ్మి చెట్టు) పూజ చేయవలసి ఉన్నదని, ఆ శ్లోకాన్ని సంపాదించమని శ్రీపూర్ణానందుల వారు ఆదేశించారు. మనవాడు “అది ఎంతపని స్వామీ!” అని చెప్పి ఆ శ్లోకం కోసం చాలామందిని అడిగాడు. ప్రతి ఒక్కరు “అరే...! ఆ శ్లోకం మాకు బాగా తెలుసు...కాస్త ఉండు, గుర్తు తెచ్చుకుని చెబుతాం” అని అనేవారు గాని, ఎవరికీ ఆ శ్లోకం గుర్తు రాలేదు, మనవాడికి దొరకలేదు. ఆ శ్లోకం కోసం తిరుపతి లోని సెంట్రల్ లైబ్రరీ, ఎస్.వి. యూనివర్సిటీ లైబ్రరీలు మొత్తం జల్లెడ పట్టాడు. ఎంత ప్రయత్నించినా అది తప్ప తులసి, బిల్వం మొదలైన దేవతా వృక్ష పూజలకు సంబంధించిన మంత్రాలు మరియు ఇంకేవేవో దొరికేవి గాని ఈ శ్లోకం మాత్రం దొరికేది కాదు. అక్కడ అవి ఉన్నాయో, లేవో తెలియదు గాని, మనవాడికి అక్కడ లభ్యం కాలేదు. అలా వెతికి వేసారి పోయిన నిరూపానంద, స్వామివారికి ఆ విషయం చెప్పినప్పుడు, వారు తనతో “దొరుకుతుందిలే శివా...! నీకు కాకుండా ఎవరికి దొరుకుతుంది. అమ్మను అడుగు. ఇస్తుందిలే...!” అన్నారు. ఇలా ఉండగా ఒకసారి నిరూపానంద స్నేహితుడైన ‘రెడ్డి’ గారు తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త అయిన ‘శ్రీ సామవేదం షణ్ముఖశర్మ’ గారు దాదాపు ఒక వారం రోజులుగా ప్రవచనాలు ఇస్తున్నారని, ఆ రోజు ఆఖరి రోజు అని, ఆయన చాలా బాగా చెబుతున్నారు కావున వెడదాం అని చెప్పి తీసుకుని వెళ్ళారు.

ఆ రోజు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ‘సతీ సావిత్రి’ కథ చెబుతూ, ఆ కథలో అంతర్గతంగా ఉన్న శ్రీసూర్యోపాసన గురించి సవివరంగా, అద్భుతంగా వివరించారు. అసలే మనవాడి దృష్టిలో శ్రీసూర్యభగవానులవారు తన ‘తండ్రి’ అనే భావన వ్రేళ్ళూనుకుంది. అందులోనూ శ్రీమహద్గురువులు ఉపదేశించిన మహాసౌర మంత్రం ఉండనే ఉంది. కనుక ఉత్సాహంగా కొన్ని గంటల పాటు అద్భుతంగా సాగిన ఆ ప్రవచనాన్ని ఆసాంతం ఆసక్తితో, అనురక్తితో, ఉత్సుకతతో విన్నాడు. ప్రవచనం పూర్తి కాగానే నిరూపానంద నాతో, రెడ్డిగారు, మరియు ఇంకొక పెద్దాయనతో “నేను శ్రీ సామవేదం వారిని శమీవృక్ష పూజ శ్లోకం గురించి అడుగుతాను. నాకు తెలిసి ఖచ్చితంగా వీరి దగ్గరే మనకు ఆ శ్లోకం దొరుకుతుంది చూడండి” అన్నాడు. అందుకు ‘రెడ్డి’ గారు “ఆయన ఇవ్వకపోవచ్చు గోవిందా...! నీకు ఆ మధ్యన శ్రీదక్షిణామూర్తి మంత్రం విషయంలో జరిగిన అనుభవాలు గుర్తు ఉండే ఉంటాయి. కనుక ఈయన కూడా ఇస్తారు అనేది సందేహమే! అదీగాక ఆయన చుట్టూ వందలమంది గుమిగూడి ఉన్నారు. వాళ్ళను దాటి అక్కడకు నిన్ను ఎవరూ వెళ్ళనివ్వరు. కనుక నీ ప్రయత్నం విరమించుకో!” అని చెప్పారు. అప్పుడు నిరూపానంద మాతో “ఏముంది! స్వామివారు ఇచ్చిన అమ్మవారి మంత్రం ఉంది కదా...! ఆయనే అన్నారుగా, నీకు ఏది కావాలన్నా అమ్మనే అడగమని. అడుగుతాను. కొడుకు అడిగితే ఆ మాత్రం ఇవ్వదా ఏమిటి? అదీగాక ఇదేమన్నా నా కోసం అడుగుతున్నానా? స్వామివారి కోసమే కదా! వారు చెప్పిన పని చేసేయడమే, అమ్మను అడిగేయడమే!” అన్నాడు. ఇక్కడ నిరూపానందకు ఒక రకమైన తిక్క ఉంది. ఎవరైనా “ఈ పని జరగదు” అంటే “ఎందుకు జరగదు. మనం కనీస ప్రయత్నమైనా చేశామా! లేదు కదా! కావాలంటే ప్రయత్నించి ఓడిపోదాం. అసలు ప్రయత్నమే చేయకుండా రాదు, కాదు, జరగదు అంటే ఎలా?" అని వాదించి, ఆ పనికి పూనుకునే ఒక రకమైన మొండిఘటం. ఒక విధంగా గురుదేవులకు కూడా వాడి ఆ పిచ్చి చేష్టలే నచ్చుతాయేమో అనిపిస్తుంది, ఆయన వీడిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకునే విధానం చూసి.

