Monday, April 27, 2020

ఆత్మపథ నిర్దేశకుడు – 9

0

శ్రీసత్యానందస్వామి వారి ఆదేశానుసారం “శ్రీదక్షిణామూర్తి స్వామి” వారి మంత్రం పొందడం కోసం నిరూపానంద విఫలయత్నం చేసిన సంగతి తెలుసుకున్నాం కదా! అందుకు బాధ పడుతున్న అతనిని చూసి శ్రీసత్యానంద స్వామి వారు “ఇంత పట్టుదలతో కూడిన నీ ప్రయత్నం వ్యర్థం కాదు శివా...! ఇక సరిగ్గా ఏడు రోజులు వెదుకు. ఏడవ రోజు దొరుకుతుంది” అని చెప్పారు. అయినా 6 రోజుల పాటు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. సరిగ్గా 7 వ రోజు శ్రీస్వామివారి కోసం ఆ మంత్రం ఎలాగైనా సంపాదించాలనే పట్టుదలతో ఉన్న అతను మొట్టమొదటి సారిగా తిరుపతిలోని ప్రధాన గ్రంథాలయానికి అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అసలు ఆ మంత్రం అక్కడ లభ్యం అవుతుందో లేదో కూడా తెలియదు. దానికోసం ఎలా వెదకాలో తెలియదు. అయినా ప్రయత్న లోపం ఉండరాదని శ్రీదక్షిణామూర్తి వారిని “స్వామీ! నేను నా స్వార్థం కోసం మీ మాత్రం కొరకు వెదకడం లేదు. శ్రీసత్యానంద స్వామి వారు అడిగారు. ఎలాగైనా తెస్తాను అని మాట ఇచ్చాను. ఆ మాట తప్పలేను. కాబట్టి ఈ రోజు ఎలాగైనా అది దొరికేటట్లు చేయండి” అని ప్రార్థిస్తూ కొన్ని గంటల సేపు వెదికాడు. ఇక నిరాశగా వెళ్ళిపోదామని అనుకుంటుండగా అకస్మాత్తుగా ఒక గ్రంథం అతనికి దొరకడం, అందులో శ్రీదక్షిణామూర్తి వారి మంత్రం ఉండటం చూశాడు. వెంటనే ఆనందం తట్టుకోలేక అది వ్రాసుకుని, మర్నాడు స్వామివారి వద్దకు వెళ్ళి పట్టలేని ఆనందంతో మనకు మంత్రం దొరికింది అని చెప్పాడు. అందుకు సత్యానంద స్వామి వారు అతని బుగ్గ గిల్లి, నవ్వుతూ “నాకు తెలుసు శివా! నువ్వు సాధిస్తావని. అసలు ఆ మాత్రం వెదకమన్నదే నీ కోసం. వెదకడం అనేది నీకు ఇంతవరకు పెద్దగా అలవాటు కాలేదు. నీ భవిష్యత్ కార్యక్రమాల కోసం ఇలా వెదకడం అలవాటు చేస్తున్నాను. రేపు ఇంట్లో కూర్చొని ఈ మంత్ర సాధన చేయి శివా!” అని ఒక సారి ఆ మంత్రాన్ని అతనికి చెప్పి పంపారు.

మర్నాడు గురువారం, మధ్యాహ్నం 1.15 గంటలకు గురుహోరలో ఆ మంత్ర సాధన కోసం నిరూపానంద తన ఇంట్లోని పూజాగృహంలో కూర్చొని జపం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం! మంత్ర సాధన మొదలెట్టిన ఖచ్చితంగా 1 గంటలోనే నిరూపానందకు శారీరిక స్పృహ పోవడం, అలౌకికమైన ఒక విధమైన మత్తులో అతనికి “శ్రీదక్షిణామూర్తి” వారి భవ్యమైన మూర్తి దర్శనం లభించడం జరిగింది. అలా కనీసం ఒక 2 గంటల పాటు ఉండిపోయిన నిరూపానంద, వెంటనే శ్రీసత్యానందుల వారి వద్దకు వెళ్ళి ఈ విషయం చెబుదామని అనుకునేలోగా, శ్రీస్వామి వారు నవ్వుతూ అతనిని దగ్గరకు పిలిచి, బుగ్గ గిల్లి, శిరస్సు నిమిరి “స్వామి వారి దర్శనం అయింది కదా శివా...!” అన్నారు. నిరూపానంద స్వామి వారితో “ఇదంతా నిజమేనా? ఇలా జరుగుతుందా” అని అడుగగా, “అంతా నీ గురువు దయ శివా! వారు అనుకుంటే నీకు ఏదైనా ఇస్తారు. కానీ నీ కర్మపరిపక్వము కావాలి కదా శివా! వారే వస్తారులే!” అని దీవించి పంపారు.

ఇక్కడ నాకు అర్థం అయినది ఏమిటంటే... శ్రీదక్షిణామూర్తి వారి మంత్రం చాలా మందికి తెలుసు. అరే...! ఈ మంత్రం కోసమా ఈ పిచ్చి నిరూపానంద అంత శ్రమ పడింది అని కూడా మీకు అనిపించవచ్చు. కానీ ఒక విషయం గమనించాలి. ఈ విషయం జరిగినప్పుడు ఇంటర్నెట్ లేదు. కంప్యూటర్ లభ్యత చాలా తక్కువ. ఇది చదివేవారు మంత్ర శాస్త్రంలో నిష్ణాతులు అయి ఉండవచ్చు. కానీ మనం మాట్లాడుకునే వాడు, ఒక మహా మూర్ఖశిఖామణి, మంత్రశాస్త్ర జ్ఞానం లేని ఒక అర్భకుడు. తనకోసం కాక, తనను అడిగిన స్వామివారి కోసం వెదకడం అనే ఒకే ఒక పని తప్ప వేరే ఆలోచన లేని వెర్రివాడు. అలాంటి నిరూపానంద చేత భవిష్యత్తులో శ్రీగురుదేవులు చేయించబోయే పరిశోధనలకు, సాధనలకు ఇలా వెదకడం, తిట్లు తినడం, ఎవరు ఏమన్నా భరించడం ఇలాంటివన్నీ అవసరం. అందుకేనేమో మహద్గురువులు శ్రీశ్రీశ్రీ... పూర్ణానందభగవానులు తామే సాక్షాత్ శ్రీదక్షిణామూర్తి అయిననూ, “అనుభవం ఇవ్వడమే గురువు చేసే పని” కనుక వాడిని అలా అనుగ్రహించారు.

హాస్యాస్పదం కాకపొతే సాక్షాత్ శ్రీదక్షిణామూర్తి స్వరూపమైన శ్రీపూర్ణానందుల వారు... శ్రీసత్యానందుల వారి పేరుతో నిరూపానందకు పరిచయం చేసుకుని ఇలా మంత్రం వెదుకమని అడగడం ఏమిటి? మనవాడు ‘ఆయన కోసం’ అని అనుకుంటూ ఇలా తిరగడం ఏమిటి? మళ్ళీ “నువ్వు సాధించావు శివా!” అని ఆయన వీడిని అనడం ఏమిటి? విచిత్రంగా అనిపించలేదా! అదే శ్రీగురులీల. నాలాంటి పిచ్చివాడు ఇలా కొంతవరకే ఆలోచించగలడు. ‘లోగుట్టు పెరుమాళ్ళుకు ఎరుక’ అన్నట్టు మహద్గురువుల చర్యలకు భాష్యం వెదకడానికి నేనెంతవాడను? సాక్షాత్ “శ్రీవిష్ణుభగవానులు” కదా...! ఆ విష్ణుమాయ ఇప్పటికే నన్ను నానా మాయాప్రభావాలకు గురిచేస్తోంది. కనుక వారి చర్యలను గురించి కాక, వారి ఆదేశాలే పాటిస్తాను.

ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి... ఆ మంత్రం నిజానికి పరమేష్ఠి గురువునకు సంబంధించినది. అందుకేనేమో! పరమేష్ఠి గురువులు శ్రీశ్రీశ్రీ... నిత్యానంద భగవాన్ వారి అనుయాయుల సామీప్య సాంగత్యం ఒక చిన్న బిడ్డ రూపంలో మన నిరూపానందకు కలిగింది.
తదుపరి భాగంలో కలుసుకుందాం.

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు

ఆత్మపథ నిర్దేశకుడు – 8

0

మహద్గురు శ్రీశ్రీశ్రీ... పూర్ణానందుల వారు నిరూపానందకు శ్రీసత్యానందుల వారి రూపంలో అనుగ్రహించారని తెలుసుకున్నాం కదా! ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. నిజానికి అక్కడ శ్రీసత్యానందుల వారు ఉండేవారు, కానీ నిరూపానంద వచ్చినప్పుడు మాత్రం శ్రీపూర్ణానందుల వారు మాత్రమే కనపడేవారు, మాట్లాడేవారు, ఉపదేశం చేసేవారు, ఎలా బ్రతకాలో నేర్పేవారు. ఏకకాలంలో అక్కడ సున్నిపెంటలోనూ ఉండేవారు, ఇక్కడ వీడితోనూ ఉండేవారు. ‘వారికేం కర్మ మహామూర్ఖశిఖామణి అయిన నిరూపానందను అనుగ్రహించడానికి వారే స్వయంగా రావాలా? ఏం ఆ మాత్రం దానికి ఇంకెవరినో పంపవచ్చు కదా!’ అని అనిపించవచ్చు. ఏమో! వారు వాడినెందుకు అలా అనుగ్రహించదలచారో ఎవరికి ఎరుక? బ్రహ్మర్షుల లీలలు చర్యలు చూసి ఆనందించవలసినవే, అనుభవించవలసినవే కాని, ఇది ఎందుకు? అది ఎందుకు? అని ప్రశ్నించే హక్కు, అధికారం, స్థాయి, సామర్థ్యం ఎవరికీ ఉండవు. అందుకే నిరూపానంద ఎప్పుడూ “ఇదంతా వాడి (గురువు) బిచ్చం, కరుణ, కృప” అని అంటాడు. ‘బిచ్చం’ అనే మాట వినడానికి కాస్త మొరటుగా ఉన్నా, అది నిజమే కదా అని అస్మదీయుడి అభిమతం. ఇక తరువాతి భాగంలోకి వెడదాం.

ఒకరోజు నిరూపానందను శ్రీసత్యానందస్వామి వారు ‘శ్రీదక్షిణామూర్తి’ మంత్రమును సంపాదించమని చెప్పారు. దాని అవసరం ఏముంది అని నిరూపానంద అడుగగా, “ఆ మంత్రం అవసరం నీకు ఉంది శివా...!” అని అన్నారు. ఎందుకో తెలీదు గాని స్వామివారు అడిగారు కదా అని నిరూపానంద ఆ మంత్రం కోసం చాలా వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు తెలిసి నిరూపానంద ఆ మంత్రం కోసం కనీసం రెండు నెలల పాటు తీవ్రంగా వెతికాడు. తన కోసం కాదు, స్వామి వారు అడిగారు అని. నిరూపానంద రామాయణ భారత భాగవతాలు, పురాణాలు మూలాగ్రంథాలు చిన్ననాటి నుండే చాలా చదివాడు, కానీ అతనికి మంత్రశాస్త్ర గ్రంథ పరిచయం తక్కువ. అతనికి ఆ మంత్రం ఏ గ్రంథంలో దొరుకుతుందో తెలియదు. అతని జీవితంలో ఒక మంత్రం కోసం ఇంతగా వెతకడం అదే మొదలు. ఒకసారి ఆ మంత్రం కోసం నిరూపానంద శృంగేరీపీఠానికి చెందిన ఒక స్వామి వారిని శ్రీదక్షిణామూర్తివారి మంత్రం ఎక్కడ దొరుకుతుందో చెప్పమని అడిగాడు, కానీ ఆ స్వామీజీ నిరూపానందతో “నీకు ఉపనయనం అయిందా? నీ సాధనా స్థాయి ఏమిటి?” ఇత్యాది ప్రశ్నలన్నీ అడిగారు. దానికి నిరూపానంద, ఆ మంత్రం తన కోసం కాదు అని, శ్రీసత్యానందస్వామి వారు అడిగారు అని, తనకు ఉపదేశం చేయనవసరం లేదు, కానీ అది ఎక్కడ లభ్యమవుతుందో మాత్రమే చెప్పమని కోరాడు. దానికి ఆ స్వామీజీ తాను ఏమీ చెప్పనని, వెళ్ళిపోమని చెప్పాడు. బాధగా వెనుదిరిగిన నిరూపానంద, తర్వాత తన కులపురోహితుల వద్దకు వెళ్ళి అడిగితే ఆయన సాయంత్రం ఇంటికి రమ్మని అన్నారు. ఆనాటి సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిన నిరూపానంద ఆయన ఇంటి ప్రహరీ (కాంపౌండ్) గేటు బయటే రెండు గంటలకు పైగా అలా కదలక మెదలక నిలబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆ పురోహితుడు అతనిని చూస్తూ కూడా, వేరే వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు గాని, ఇతనిని కనీసం లోపలికి రమ్మని చెప్పడు, వెళ్ళిపోమని చెప్పడు. రెండున్నర గంటల నిరీక్షణ అనంతరం ఆ కులపురోహితుడు నిరూపానందను పిలిచి “ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నించాడు. నిరూపానంద శ్రీదక్షిణామూర్తి మంత్రం ఏ గ్రంథంలో దొరుకుతుందో చెప్పమని, వెళ్ళి వెదుకుతానని అడుగగా “అటువంటిదేమీ నేను చెప్పను, నీవు వెళ్లవచ్చు” అని నిర్ద్వంద్వంగా చేప్పేసరికి, నిరాశతో తన ప్రయత్నం ఫలించలేదని వెనుదిరిగాడు. ఇక్కడ నిరూపానందకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే, తాను తనకు మంత్రోపదేశం అవసరం లేదు అని , ఆ మంత్రం దొరికే గ్రంథం ఎక్కడ దొరుకుతుందో మాత్రమే చెప్పమని ఎంత వినయంగా వారి పాదాలు పట్టుకుని అడిగినా, వారు విషయం చెప్పకపోగా అతనిని అవమానకరంగా, వెటకారంగా మాట్లాడటం. అది కూడా అతని మంచికే జరిగిందని, అసలు శ్రీసత్యానందులవారు నిరూపానందకు శిక్షణ నిమిత్తమై ఇలా పని చెప్పారని చాలా కాలం తర్వాత కానీ అర్థం కాలేదు. ఇలా ఆ ఊరిలో నిరూపానంద ఒక వారం పాటు ఉండి, విఫలయత్నుడై తిరిగి స్వామి వారి వద్దకు వచ్చి అన్నీ చెప్పాడు. అందుకు స్వామి వారు “ఇంత పట్టుదలతో కూడిన నీ ప్రయత్నం వ్యర్థం కాదు శివా...! ఇక సరిగ్గా ఏడు రోజులు వెతుకు. ఏడవ రోజు దొరుకుతుంది” అని చెప్పారు.

ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. 

