08.09.2026
ఆత్మపథ నిర్దేశకుడు- 16
నిరూపానంద అంత గొప్పగా కాకపోయినా కొద్దిగా పాటలు పాడేవాడు.
అతని గాత్రం మధురంగా కాకపోయినా, ఒక విధంగా ఉంటుంది. అలా అతను ఒకసారి ప్రముఖ సినిమా
నేపథ్య గాయకులు అయిన శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (బాలు) గారు ఉన్న ఒక పాటల కార్యక్రమంలో
కొద్దిగా పాడడం తటస్థించింది. అతని విచిత్రమైన పాట విన్న బాలు గారు అతనిని ఒక చిత్రమైన
సంబోధనతో పిలిచేవారు. కొన్ని నెలల తరువాత బాలు గారు ఒక సన్మాన కార్యక్రమానికి 1999-2000
మధ్య కాలంలో తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంకు
వచ్చారు. అక్కడ ఆయనను చూడడానికి, కలవడానికి వందలాది మంది జనం తరలి వచ్చారు. మన మూర్ఖశిఖామణి
నిరూపానంద కూడా ఆయనను కలవడానికి వెళ్ళాడు. అంతమంది జనం మధ్య ఆతనిని లోపలకు వెళ్ళడానికి
అనుమతించే ప్రసక్తే లేదు, ఎందుకంటే అతను సామాన్యుడు గనుక. అలాగే ఆ ఆడిటోరియం వెనుక
తలుపులు కూడా మూసేశారు. పోలీసులు కూడా ఉన్నారు. లోనికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆ తలుపులు
తీయడమే లేదు. అందరూ ముఖ్య ద్వారం నుండే లోనికి వెడుతున్నారు. మరి తనకు ఇష్టమైన గాయకుడు
బాలు గారిని కలవాలని కోరిక తీరడం ఎలా? అందుకని తన గురుదేవులు చెప్పిన విషయం గుర్తుకు
వచ్చి, ‘శ్రీప్రత్యంగిర’ అమ్మ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు “అమ్మా...! శ్రీగురుదేవులు
నాకు నీ మంత్రాన్ని ఇచ్చినప్పుడు, దానిని జపిస్తే నువ్వు వెంటనే నా పట్ల ప్రసన్నురాలవై,
కావలసిన కార్యం నెరవేరుస్తావని, నిజమో? కాదో? తెలియాలంటే పరీక్షించి చూడమన్నారు. అందుకే
ఇప్పుడు ఈ బాలు గారిని కలవడానికి నీ మంత్రాన్ని ప్రయోగిస్తున్నాను. నేను నీ మంత్రాన్ని
మూడు సార్లు ఉచ్ఛరిస్తాను. ఆ లోపలే నన్ను ఎవరో ఒకరు తమకు తాముగా నన్ను బాలు గారి వద్దకు
తీసుకెళ్ళాలి. అలాగే బాలు గారు నన్ను చూడగానే ఆప్యాయంగా నన్ను వారు పిలిచే చిత్రమైన
పిలుపుతోనే పలకరించాలి, నాతో సన్నిహితంగా మాట్లాడాలి. ఇది జరిగితే శ్రీగురుదేవులు నాకు
చెప్పినది నిజం అని నమ్ముతాను. లేకపోతే అంతా భ్రమ అని, నాకు నీ మంత్రం సిద్ధి అవలేదు
అని, శ్రీగురుదేవులు నా చేత ఈ మంత్రసాధన చేయించడానికి ఏదో మాటవరసకు అన్నారని నేను భావిస్తాను”
అని అమ్మ వారికి చెప్పి, ఒక చెట్టు క్రింద నిలబడి మాలామంత్రం మరియు మూలమంత్రం జపించడం
మొదలు పెట్టాడు. ఒకసారి జపించగానే ఏమీ జరుగలేదు. రెండవసారి జపించినా ఫలితం శూన్యం.
అప్పుడు నిరూపానంద మనస్సులో "హరే...! ఇదంతా ఒట్టిదే...
మన స్వామివారు ఏదో వేళాకోళానికి మనకు చెప్పాడే గాని, అబ్బే .... ఇదేదీ జరిగే పనిలా
లేదు..." అని అనుకుని, "సరేలే! మన మొహానికి అమ్మవారు పలకడం కూడానా...? అసలే
మూడు సార్లు అనుకున్నాం కదా, అదేదో ఆ మూడో సారి కూడా జపం చేసేసి మన దారిన మనం ఇంటికి
పోదాం" అనుకుని మూడవసారి మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు.
ఇక్కడ అర్థం చేసుకోవలసినది ఏమిటంటే నిరూపానంద తన స్వాభావికమైన మర్కట ప్రవృత్తితో మంత్రాన్ని ఎలా వాడాలో అని లౌకికపరంగా ఆలోచిస్తూ ఉంటే... శ్రీపూర్ణానంద గురుదేవులు మాత్రం ఎంతో సహనంతో వాడి ప్రవర్తనను చూస్తూ, వాడు తన జీవితంలో తగిన సాధనా పరమైన అనుభవాలను పొందడానికి అనుమతించారు, తప్పుడు మార్గంలో వెళ్ళకుండా వాడికి నిర్దేశకుడయ్యారు.
0 comments:
Post a Comment