ఏమో...! లోగుట్టు పెరుమాళ్ళుకెరుక!

ఇలా మా మాట వినకుండా నిరూపానంద శ్రీసామవేదం వారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఆడిటోరియంలో శర్మగారు, వారి మాతృశ్రీ గారితో పాటు ముందువరుసలో కూర్చుని ఉంటే, చాలామంది ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడాలని, ఆశీర్వాదం తీసుకోవాలని వేచి ఉన్నారు. ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండగా, అంతమంది జనాలను దాటి వారిని చేరడం, శ్లోకం గురించి అడగడం చాలా కష్టంగా తోచింది మనవాడికి. కానీ ‘మొండివాడు రాజుకన్నా బలవంతుడు’ అనే సామెత లాగా, మన మొండిఘటం అమ్మవారిని ఇలా ప్రార్థించాడు. “అమ్మా...! స్వామివారు నన్ను శమీవృక్ష శ్లోకం గురించి తెలుసుకు రమ్మని పంపారు. ఇప్పటి వరకు దొరకలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఈ సామవేదం వారి వద్దకు వచ్చాను. నువ్వేం చేస్తావో తెలియదు. నేను నీ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తాను. ఆలోగా నా ప్రయత్నం లేకుండానే ఎవరో ఒకరు నా వద్దకు వచ్చి, నన్ను వారి వద్దకు తీసుకు వెళ్ళాలి. సామవేదం వారు నన్ను చూశాక, ఆ శ్లోకాన్ని నాకు బోధించాలి. ఇది జరుగవలసినదే. నా కోసం అడగడం లేదు. స్వామి వారి కోసం అడుగుతున్నాను. కనుక నువ్వు ఆ మంత్రం నాకు ఈ సామవేదం వారి ద్వారా తెలియజేయవలసినది. నువ్వు చేస్తున్నావు. నేను చూస్తున్నాను” అని చెప్పి మంత్రం జపం మొదలుపెట్టాడు. చెప్పాను కదా! మనవాడు జగమొండి అని. హాస్యాస్పదం విచిత్రం ఏమిటంటే వీడు అమ్మ వారిని, స్వామి వారిని “ఇలా జరగాలి” అని గట్టిగా అడుగుతాడు. అది వాడి మూఢనమ్మకమో లేక వారి మీద ఉన్న ఆరాధనో లేక అదో రకమైన వింత ప్రవర్తనో లేక పసి పిల్లల మనస్తత్వమో తెలియదు. వాడు అలాగే అడుగుతాడు. ఒకవేళ ఆ పని జరుగక పోతే మాత్రం బాధ పడడు. అమ్మను గాని, స్వామిని గాని ఏమీ అనడు. అదేంటి అంటే... “మనం అడుగుతాం! అది మన ధర్మం. ఇవ్వాలో వద్దో అది వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకపోయినా నాకు సమ్మతమే!” అంటాడు. “ఇది వారి మీద నీకు ఉన్న భక్తా? లేక ప్రేమా?” అని అడిగితే మాత్రం, నాకు అవేమీ తెలియదు, లేవు కూడా. అవన్నీ పెద్ద పదాలు. నాకు అమ్మ అన్నా, స్వామివారు అన్నా కేవలం చెప్పలేనంత ఇష్టం మాత్రం ఉంది. అంతే” అంటాడు. ఇలాంటి అడ్డదిడ్డమైన మాటలను ఏమని అంటాం?