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు

ఆత్మపథ నిర్దేశకుడు – 7

0

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు నిరూపానందకు శ్రీసత్యానంద స్వామివారి రూపంలో దర్శనమిచ్చిన మహద్గురు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందస్వామి వారు “మహాసౌర మంత్రం” ఉపదేశించాక, మరునాడు ‘రథసప్తమి’ పర్వదిన సందర్భంగా బ్రహ్మముహూర్తంలో ఆ మంత్రజపం మొదలెట్టగానే ఊపిరి ఆగిపోయిందని తెలుసుకున్నాం కదా! తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

నిరూపానంద అలా ఊపిరి ఆడకుండా, స్పృహలేని స్థితిలో కనీసం ఒక గంట పైనే ఉండిపోయాడు. ఎప్పుడో కొంచెం స్పృహ వచ్చింది. ఆలోచన మొదలైంది. కనులు తెరవలేకపోతున్నాడు. అకస్మాత్తుగా తెలిసిన విషయం ఏమిటంటే ఊపిరి ఆడటం లేదు. ఒక్కసారి పిచ్చెక్కినట్ట్లు అయింది. “అరే...! ఇదేంటి. నాకు ఊపిరి ఆడటం లేదు. కళ్ళు కూడా తెరువలేకున్నాను. ఈ ముసలోడు ఏదో మంత్రం ఇచ్చాడు. పొద్దునే జపం చేయమన్నాడు. ఇప్పుడు ఉన్నానో పోయానో తెలియదు. ఏం చేసాడో నన్ను. ఇంతకీ ఉన్నానా? పోయానా?” అని అనుకుంటూ, చాలా కష్టం మీద కనులు తెరువగలిగాడు. ఈ స్థితిని ఈ కథ చదువుతున్న వారిలో చాలా మంది అనుభవించి ఉండవచ్చు. వారికి ‘ఇందులో ఏముంది. ఇది సర్వ సాధారణమే కదా!’ అని అనిపించవచ్చు. కానీ నిరూపానంద పరిస్థితి వేరు. వాడికి ఇదంతా పూర్తిగా క్రొత్త వింత. కనుక కనులు తెరిచాక కూడా పరిశీలించాడు. చేతులు ముక్కు దగ్గర పెట్టి చూశాడు. అప్పటికీ ఊపిరి ఆడటం లేదు అనే విషయం పూర్తిగా అర్థం అయిపోయింది మనవాడికి. కంగారు, ఆదుర్థా కలిగాయి. ప్రయత్నించాడు. కానీ ఫలితం లేదు. ఇన్ని జరుగుతున్నా విచిత్రం ఏమిటంటే ఆ ‘మంత్రం’ జపం మాత్రం అంతర్లీనంగా జరుగుతూనే ఉంది. ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆపలేకపోతున్నాడు. అలా 10 నిముషాలు ప్రయత్నించాక కొద్దిగా ఊపిరి ఆడటం మొదలయింది. కాసేపటికి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాడు. వెంటనే కిందకి పరుగెట్టుకుంటూ వెళ్ళి, కాసేపు ఆదుర్దాగా గడిపి సూర్యోదయం కాగనే, తిరుచానూరు లోని శ్రీసూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్ళి, అక్కడినుండి అతి త్వరగా తన స్నేహితుడు అయిన ‘రెడ్డి’గారి వద్దకు వెళ్ళాడు. 

ఈ ‘రెడ్డి’ గారి గురించి మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, నిరూపానంద స్నేహితుడని. అతను నిరూపానంద కంటే 20 ఏళ్ళు పెద్దవాడు, కుండలినీ యోగం గురించి ప్రయత్నిస్తున్న వాడు, ఆయుర్వేదంలో నిష్ణాతుడు. శ్రీసత్యానందుల వారిని నిరూపానందకు పరిచయం చేసింది ఈ ‘రెడ్డి’గారే. కనుక తనకు కలిగిన ఈ స్థితిని గురించి అడగటానికి అతని వద్దకు వెళ్ళాడు నిరూపానంద. రెడ్డిగారికి ఈ విషయం చెప్పగానే ఆయన “అది ‘కేవల కుంభకం’ కదా నాయనా!” అన్నాడు. అందుకు మన అపరమేధావి నిరూపానంద ఆయనతో “నా పిండాకూడు కుంభకం. నా ఊపిరి ఆగిపోయింది మొర్రో అంటుంటే ‘కేవల కుంభకం’ అంటావేంటి” అని విసుక్కున్నాడు.
ఈ విషయం గురించి చెప్పడానికి ఇద్దరూ కలిసి శ్రీసత్యానందుల వారి వద్దకు వెళ్ళారు. వారు నిరూపానందను చూడగానే “ఏం శివా...! సాధన ఎలా ఉంది, ఉపిరి ఆడుతోందా” అని నవ్వుతూ అడిగారు. దాంతో చిర్రెత్తిన నిరూపానంద “అరే! నేను ఏమీ చెప్పకుండానే ఇలా ఎలా తెలిసిపోతోంది ఇతనికి” అని ఆశ్చర్యపోయి, జరిగినదంతా చెప్పగానే, శ్రీసత్యానందుల వారు నిరూపానంద తల నిమురుతూ “నిజమే శివా...! అది కేవల కుంభకమే. కానీ విచిత్రం ఏమిటో తెలుసా. నువ్వు సమాధిస్థితిని అనుభవించావు. దానికోసం ఎందరో సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తూనే ఉంటారు. దొరకక పోవచ్చు. కానీ నీకు ఒక్కసారికే వచ్చింది. నీ వయస్సు కూడా ఆగిపోతుందిలే. అంతా నీ గురువు అనుగ్రహం శివా...! సున్నిపెంటలో శ్రీపూర్ణానందుల వారిని కలువు శివా...! నీకు అంతా అర్థం అవుతుంది. వారే నీకు...” అని ఆపేశారు. ఇలా మాట్లాడుకున్నాక నిరూపానంద మరియు రెడ్డిగారు ఇంటికి వచ్చేశారు. ఇలాంటి అనుభవం నిరూపానందకు ఆ మంత్రం చేసిన ప్రతిసారి జరుగుతూనే ఉండేది. ఇది జరిగిన దాదాపు 15–20 ఏళ్ళకు నిరూపానందకు శ్రీగుర్వనుగ్రహం వలన ఒక విషయం బోధపడింది. ఒక మంత్రం ఒక్కసారి జపం చేయగానే సిద్ధికలగడం, నిదర్శనం చూపడం ఇవన్నీ ఆ మంత్రం “బ్రహ్మర్షులు” ఉపదేశిస్తే లేదా వారు అనుగ్రహిస్తే మాత్రమే జరుగుతుంది అని. ఇంకెవరు ఉపదేశించినా దానికి ఇంత సంఖ్య అవసరమవుతుంది, లేదా కొంత కాలం పడుతుంది అని, కొండొకచో జరుగక పోవచ్చును కూడా అని అర్థం అయింది. ఇది నిరూపానందకు అర్థం అయిన విషయం మాత్రమే. మిగతా వారి అనుభవాలు నాకు లేదా నిరూపానందకు తెలియవు.
తర్వాత ఏమి జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.

సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు

ఆత్మపథ నిర్దేశకుడు – 6

0

నాకు తెలిసినంత వరకు మహద్గురు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందుల వారి భక్తులు మరియు శిష్యులలో కొందరు ‘రథసప్తమి’ పర్వదినాన జన్మించారు. వారిలో కొందరు శ్రీబి.ఆర్.కె. తాతగారు, ఈ కథలోని నిరూపానంద మరియు తిరుపతిలోని ఒక భక్తుడు. 

ఇక కథలోనికి వెళ్దామా...

ఈ సంఘటనకి నేను ప్రత్యక్ష సాక్షిని. కనుకనే ఇంత ఘంటాపథంగా అన్నీ చెప్పగలుగుతున్నాను. 

ఒకనాడు నిరూపానందకు తొండవాడలో సత్యానందస్వామి వారి రూపంలో కనిపించిన శ్రీపూర్ణానందుల వారి నుండి రమ్మని మనోసంకేతాలు అందాయి. వెనువెంటనే బయలుదేరి నిరూపానంద వారిని కలిశాడు. ఆ సంధ్యాకాలంలో వారు “రా శివా...! ఎలా ఉన్నావు. ఏమిటి విశేషాలు. సాధన బాగా జరుగుతోందా” అని అడిగారు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. నేను చూసిన మహాత్ములు ఎప్పుడు కలిసినా ముందు అడిగే ప్రశ్న “సాధన ఎలా జరుగుతోంది” అని. కానీ పరమ గురువులు మాత్రం అలా ఎప్పుడూ అడుగలేదు. ఎందుకంటే ఆ సాధన, సాధనా ఫలం అన్నీ వారేగా...! నిరూపానందకు ఈ విషయం అర్థం అవడానికి వారు అలా అడిగేవారు. అలా కాసేపు మాట్లాడుకున్నాక, నిరూపానంద తాను ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. అనుమతి కోరాడు అనే కంటే “నేను వెళ్తాను” అన్నాడు. ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే నిరూపానంద పాదనమస్కారం చేస్తాడు, కానీ మిగతా వారి వలే కొన్ని మర్యాదలు పాటించడు. అతను ఎంత ఒదిగి ఉంటాడో, అంత పట్టించుకోని మనస్తత్వం కూడా ఉంది. ఎందుకంటే అతని భావం ఒకటే. “నేను సేవకుడిని... బానిసను కాను. నా భావన సేవ, బానిసత్వం కాదు” అని. అది పరమ గురువులకు తెలుసు, అదీగాక అతనిది “సఖ్యభక్తి”. అందుకే స్వామి వారికి ఏదైనా నివేదన చేసినపుడు తినక పోతే తిట్టి, కసిరి మరీ పెడతాడు, తినిపిస్తాడు, అలాగే మందులు వేసుకోకపోయినా అంతే. మళ్ళీ పాదాభివందనం చేసి మరలుతాడు. ఇలా చేయడం స్వామి వారి విషయంలోనే కాదు, అందరి విషయంలోనూ ఇంతే. అతని ప్రేమకి (అలా అనేకంటే ‘తిక్క’కి) హద్దులుండవు. ఇలాగే వ్యక్త పరచాలనే నియమం ఉండదు. అవతలి వారి మంచి కోసం అవసరమైనే వారిని తిడతాడు కూడా. అక్కడ ఉన్నది శ్రీగురుదేవులా లేక ఇంకొకరా అనేది అతనికి అనవసరం. అందుకే పరమ గురువులు వాడిని తమ చెంతనే ఉండనిచ్చారు.

ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే తన గురువుకు పాదాభివందనం చేసినపుడు వారు వద్దు అని చెప్పినా, పాదాలు వెనక్కు తీసుకున్నా, వారి పాదాలపై కొట్టి (మెల్లగానే), ఆ పాదాలను లాక్కుని మరీ “నమస్కారం చేస్తుంటే ఎందుకు వద్దంటావు, ఎందుకు పాదాలు వెనక్కు తీసుకుంటావు, పెట్టనివ్వు” అని కసిరి మరీ పాదాభివందనం చేస్తాడు. అందుకే పరమగురువులు వాడిని చూసి విపరీతంగా నవ్వుతారు ఎప్పుడూ. ఏమో మర్కట భక్తేమో...! పూర్వ వాసనలు వదలలేదోమో...! గురువుగారికే ఎరుక. 

ఇలాంటి వ్యక్తిత్వం వల్లనే, తన వాళ్ళు అనుకున్న ఇతరులందరూ అతనిని మానసికంగా వెలివేశారు. ఇలాంటి విచిత్ర స్వభావం నా జీవితంలో ఇంకొకరిలో చూడలేదు. అయినా గురువుల పట్ల, దైవం పట్ల తాదాత్మ్యం కలిగిన గొప్ప భక్తులు చాలామందే ఉంటారు, కానీ ఇలాంటి ‘తేడా’ వ్యక్తిని ఉద్ధరించినప్పుడే కదా ‘శ్రీగురులీలా విలాసం’ గురించి నాలాంటి మహా మూర్ఖశిఖామణికి అర్థం అవుతుంది. సరే ఇక కథలోకి వెళదాం.

నిరూపానంద ‘నేను వెళతాను’ అనగానే, శ్రీసత్యానంద స్వామి వారు ‘ఎందుకంత తొందర’ అని అడిగారు. అందుకు నిరూపానంద “రేపు రథసప్తమి స్వామీ! నా జన్మదినం. రేగుపళ్ళు, జిల్లేడు ఆకులు తీసుకు వెళ్ళాలి. నా జన్మదినం అనే ఆసక్తి నాకు ఏమీ లేదు. కానీ శ్రీసూర్యనారాయణుల వారంటే నాకు ప్రాణం. వారికి ఆ రోజు పూజ చేయడం నాకు చాలా ఇష్టం... ఎంతైనా అది మా నాన్న (శ్రీసూర్యనారాయణుల వారిని నిరూపానంద అలాగే పిలుస్తాడు) జన్మదినం కదా...! అందుకే తొందరగా వెళతాను” అన్నాడు. శ్రీ సూర్యనారాయణుల వారంటే నిరూపానందకు ఎంత ఇష్టం అంటే తనకు తాను “ఆదిత్య” అని పేరుపెట్టుకున్నాడు కూడా. 

అపుడు శ్రీసత్యానంద స్వామి వారు తమకు ఏమీ తెలియనట్లుగా, ఆశ్చర్యపోయినట్లుగా చూస్తూ, నిరూపానంద బుగ్గ గిల్లుతూ “ఓహో...! రేపు నీ జన్మదినమా...! రథసప్తమి నాడు జన్మించావా...! ఎంత గొప్ప విషయం. మరి నీకు ఏదో ఒక బహుమతి ఇవాలిగా. ఉండు. ఇస్తాను. ఒక కాగితం (పేపర్) తీసుకునిరా. ‘మహాసౌరమంత్రం’ ఉపదేశిస్తాను” అని చెప్పారు. నిరూపానంద ‘సరే’ అని చెప్పి, ప్రక్కన ఉన్న షాపులో ఒక చిన్న కాగితం తీసుకుని వెళ్ళి వారి పాదాలవద్ద కూర్చున్నాడు. అప్పుడు శ్రీసత్యానందుల వారి రూపంలో ఉన్న మహద్గురు శ్రీశ్రీశ్రీ పూర్ణానందుల వారు నిరూపానందకు “మహాసౌరమంత్రం” ఉపదేశించారు (ఇప్పటికీ ఎంత వెతికినా ఆ “మహాసౌరమంత్రం” మాత్రం ఏ గ్రంథం లోనూ దొరకలేదు). అదే కాకుండా “శ్రీసరస్వతీ మంత్రం” కూడా ఉపదేశించారు. అప్పుడు మన నిరూపానంద “నేను ‘ఆదిత్యహృదయం’ చాలా సంవత్సరాలుగా ప్రతిదినం జపం చేస్తున్నాను. నాకు ఉన్న విచిత్రమైన అనుభూతి ఏమిటంటే ప్రత్యేకించి ‘రథసప్తమి’ నాడు శ్రీసూర్యనారాయణుల వారికి అభిముఖంగా కూర్చుని నేను నా కనులు మూసుకుని ముమ్మారు ఆదిత్యహృదయం జపం చేస్తాను. రెండవసారి చేసేటప్పుడు నేను భరించలేనంతటి స్వచ్ఛమైన తెల్లటి వెలుగు (శ్వేతకాంతి) నా కనులలో ప్రవేశిస్తుంది. మూడవసారి జపం చేసే వరకు అలాగే ఉంటుంది. పూర్తి చేసే సమయానికి ఆ వెలుగు మాయం అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియదు. అది నా భ్రమ కాదు అని తెలుసు. నిజమేమిటో పూర్తిగా తెలియదు. కానీ నాకు బాగుంటుంది. మరి ఈ మంత్రం వల్ల ఏం జరుగుతుంది?” అని వారిని అడిగాడు. అందుకు సత్యానందుల వారు “తొందర ఎందుకు శివా...! రేపు రథసప్తమీ పర్వదినాన శిరఃస్నానం చేశాక బ్రహ్మముహూర్తంలో తెల్లవారు ఝామున 3–4 గంటల మధ్య తూర్పుదిక్కుకు తిరిగి ఈ “మహాసౌరమంత్రం” జపించు. నీకే అనుభవం అవుతుంది. ఇక వెళ్ళి...రా...” అన్నారు. అలా “వెళ్ళి...రా...” అని విచిత్రంగా ఎందుకన్నారో మన వెర్రినాగన్న నిరూపానందకు అర్థం కాలేదు. పాదాభివందనం చేయగానే శ్రీసత్యానందుల వారు, వాడి శిరస్సుపై నిమిరి “కుండలినీ యోగవిద్యా ప్రాప్తిరస్తు” అని దీవించి, “త్వరగా తిరిగి రా... శివా...!” అన్నారు. మన వాడు అసలే పరమ జ్ఞాని కదా! ఏదో అనుకుని వచ్చేశాడు. తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి... ఇంట్లో వాళ్ళకి కూడా అన్నీ చెప్పి... నిద్రపోయి తెల్లవారుఝామున 2 గంటలకే నిద్ర లేచి, తన తల్లి చేత శిరః స్నానం చేయించుకుని (ఇప్పటికీ అలాగే అతని మాతృమూర్తే వానికి శిరః స్నానం చేయిస్తుంది, ఆ ఒక్క రోజు). అంతా అయ్యాక... వాళ్ళ ఇంటి మిద్దెపైకి ఎక్కి, తూర్పు దిక్కుకు ఆసనం వేసుకుని జపం మొదలెట్టాడు. మంత్రం ఒక సారి జపం చేశాడు. రెండవ సారి చేయగానే.........