సరే! ఇక విషయంలోకి వద్దాం.

మన వాడు శ్రీప్రత్యంగిర అమ్మవారి మంత్ర జపం మొదలు పెట్టి రెండుసార్లు జపించి, మూడవసారి మొదలు పెట్టగానే ఎవరో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి, “సామవేదం వారిని కలవాలనుకుంటున్నారు కదా! రండి” అని పిలిచాడు. ఇప్పడు మొదలైంది మన వాడి పైత్య ప్రకోపం. మన వాడు కోరుకున్నదే కదా అమ్మ ఇచ్చింది. అయినా సరే వెంటనే నిరూపానంద “నాకు అవసరం లేదు” అన్నట్టు తలా అడ్డంగా ఊపాడు. అలా మూడవ సారి చేస్తున్న మంత్ర జపం కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే మనవాడికి అనుమానం ఎక్కువ. ఇదేదో కాకతాళీయం అనే భావన పాపం. కానీ ఆయన ఊరుకోకుండా “ఇంతసేపు ఇక్కడ ఉండి, ఇప్పడు వద్దు అంటారేంటి? మీరు రండి మాష్టారు” అని చేయి పట్టుకుని (ఇంతకు ముందు కథలో ఎవరో ఒకతను బాలు గారి దగ్గరకు తీసుకెళ్ళినట్టు), అన్నంతినను, బడికి వెళ్ళను అని మారాంచేసే చిన్న పిల్లాడి చేతిని పట్టుకుని అమ్మ లాక్కెళ్ళినట్టు, అక్కడ అడ్డంగా ఉన్న వారందరినీ ప్రక్కకు జరగమని గదమాయిస్తూ, అందరూ ప్రక్కకు జరిగి దారి ఇవ్వగా సామవేదం వారి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఇప్పడు మనవాడికి ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు, ఏమి చేయాలో తత్త్వం బోధ పడలేదు. అప్పటికి మూడవ సారి చేస్తున్న మంత్రం జపం పూర్తి అయింది.

సామవేదం వారి పాదాలకు నమస్కరించి, గరుడ ముద్రలో ఉండి, “విద్యార్థినై వచ్చాను. విద్యాభిక్ష కావాలి” అని దోసిలి పట్టి అడిగాడు. దానికి సామవేదం వారు చిరుమందహాసంతో “ఏమి కావాలి?” అని అడిగేంతలో, మనవాడు “శమీవృక్ష పూజ...” అని చెప్పేటంతలో, సామవేదం వారు మరియు వారి మాతృమూర్తి ఇద్దరూ ఆ శ్లోకాన్ని

“శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ| అర్జునస్య ధనుర్థారీ, శ్రీరామస్య ప్రియదర్శిని||” అని ఉపదేశించారు. మనవాడికి అసలే జ్ఞాపక శక్తి ఎక్కువ. కనుక “ఒక్క నిముషం స్వామీ వ్రాసుకుంటాను” అని కాగితం, కలం కోసం వెదకుతుండగా, సామవేదం వారే, ప్రక్కనున్న వ్యక్తిని “ఒక కాగితం, కలం ఇవ్వడి ఈ అబ్బాయికి” అని చెబితే, వాళ్ళు ఇచ్చారు. వారు ఒక్కొక్క పదాన్ని సవివరంగా చెబుతూ ఉంటే, మనవాడు త్వరపడకుండా మెల్లగా వ్రాసుకున్నాడు. ఇక్కడే చిత్రమైన సంఘటన జరిగింది. మన వాడు వచ్చిన పని అయిపోయింది కదా అనుకునే లోగా, సామవేదం వారు “దీనితో పాటు ఒక మంత్రం కూడా ఇస్తాను. అది కూడా చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఒనగూడుతాయి” అని చెప్పి, నిరూపానంద అడుగకుండానే దగ్గరకు రమ్మని, బీజాక్షర సహితంగా ఒక అమ్మవారి మంత్రాన్ని ముమ్మారు ఉపదేశించారు.

ఆలోచిస్తే అంతా చిత్రంగా ఉండి కదా! మన వాడికి మహద్గురుదేవుల కృపాకటాక్ష వీక్షణల బలంతో ఒకదాని కోసం వెడితే, ఇంకొకటి కూడా దొరికింది, అందులోనూ ఉపదేశం అయింది. ఈ విషయాలను తలచుకుంటున్నప్పుడు, అంతెందుకు ఇలా వ్రాస్తున్నప్పుడు కూడా నాకు రోమాంచితం అవుతున్నది, ఒక మూర్ఖుడిని పరమగురువులు ఇంతలా ఆదరిస్తారా అని ఆలోచిస్తే!

మనవాడు పరమానందభరితుడై, ఏదో పెద్ద బహుమతి సాధించినవాడిలా సామవేదం వారు ఇచ్చిన ఫల ప్రసాదాన్ని తీసుకుని, వారి పాదాలకు నమస్కరించి “ధన్యోహం!” అని చెప్పి, వెనుదిరిగి, మా అందరి దగ్గరకు వచ్చి “చెప్పానా...! అప్పుడే స్వామి చెప్పినట్టు అమ్మ ఏదైనా ఇస్తుందని” అని చిన్నపిల్లాడి “దొరికింది స్వామీ!” అని ఆనందంగా చెప్పాడు. అందుకు స్వామివారు నిరూపానంద బుగ్గ గిల్లి, తలనిమిరి “నాకు తెలుసు శివా...! నువ్వు సాధిస్తావని, అమ్మ నీకు సహాయం చేస్తుందని” అని చెప్పి, ఆ మంత్రాన్ని నిరూపానంద చెప్పక మునుపే వాటిని అతనికి చెప్పారు. దానికి మనవాడు “అదేంటి? మీకు ఇది తెలుసు కదా! మరి నన్నెందుకు వెదుకమని అక్కడికి, ఇక్కడికి ఇన్ని రోజులు, ఇంతలా తిప్పారు” అని అడిగాడు. అందుకు స్వామివారు చిరు మందహాసంతో "ఇప్పడు నువ్వు ఎమ్మెస్సీ మాత్రమే చేశావు. భవిష్యత్తులో నీవు చాలా పరిశోధనలు, ప్రయోగాలు చేయవలసి ఉన్నది శివా...! ఇంకా చాలా చదువుకోవాలి. దానికి చాలా ఓపిక, సహనం, శ్రద్ధ, పట్టుదల, దీక్ష, ఎవరు ఏమన్నా భరించి, వారి వద్ద నుండే అన్నీ సాధించుకునే ఓర్పు, నేర్పు... ఇలా ఎన్నో నీకు అలవాటు కావాలి. అందుకే నీకు ఇలా అలవాటు చేస్తున్నాను శివా...!" అని ఆశీర్వదించి పంపారు.

ఇందులో ఈ భిక్షువుకు అవగతమైన విషయం ఏమిటంటే, నాలాంటి, నిరూపానంద లాంటి వాళ్ళు ఎప్పుడూ వెంటనే జరగాలి అనే ప్రణాళికలు వేస్తూ ఉంటే, పరమగురువులు మాత్రం మాలాంటి అథములను ఎలా ఉద్ధరించాలి అనే దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అవి అర్థం కాక పనులు కాలేదని మేము క్రింద మీద పడిపోతూ ఉంటాం. అయినా మాలాంటి వారిని అనంతమైన సహనంతో భరిస్తూ, మమ్ములను తన చెంతనే ఉండే మహద్భాగ్యాన్ని ప్రసాదించిన మహద్గురుదేవులు శ్రీశ్రీశ్రీ... పూర్ణానంద స్వామీజీ వారికి ఎన్ని సార్లు సాష్టాంగ దండప్రణామములు ఒనరించినా అవి తక్కువే అవుతాయి.

మిగిలిన చరిత్ర తరువాయి భాగాలలో మాట్లాడుకుందాం! సరేనా...!