అతని “ఊపిరి పూర్తిగా ఆగిపోయింది...”, స్పృహ కోల్పోయాడు.
మరి ఉన్నాడో, పోయాడో శ్రీశ్రీశ్రీ... మహద్గురువులకే ఎరుక...
ఏం జరిగిందో తరువాతి భాగంలో చదువుదాం...
సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు

Monday, April 20, 2020

ఆత్మపథ నిర్దేశకుడు – 5

0

తిరుపతికి సమీపంలో ఉన్న ‘తొండవాడ’ అనే గ్రామంలో శ్రీఅగస్త్యేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారు, శ్రీ పద్మావతీదేవి వారిని వివాహం చేసుకున్నప్పుడు నూతన వధూవరులు వివాహమైన మొదటి 6 నెలల పాటు కొండకి ఎక్కరాదు అను నియమం ఉండుట వలన, శ్రీఅగస్త్యమహాముని విన్నపమును అనుసరించి ఆ 6 నెలల కాలం ఆ నూతన వధూవరులు అక్కడే గడిపారు. అటుపిమ్మట తిరుమలకు వారు కొత్త కాపురానికి వెళ్లే క్రమంలో వారు అక్కడ నివసించిన గుర్తుగా తొండవాడ “శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి”గా ‘శ్రీనివాస మంగాపురం’ నందు వెలసినారు. ఆ ఆలయంలో ఒక సాధువు కొన్ని సంవత్సరముల పాటు ఉండేవారు. వారే హృషీకేష్ నందు ఉండిన శ్రీస్వామిశివానంద వారి ప్రశిష్యులు, శ్రీవిమలానంద వారి శిష్యులు ఐన శ్రీసత్యానంద స్వామివారు.

ఇప్పుడు మన కథ మొదలెడదాం. 

నిరూపానందను అతని స్నేహితుడు ఒకతను ఈ సత్యానందస్వామికి పరిచయం చేశారు. నిరూపానందను చూడగానే ఆయన “వచ్చావా శివా! ఇంత ఆలస్యం చేశావేంటి?” అని అడిగారు. కానీ మన నిరూపానంద మహామేధావి కదా! ‘ఈయన ఏమిటి ఇలా అడుగుతున్నాడు’ అని అనుకున్నాడు. కానీ పరిచయం అయిన కొన్ని నిముషాలలోనే ఇద్దరూ ఎప్పటినుండో పరిచయం ఉన్న వారివలె మాట్లాడుకోవడం జరిగింది. ఆయనలోని తేజస్సుకు ఆకర్షితుడైన నిరూపానంద అక్కడి నుండి రావడానికి ఇష్టపడకపోయినా, కుటుంబ బాధ్యతలు, తన చదువు ఇతరత్రా కారణాల వలన తిరిగివచ్చాడు. రాగానే తాను గురువుగా భావిస్తున్న, ఇంతకు ముందు చెప్పిన ఆ క్షుద్ర తాంత్రికుని వద్దకు వెళ్ళి, ఆ సాధువు గురించి చెప్పాడు. అది నచ్చని ఆ మోసగాడు ‘నీ గురువును నేను ఉండగా, ఇతరుల వద్దకు ఎందుకు వెళతావు’ అని నిరూపానందను మందలించాడు. కానీ ఎందుకో తెలియదు గాని నిరూపానందకు ఇది నచ్చలేదు. అతని మనస్సు మాటి మాటికీ ఆ సాధువు వద్దకు వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేది. ఆ సమయంలో విచిత్రంగా తిరుపతి నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ సాధువు అక్కడ నుండి నిరూపానందను రమ్మని పిలవడం... మొబైల్ ఫోన్లు లేని ఆ కాలంలో నిరూపానంద మనస్సులో ఆ సంకేతాలు అంది వెంటనే అక్కడికి వెళ్ళడం చాలాసార్లు జరిగేది. అక్కడికి వెళ్ళగానే అక్కడ పూలు వగైరా అమ్ముకునేవారు నిరూపానందతో “నువ్వు రావాలని స్వామి వారు ప్రొద్దున్న నుండి పిలుస్తున్నారు, మరి నీకు ఎలా తెలిసింది రావాలని” అని అడిగేవారు, ఇంకా “ఇందాక స్వామివారికి ప్రసాదం ఇస్తే ‘శివ’ వస్తాడు, వాడికోసం ఈ ప్రసాదం ఉంచాలి అని అన్నారు, ఇదిగో నువ్వు వచ్చావు” అని చెప్పేవారు.

సత్యానందస్వామి వారు నిరూపానందతో చాలా విషయాలు మాట్లాడేవారు, ఎప్పుడూ ‘శివా...!’ అని ప్రేమగా పిలిచేవారు. అందులో ఎక్కువగా కుండలినీ యోగసాధన గురించి, మహద్గురు శ్రీపూర్ణానందస్వామివారి గురించి ఉండేది. వారు ఎప్పుడూ నిరూపానందతో “శివా...! నువ్వు ఇప్పుడు ‘గురువు’ అనుకుంటున్న వ్యక్తి నీ గురువు కాదు శివా! జాగ్రత్తగా ఉండు. అతను నువ్వు అనుకునేటంత మంచి వ్యక్తి కాదు. నీ గురువు ఒక మహోన్నత వ్యక్తి. నిన్ను సున్నిపెంటలో శ్రీపూర్ణానందస్వామివారి వద్దకు తీసుకు వెళ్ళాలి శివా! వారే నీకు. ” అనేవారు (‘వారే నీకు’ అనేవారు గాని, ఆ ‘నీకు’ ఏమిటో వారు చెప్పేవారు కాదు). కానీ శ్రీపూర్ణానందుల వారు నిరూపానందకు గురుదేవులు అని, వారి భిక్షతోనే ఈ భిక్షువు బ్రతుకుతున్నాడనే విషయం మాత్రం చెప్పేవారు కాదు. “ఇతను (తాంత్రికుడు) నాగురువు కాకుంటే మరి ఎవరు?” అని నిరూపానంద అడిగినప్పుడు, వారు నవ్వుతూ “కాలం ఇంకా సమీపించలేదు శివా...! నువ్వు అనుభవించాల్సిన కర్మలు ఇంకా చాలా ఉన్నాయి. సరైన సమయంలో నీ గురువు నీ వద్దకు వస్తారులే” అనేవారు. మరికొన్నిసార్లు “మానస సరోవరంలో ఉండవలసిన ‘హంస’కు ఇక్కడ ఈ బురదలో పని ఏమిటి శివా...! కర్మ కాకపొతే” అనే వారు. మన వాడికి అర్థం అయ్యేది కాదు. ఇది జరిగింది 1995 కాలంలో. 