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు ||

ఆత్మపథ నిర్దేశకుడు- 16

0

 

08.09.2026

ఆత్మపథ నిర్దేశకుడు- 16

నిరూపానంద అంత గొప్పగా కాకపోయినా కొద్దిగా పాటలు పాడేవాడు. అతని గాత్రం మధురంగా కాకపోయినా, ఒక విధంగా ఉంటుంది. అలా అతను ఒకసారి ప్రముఖ సినిమా నేపథ్య గాయకులు అయిన శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (బాలు) గారు ఉన్న ఒక పాటల కార్యక్రమంలో కొద్దిగా పాడడం తటస్థించింది. అతని విచిత్రమైన పాట విన్న బాలు గారు అతనిని ఒక చిత్రమైన సంబోధనతో పిలిచేవారు. కొన్ని నెలల తరువాత బాలు గారు ఒక సన్మాన కార్యక్రమానికి 1999-2000 మధ్య కాలంలో తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంకు వచ్చారు. అక్కడ ఆయనను చూడడానికి, కలవడానికి వందలాది మంది జనం తరలి వచ్చారు. మన మూర్ఖశిఖామణి నిరూపానంద కూడా ఆయనను కలవడానికి వెళ్ళాడు. అంతమంది జనం మధ్య ఆతనిని లోపలకు వెళ్ళడానికి అనుమతించే ప్రసక్తే లేదు, ఎందుకంటే అతను సామాన్యుడు గనుక. అలాగే ఆ ఆడిటోరియం వెనుక తలుపులు కూడా మూసేశారు. పోలీసులు కూడా ఉన్నారు. లోనికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆ తలుపులు తీయడమే లేదు. అందరూ ముఖ్య ద్వారం నుండే లోనికి వెడుతున్నారు. మరి తనకు ఇష్టమైన గాయకుడు బాలు గారిని కలవాలని కోరిక తీరడం ఎలా? అందుకని తన గురుదేవులు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, ‘శ్రీప్రత్యంగిర’ అమ్మ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు “అమ్మా...! శ్రీగురుదేవులు నాకు నీ మంత్రాన్ని ఇచ్చినప్పుడు, దానిని జపిస్తే నువ్వు వెంటనే నా పట్ల ప్రసన్నురాలవై, కావలసిన కార్యం నెరవేరుస్తావని, నిజమో? కాదో? తెలియాలంటే పరీక్షించి చూడమన్నారు. అందుకే ఇప్పుడు ఈ బాలు గారిని కలవడానికి నీ మంత్రాన్ని ప్రయోగిస్తున్నాను. నేను నీ మంత్రాన్ని మూడు సార్లు ఉచ్ఛరిస్తాను. ఆ లోపలే నన్ను ఎవరో ఒకరు తమకు తాముగా నన్ను బాలు గారి వద్దకు తీసుకెళ్ళాలి. అలాగే బాలు గారు నన్ను చూడగానే ఆప్యాయంగా నన్ను వారు పిలిచే చిత్రమైన పిలుపుతోనే పలకరించాలి, నాతో సన్నిహితంగా మాట్లాడాలి. ఇది జరిగితే శ్రీగురుదేవులు నాకు చెప్పినది నిజం అని నమ్ముతాను. లేకపోతే అంతా భ్రమ అని, నాకు నీ మంత్రం సిద్ధి అవలేదు అని, శ్రీగురుదేవులు నా చేత ఈ మంత్రసాధన చేయించడానికి ఏదో మాటవరసకు అన్నారని నేను భావిస్తాను” అని అమ్మ వారికి చెప్పి, ఒక చెట్టు క్రింద నిలబడి మాలామంత్రం మరియు మూలమంత్రం జపించడం మొదలు పెట్టాడు. ఒకసారి జపించగానే ఏమీ జరుగలేదు. రెండవసారి జపించినా ఫలితం శూన్యం.

అప్పుడు నిరూపానంద మనస్సులో "హరే...! ఇదంతా ఒట్టిదే... మన స్వామివారు ఏదో వేళాకోళానికి మనకు చెప్పాడే గాని, అబ్బే .... ఇదేదీ జరిగే పనిలా లేదు..." అని అనుకుని, "సరేలే! మన మొహానికి అమ్మవారు పలకడం కూడానా...? అసలే మూడు సార్లు అనుకున్నాం కదా, అదేదో ఆ మూడో సారి కూడా జపం చేసేసి మన దారిన మనం ఇంటికి పోదాం" అనుకుని మూడవసారి మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు.  