నిరూపానందకు శ్రీపూర్ణానందుల వారి నామం వినగానే ఒక ఆత్మీయభావన కలిగేది గాని, ‘మాయ’ వల్ల మళ్ళీ బుద్ధి మరలిపోయేది. ఇలా ఉండగా ఒకనాడు శ్రీసత్యానందస్వామివారు నిరూపానందకు ఒక విచిత్రమైన అనుభూతిని కలుగుజేశారు. అదేమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం.

ఓం నమోభగవతే పూర్ణానందాయ||

ఆత్మపథ నిర్దేశకుడు – 4

0

నిరూపానంద పూజలు ఎక్కువగా చేసేవాడు. శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్పినట్లు ఒకే చోట త్రవ్వితే నీళ్ళు పడతాయి గాని, కొంచెం ఒక చోట, ఇంకొంచెం మరియొక చోట త్రవ్వితే లాభమేమి? అలా ఎంతకాలం? అలాగే ఈ నిరూపానంద కూడా కాసేపు ఈ మంత్రం, మరి కాసేపు ఆ మంత్రం అనుకుంటూ అలా ఒక్కొక్కటి జపం చేస్తూ ఉండే వాడు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. నిరూపానందలో జన్మతః ఒక విచిత్ర స్వభావం ఉండేది. రోజులో చాలాసార్లు అతనికి ఏ ఆలోచనలు లేకుండా, మానసిక స్థబ్ధత ఉండేది. అందరూ అతనిని అడిగేవారు ‘ఏమి ఆలోచిస్తున్నావు’ అని. ‘నేను ఏమీ ఆలోచించడం లేదు. ఆలోచనా రహిత స్థితిలో ఉన్నాను’ అని ఎన్ని సార్లు చెప్పినా ఎవ్వరూ నమ్మేవారు కాదు, ఇప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. కానీ అతని ధోరణి అతనిదే. అలా ఆలోచనా రహితంగా ఉండడం అనేది ఏమిటో, మహద్గురువులు చెప్పేవరకు అతనికి ‘ఎరుక’ కాలేదు. అవునులే...! అది వారి దివ్యానుగ్రహమేగా! 

నిరూపానంద తన ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం అవ్వగానే, తనకు తెలియకుండానే ‘నారాయణ’ నామజపం మొదలెట్టాడు. నిలబడినా, కూర్చొన్నా, నిద్రపోయినా, మేల్కొన్నా, పలకరింపులో, ఆఖరికి విసర్జన వేళలో కూడా ‘నారాయణ’ నామస్మరణమే. ఆ నాలుగు అక్షరాలు శ్రీమహద్గురువులు వాటిచేత ఎందుకు జపం చేయించేవారో గాని, అది వాడి జీవన గమనాన్ని విపరీతంగా మార్చివేసింది. ఎవరినైనా అతను “నమో నారాయణ” అని పలుకరించేవాడు. అతనిని చూసి చాలా మంది అలాగే మొదలెట్టారు. ఇప్పటికీ కొందరు అతనిని అలాగే పిలుస్తారు కూడా ‘ఏం నమో నారాయణా’ అని.

అతనికి తెలీకుండానే ఒక పద్ధతిలో కూర్చునేవాడు. అలా కూర్చొనగానే అతనికి ఇంకా ఎక్కువగా మానసిక స్థబ్ధత ఏర్పడేది. తర్వాత అతను ఎవరినైతే గురువు అనుకుని ఒక క్షుద్ర తాంత్రికునికి వెట్టి చాకిరీ చేసేవాడో, అతను ఒకసారి నిరూపానందతో “ఇలా ‘వజ్రాసనం’లో కూర్చొనడం వల్ల, నిరంతరం ‘నారాయణ’ నామ జపం చేయడం వల్ల నా నుండి నువ్వు తప్పించుకుంటున్నావు. లేకపోతే ఎప్పుడో నా చేతిలో అయిపోయిఉండేవాడివి” అని అన్నాడు. కానీ మన పిచ్చి నిరూపానందకు ఇవేవీ అర్థం కావు, ఒకవేళ అయినా గురువులు ఎప్పుడూ అలాగే అంటారు, అది వారి అనుగ్రహ భాషణం అని భ్రమించేవాడు. తన బుద్ధి (ఆ రూపంలో ఉన్న మహద్గురువు – ‘యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత’ కదా) ఆ తాంత్రికుడి గురించి ఎంత హెచ్చరిస్తున్నా, మాయకు లోబడిన నిరూపానంద, తనలో తాను “నీకేం తెలీదు. గురు చరిత్రల గురువు ఎలా ఉంటారో చెప్పారుగా. ఇలా కూడా ఉంటారేమో. గురువుని అనుమానించడం పాపం” అని భ్రమలోనో, ప్రమలోనో ఉండిపోయేవాడు. ఇక్కడ శ్రీగురుచరిత్రను తప్పుపట్టడం లేదు, దానిలో చెప్పినది అర్థం కాని నిరూపానంద వంటి వారు ఎలా మోసపోతారో చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. ఆ తాంత్రికుడు తానే నిరూపానంద ఇంటిలో సమస్యలు కలుగజేసేవాడు, మళ్ళీ తానే వాటిని ఆపి, గురువుగా తాను అతనికి ఎంతో మేలు చేస్తున్నట్టుగా నటించేవాడు. ఆ తాంత్రికుడు చాలాసార్లు అతనిని తెల్లవారు ఝామున రమ్మని, అతనికి ‘కుండలినీ యోగం’ నేర్పుతానని చెప్పేవాడు. నిరూపానందకు ఆ యోగం గురించి ఏమీ తెలియదు. ఎవరో షట్చక్రాల గురించి చెప్పేవారు. ఇతను వినేవాడు. దాని వలన తనకు కలిగేది ఏమిటో కూడా తెలియని ‘వెర్రి నాగన్న’ మన నిరూపానంద. అందుకనే తనకు తెలీని ఆ యోగం గురించి తెలుసుకుందామని ఆ తాంత్రికుడితో ‘సరే’ అని చెప్పేవాడు. కానీ తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర లేచి ఏదైనా చేయగలిగే నిరూపానందకు, విచిత్రంగా ఆ తాంత్రికుడు చెప్పిన రోజు మాత్రం ‘నిద్ర’ లేవడం అయ్యేది కాదు, లేదా మరచిపోయేవాడు. ఇలా జరిగిన ప్రతిసారి ఆ తాంత్రికుడు ఇతనిని నువ్వు రాకపోవడం వల్ల అది కోల్పోయావు, ఇది కోల్పోయావు అని తిట్టేవాడు. చాలా సంవత్సరాల తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, ఆ సమయంలో నిరూపానంద ఆ తాంత్రికుడి వద్దకు వెళ్ళకుండా ఏదో ఒక వంకతో ఆపింది “శ్రీమహద్గురు పూర్ణానందుల వారు” అని. ఆ క్షుద్రుడికి కూడా తెలియదు, మహద్గురువులు ఈ లీలా నాటకాన్ని నిరూపానంద చేత ఆడిస్తున్నారని. అయినా పరమగురువుల లీలా నాటకాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉండాలి కదా! ఆహా...! విచిత్రం కదా. శ్రీపరమగురువుల లీలలు చిత్రవిచిత్రం కదా! వారెవరో తెలియని, గురువు అంటే ఏమిటో ఎరుగని, కనీసం తమని పట్టించుకోని మన మహామూర్ఖశిఖామణి నిరూపానందను అడుగడుగునా కాపాడటం అనేది, చదవడానికి వినడానికి మీకు ఎలా ఉన్నదో నాకు తెలియదు గాని, నాకైతే ఇలా వ్రాస్తున్నప్పుడు ‘రోమాంచితం’ అవుతున్నది. ఎంతైనా మహద్గురువులు పరమ కరుణాసాగరులు కదా!