 అలా జపిస్తుండగానే హఠాత్తుగా ఆ ఆడిటోరియం వెనుక వైపు తలుపులు తెరుచుకున్నాయి. మనవాడు ఎవరో వస్తున్నారేమో అని పట్టించుకోలేదు. ఎవరో ఒక వ్యక్తి బయటకు వచ్చి, తనకు నిరూపానందకు మధ్య దాదాపు వందమంది జనం ఉన్నప్పటికీ, ఎక్కడో దూరాన ఉన్న నిరూపానందను ఉద్దేశించి "బాలు గారిని కలవడానికి వచ్చారు కదా...! లోనికి రండి...!" అని గట్టిగా పిలిచాడు. "అతను ఎవరినో పిలుస్తున్నాడులే! మన మొహానికి ఇలా ఎవరు పిలుస్తారులే!" అనుకుని నిరూపానంద జపం చేస్తూనే ఉన్నాడు. ఆయన వీడిని ముమ్మారు పిలిచి, జనాలను నెట్టుకుంటూ నిరూపానంద దగ్గరకు వచ్చి "మిమ్మల్నే! బాలు గారిని కలవడానికి వచ్చారు కదా...! లోనికి రండి...!" అని పిలవగానే, నిరూపానందకు తన సహజమైన  పైత్యం ప్రకోపించి, "నేను వారిని కలవడానికి రాలేదు, నాకు ఆసక్తి లేదు. నేనేదో ఊరకనే ఇలా వచ్చాను" అని మొండికేసి చెబుతున్నా... అతను వినకుండా "మీరు రండి సార్...!" అని మన వాడిని మాత్రమే లోపలకు తీసుకెళ్ళి తలుపులు వేసేశాడు.  చెప్పానుగా... మనవాడు మహా మూర్ఖశిఖామణి అని. "ఇలా జరుగుతోంది ఏమిటబ్బా...! నిజంగా అమ్మవారు పలుకుతుందా...?" అని అనుకుంటూ ఉండగా అతను నిరూపానందను బాలు గారి వద్దకు తీసుకెళ్ళగానే బాలు గారు మన వాడిని చూసి "లచ్చన్నా...! వచ్చావా...? ఎంతకాలం అయింది నిన్ను చూసి" అని వాడిని హత్తుకున్నారు. ఈ మధ్య కాలంలో ఒక పదం వాడుతారు 'ఫ్యూజులు ఎగిరిపోయాయి' అని, అలా మనవాడికి ఏమీ అర్థం కావడం లేదు. అంతా మాయగా ఉంది. వెంటనే బాలుగారికి పాదనమస్కారం చేశాడు. బాలుగారు అతనిని కుశల ప్రశ్నలు అడిగి, తనతోనే కాసేపు ఉండమని చెప్పి వారి కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. తరువాత నిరూపానంద ఆయనను సెలవడిగి బయటకు వచ్చి "ఇదేం మాయరా స్వామీ...!" అనుకుని, అమ్మవారికి నమస్కరించి, ఇలాంటి లౌకికపరమైన కోరిక కోరినందుకు మన్నించమని అడిగి, ఇంటికి వెళ్ళితన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. మరుసటి రోజు శ్రీపూర్ణానందుల వారి వద్దకు వెళ్ళి, జరిగిన విషయం చెప్పగానే... "ఓహో...! మొదటి ప్రయోగం సఫలీకృతం అయినదా శివా...! మంచిది. అమ్మవారు ఎప్పుడూ నీ వెంటే ఉంటారు శివా...!" అనగానే, మన మర్కట కిశోరం "అంటే...! నేను ఇంకోసారి నిరూపణ కోసం ప్రయత్నించవచ్చునా...!" అని అడిగారు. మహద్గురుదేవులు చిరునవ్వుతో "నీ ఇష్టం శివా...!" అని ఆశీర్వదించారు. ఇప్పుడు మన పిచ్చివాడు ఏ ప్రయోగం చేయాలా...! అని ప్రణాళికలు రచించడం మొదలుపెట్టాడు.

ఇక్కడ అర్థం చేసుకోవలసినది ఏమిటంటే నిరూపానంద తన స్వాభావికమైన మర్కట ప్రవృత్తితో మంత్రాన్ని ఎలా వాడాలో అని లౌకికపరంగా ఆలోచిస్తూ ఉంటే... శ్రీపూర్ణానంద గురుదేవులు మాత్రం ఎంతో సహనంతో వాడి ప్రవర్తనను చూస్తూ, వాడు తన జీవితంలో తగిన సాధనా పరమైన అనుభవాలను పొందడానికి అనుమతించారు, తప్పుడు మార్గంలో వెళ్ళకుండా వాడికి నిర్దేశకుడయ్యారు.

 ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి భాగంలో చూద్దాం.

 సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు ।।


ఆత్మపథ నిర్దేశకుడు- 15

0

07.09.2026

ఆత్మపథ నిర్దేశకుడు- 15

 మీలో ఎవరైనా రజనీకాంత్ నటించిన “బాబా” సినిమా (2002) చూసి ఉన్నట్లయితే నేను చెప్పే నిరూపానంద ఈ కథ త్వరగా అర్థం అవుతుంది. ఆ సినిమాలో దేవుడి మీద నమ్మకం లేని ‘బాబా’ అనబడే రజనీ కాంత్ కు మహావతార్ బాబాజీ ఒక మంత్రం ఉపదేశించి, ఆ మంత్రం జపించి ఏది కోరుకున్నా అది నేరవేరుతుందని, కానీ ఆ మంత్రం కేవలం 7 సార్లు మాత్రమే పనిచేస్తుందని చెబుతారు. ఆ మంత్రాన్ని నిజంగా పని చేస్తుందో లేదో అని పరీక్షించడానికి రజనీకాంత్ గాలిపటం తన దగ్గరకు రావాలని, ఇంకెవరో వ్యక్తి వచ్చి తనను టైమ్ అడగాలని, ఎవరో వచ్చి తనకు డబ్బులు ఇవ్వాలని ఇలా అవసరంలేని, పనికిరాని పనుల కోసం వాడుతాడు. చివరికి తన తాత చివాట్లు పెట్టాక, మంచి పనుల కోసం ఆ మంత్రాన్ని ఉపయోగించడం మొదలుపెడతాడు. సరిగ్గా అలాంటి పనులే ఆ సినిమా రాక మునుపే నిరూపానంద చేసేవాడు. వాటన్నింటికీ ప్రత్యక్ష సాక్షులం మేం కొందరం ఉన్నాం. అందుకే ఎప్పుడైనా నిరూపానందతో కలిసి ఆ సినిమా ఎప్పుడు చూసినా, ఇదేంట్రా ఇది మన కథలాగానే, మన పిల్ల చేష్టలు లాగానే ఉంది ఇది అంటూ ఉంటాడు, అవన్నీ సరదాగా గుర్తు చేసుకుంటూ కంట తడిపెడతాడు, (ఎందుకంటే మహద్గురువులు ఇచ్చిన మహామంత్రాన్ని నేను నిరూపణ కోసం అలాంటి పనులకు ఎందుకు వాడాను అని. మళ్లీ తానే అనుకుంటాడు గురుదేవులు అనుమతించక పోతే నేను అలా ఎలా చేయగలుగుతాను, ఎవరినీ ఆ పనులతో బాధపెట్టలేదు కదా అని).

కానీ ఆ సినిమాలో రజనీ పాత్రకి, ఈ చరిత్రలో నిరూపానందకు ఉన్న పోలిక ఏమిటంటే, నిరూపణ లేనిదే దేనినీ నమ్మక పోవడం. ఇద్దరికీ ఉన్న భేదం ఏమిటంటే, నిరూపానందకు మత్తుపదార్థాలు, తాగుడు, సిగరెట్లు కాల్చడం, పరులను కొట్టడం వంటివి అలవాటు లేవు, అలాగే ఆ సినిమాలో బాబాజీ ఇచ్చిన మంత్రం 7 సార్లు మాత్రమే ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది అని చెబితే, ఇక్కడ నిరూపానందకు అటువంటి ఆంక్షలు లేవు.

తాను ఇలా తన గురుదేవులు శ్రీ పూర్ణానందులవారు ఇచ్చిన మంత్రాన్ని కొన్ని సరదా పనులకు ప్రయోగాత్మకంగా వాడినప్పటికీ, స్వామివారు “ఇప్పుడైనా నమ్ముతావా శివా…! అమ్మ నీకు ఏది అడిగినా ఇస్తుంది అని! ఇకపై జాగ్రత్తగా చరించు, అమ్మ అన్నీ గమనిస్తుంది నిన్ను” అని ప్రేమగా హెచ్చరించేవారు.

నిరూపానంద జీవితంలో ఈ క్రొత్త మలుపును తదుపరి భాగంలో తెలుసుకుందాం.

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు ।।