ఈ కథ ఇలా నడుస్తుండగా ఒకనాడు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందుల వారు అతనికి ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించి, స్వయంగా భిక్ష వేసి, ఆ నిరూపానందకు తామే మంత్రోపదేశం, యోగవిద్య అనుగ్రహించి కొన్ని సంవత్సరాలు తమతో ప్రత్యక్షంగా చరించే దివ్యానుగ్రహాన్ని ప్రసాదించారు. కానీ.... ఇవేవీ వారు శ్రీపూర్ణానందులుగా తెలిసేలా చేయలేదు... తమని తాము “శ్రీసత్యానందస్వామి”గా పరిచయం చేసుకుని తమ లీలా విలాసాన్ని వాడికి ప్రకటించారు. ఆ వివరాలు వచ్చే సంచికలో చదువుదాం. సరేనా...గురుబాంధవులారా...

ఓం నమో భగవతే పూర్ణానందాయ ||

ఆత్మపథ నిర్దేశకుడు - 3

0

నిరూపానంద అతి సామాన్యుడు. అతని కుటుంబంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వలన అతడు తన సమస్యల వలయం నుండి బయట పడటానికి కొందరు 'స్వామిజీ' అని పిలుచుకునే ఒక కపట స్వామి వద్దకు వెళ్ళవలసి వచ్చింది. నిజానికి అంత వరకు అతను స్వాములు సన్యాసుల వద్దకు వెళ్ళే వాడు కాదు, దానికి చెప్పదగిన కారణాలు లేవు. ఎప్పుడైతే ఈ దొంగ స్వామి దగ్గరకి నిరూపానంద వెళ్ళాడో... అతను నిరూపానందకు మరియు అతని కుటుంబానికి కల్లబొల్లి మాటలు చెప్పి, వారి సమస్యను తాను రూపుమాపుతాను అని, తానే నిరూపానంద గురువుని అని ప్రకటించి అతనిని అతని కుటుంబాన్ని నమ్మించాడు. ఆ దొంగ స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి మూర్తిని, నవ చండికా దేవిని ప్రతిష్ఠించి ఉండటం చూచి అతను తాంత్రికుడు అనే విషయం తెలియక, అతను గొప్ప స్వామి అని భావించి నిరూపానంద అతని కుటుంబం దాదాపు 14 ఏళ్ళ పాటు అతనికి సేవ చేశారు. ఈ కాలంలో అతను నిరూపానందను చంపడానికి కూడా చాలా సార్లు కుట్ర చేసినా, దానిపై, ఇంకా అతని అనేక చర్యలపై నిరూపానందకు అనుమానం వచ్చినా... గురుచరిత్ర లాంటి గ్రంథాలు చదువుట వలన, గురువులు ఇలాగే ఉంటారేమో, వారు నన్ను పరీక్షిస్తున్నారేమో, నా పాపాలు నన్ను తప్పుదారి పట్టిస్తున్నాయేమో అని భ్రమ పడుతూ, నిరూపానంద అతనికి అన్ని సంవత్సరాలు సేవ చేశాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఒక విచితమైన సంఘటన జరిగింది. 

అదేమిటో, మహద్గురు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందుల వారు తమ సేవకుడిని తనకే తెలియకుండా ఎలా తమ వద్దకు రప్పించుకున్నారో, వారు అతనికి తమ లీలా ప్రదర్శన చూపడం ఎలా ప్రారంభించారో... రాబోయే సంచికలో చూద్దాం...
ఓం నమో భగవతే పూర్ణానందాయ||

Sunday, April 19, 2020

ఆత్మపథ నిర్దేశకుడు - 2

0

మనకు తెలిసిన ప్రకృతులు మూడు. అవి స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి మరియు తృతీయ ప్రకృతి. కానీ ఇవి కాకుండా మరో ప్రకృతి ఉందని నాకు చాలా కాలం క్రితమే తెలిసింది, దానినే “వింత ప్రకృతి" అని పేరు పెట్టుకున్నాను. ఆ వింత విచిత్ర ప్రకృతి ఎవరో కాదు... “నిరూపానంద”. అదేమిటి ఆ వ్యక్తి గురించి ఇలా చెబుతున్నారు అనుకుంటారేమో... ఈ గాథ చదువుతున్నప్పుడు మీకు కూడా ఆ పేరు సరియైనదే అనిపిస్తుంది.

నిరూపానంద... ఒక విచిత్రమైన వ్యక్తి. అతనిని చాలా కాలంగా అతి సాన్నిహిత్యంగా గమనిస్తున్నాను. అతను ఒక ద్వంద్వ ప్రవృత్తి గల వ్యక్తి. కొందరు అతనిని మహా పుణ్యాత్ముడు అంటారు, మరికొందరు మహా పాపిగా పరిగణిస్తారు. కొందరికి తను జ్ఞానిలా కనబడితే మరికొందరికి అతను బొత్తిగా మొద్దులా కనబడతాడు. కొందరేమో అతనికి మంత్రతంత్రాలు తెలుసు అని అనుకుంటుంటే, ఇంకొందరు అవన్నీ వట్టి అబద్ధాలు నాటకాలు అంటారు. కొందరు అతనిని పిచ్చివాడు అంటే మరికొందరు యోగి అంటారు. ఇలా అన్ని రకాలుగా అందరికీ ద్వైదీభావంగా కనబడే అతనిని, మనం కనుక వీటిలో “నువ్వు ఎవరివి?” అని అడిగితే, అతను మన వంక మనకు అర్థం కాకుండా ఒక రకంగా చూసి “ఇవేవీ నేను కాదు... కానీ ఆ నేను నేను” అంటాడు. “నేను అద్దంలో కనబడే నీ ప్రతిబింబాన్ని” అంటాడు. తనకు గౌరవమర్యాదలు వద్దంటాడు. పాపం ‘నిజమైన’ పిచ్చివాడు కదా...! అనిపిస్తుంది. 

కొందరు అతనిని శ్రీశ్రీశ్రీ... పూర్ణానందుల వారి శిష్యుడు అని అనుకుంటుంటే... మరికొందరు గురువు పేరు చెప్పుకుని అందరినీ మోసం చేస్తున్నాడు అని అనుకొంటారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ’తాను ఎవరో’ వాడు ఎవరికీ చెప్పడు, చెప్పడానికి ఇష్టపడడు. మరి ఇలాంటి వింత ప్రకృతి గురించి మనకెందుకు? అనిపిస్తుంది కదా...! అక్కడికే వస్తున్నా...!

మన దృష్టికోణంలో, మనం చదువుకున్న, ప్రవచన కారుల మాటల్లో విన్న దానిని బట్టి... మహద్గురువులు తమకు శుశ్రూష చేసే వారికి, తమ మాట వినే వారిని, తమ ఎదుట పల్లెత్తు మాట మాట్లాడని వారిని, తాము ఏం చెబితే అదే చేసేవారిని, గొప్ప వారిని, సదాచారవంతులను, పూజలు చేసేవారిని, ఋతుకాలధర్మములను పాటించే వారిని, శాస్త్రపాండిత్యం కలవారిని, తాము అనుగ్రహించిన మంత్రం మొదలైన విద్యలను అక్షరలక్షలు జపంచేసిన వారిని, జ్ఞానులను, పండితులను, విద్వాంసులను... ఇలా అనేక విధములుగా గొప్పవారిని మాత్రమే త్వరగా, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకు వెడతారని, వారిని యోగులుగా, అవధూతలుగా తీర్చిదిద్దుతారని అనుకుంటున్నాం. కానీ... అలాంటివి ఏమీ లేని, ఏమీ రాని... ఒక పనికి మాలిన వాడిని (తన గురించి అలాగే ప్రకటించాలని నిరూపానంద విన్నపం) కూడా ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలకు పరమ గురువులు చేరుస్తారని, వాడు తమ మాట వినకుండా మార్గం తప్పుతుంటే నాలుగు తన్ని మరీ వాడిని దారిలోకి తీసుకొస్తారని, ఇంకా చెప్పాలంటే తన ప్రమేయం లేకుండానే, సరిగా సాధన చేయక పోయినా కూడా అల్పకాలంలోనే అత్యంత సాధనా ఫలితాన్ని తామే అనుగ్రహించి తమకు తాముగా అతనిని నాలాంటి వాడు ఊహించని, అందుకోలేని గొప్ప స్థానానికి చేరుస్తారని... ఈ నిరూపానంద ఉదంతం నాకు తెలిపింది. పరమ గురువులు ఒక వ్యక్తిని తాము అనుగ్రహించదలచుకుంటే ఆ వ్యక్తి యొక్క కులమతాలు, మంచిచెడులు, చదువుసంధ్యలు, ఆచారవ్యవహారాలు, ఆస్తిపాస్తులు, సాధనా సంపత్తులు, తమ పట్ల వినయ విధేయతలు ఇవేవీ పట్టించుకోరని నా లాంటి వాడికి అనుభవం ద్వారా అర్థం కావడానికి... ఈ నిరూపానంద అనే శిలను శిల్పంగా మార్చే ప్రకియ చేపట్టారేమో...!
నిరూపానంద లాంటి ఒక వింత వ్యక్తికి ’నమ్మకం’ కలిగించడానికి పరమ గురువులు రచించిన ప్రణాళికలు, వాడికి చూపించిన అనుభవాలు, అద్భుతాలు ఇలాంటివి అక్షరబద్ధం చేయడానికే వారు ఈ దాసుడిని ఇలా ఉపయోగిస్తున్నారు. 

ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసినది, తెలుసుకొనవలసినది నిరూపానంద గురించి కాదు, అతనిని ఇలా మార్చి, తమ ఋజుమార్గంలోకి తీసుకువెడుతున్న శ్రీశ్రీశ్రీ... మహద్గురు పూర్ణానందులు మరియు శ్రీశ్రీశ్రీ... కృష్ణానందేశుల వారి లీలాకారుణ్యం గురించి. 

తదుపరి భాగం త్వరలో.

ఆత్మపథ నిర్దేశకుడు - 1

0

మళ్ళీ తెల్లవారింది. దైనందిన కార్యక్రమాలు జోరందుకున్నాయి. హడావుడి మొదలైంది. బరువు బాధ్యతల హెచ్చరికలు మ్రోగుతున్నాయి. ఇలాంటి ఎన్నో పరిస్థితుల మధ్య ‘వీడి’ మనస్సు పరుగులెడుతోంది. ఏం చేయాలో తెలియదు, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. కార్తీక మాసం ఆరంభం అయింది. మరి ఈ గురు సేవకుడు ఏం చేయాలి? అనే సందేహం. ఏదో చేసేద్దామని నా మనస్సుకు ఆరాటం. 

అప్పుడు నా బుద్ధి నా మనస్సును అడిగింది. “ఓ మనసా! ఎందుకే నీకింత తొందర...?” అని పాట పాడినట్టుగా. అప్పుడు నా మనస్సు అడిగింది “ఓ బుద్ధీ! నన్ను నియంత్రించాల్సిన దానివి నీవే కదా...! ఏం చేయాలో అర్థం కాక, ఎలా ఉండాలో తెలియక, ఏమీ చేతకాక ఇలా నేను ఉంటే, ఎందుకు నువ్వు నాకు దారి చూపడం లేదు. నాకు మంచి చెడు చెప్పాల్సింది నీవే కదా. నీకేం నువ్వు స్వతంత్రురాలివి... నాలాగా కాదు కదా!” అని. 

అప్పుడు బుద్ధి మనస్సుతో “ఓ మనసా! నేను నిన్ను నియంత్రించడం అనేది నాకు ఇచ్చిన బాధ్యత. నీ పై స్థితిలో ఉన్నానే కాని, నేను స్వతంత్రురాలిని కాను. నాకు మార్గం చూపేది ‘జ్ఞానం’. అది చూపే బాటలోనే నేను నడిచి నీకు మంచి చెడు చెబుతాను” అని. 

అప్పుడు నా మనోబుద్ధులు కలిసి నా జ్ఞానాన్ని ఇలా ప్రశ్నించాయి “అందరూ చెబుతున్నట్లు నీవు సర్వోన్నతురాలివి కదా...! మరి మాకు సరైన నిర్దేశన చేయవచ్చు కదా” అని. అప్పుడు జ్ఞానం ఈ విధంగా తెలిపింది. “ఓ మనోబుద్ధులారా! నేను సర్వోన్నతురాలిని కాదు. నాకు యజమాని ఉన్నారు. వారు సర్వోన్నతులు. వారే శ్రీశ్రీశ్రీ... గురుదేవులు. వారి కంటే ఏదీ ఎక్కువ కాదు. ‘బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వరుడు, వేదవిద్యాతత్త్వజ్ఞుడు, పండితుడు, పరమహంస, మహాయోగయోగేశ్వరులు, ప్రభువు, బ్రహ్మర్షి, భగవంతుడు, పరబ్రహ్మ...’ ఇలాంటి పేర్లకు నిజమైన సాకారం వారు. వారిని తప్ప ఇంకెవరికీ ఈ పేర్లు ఇవ్వకూడని వారు. ఆద్యంత రహితులు, వారే కాల స్వరూపమైనప్పటికీ వారు కాలాతీతులు. సగుణ రూపముతో కనిపించిననూ వారు నిర్గుణులు. అన్ని రూపములు వారే అయిననూ నిరంజనులు. సర్వము తానే అయిననూ సర్వాతీతులు. ఇది అది అని చెప్పడానికి వీలుకాని, చెప్పలేని, చెప్పకూడని సాక్షాత్ పరబ్రహ్మమే వారు. ఈ చరాచర జగత్తు అంతయూ వారి సంకల్పమే అయినప్పటికీ వారు సంకల్పరహితులు. వారికి మన మీద అవ్యాజమైన కరుణ, ప్రేమ భావనలు ఉన్నట్టుగా మనకు తెలిసినా.... వారు భావాతీతులు. మహాజ్ఞాని వలే కనిపించినా వారు జ్ఞానాతీతులు. నీవు, నేను, మనము అన్నీ తానే అయిన ఆ మహాప్రభువే... ఆ మహద్గురువే... ఆ సచ్చిదానంద పరబ్రహ్మమే నా యజమాని”.

ఇలాంటి చర్చ నాలో జరుగుతుండగా... అప్పుడే నాలో అంతర్వాణిలా శ్రీగురువాక్కు ఆదేశించడం మొదలెట్టింది... ఒకరి గురించి వ్రాయమని. ఈ మనిషి పేరు విన్నాక అతని గురించి, చిత్ర విచిత్రమైన అతని జీవన మార్గం గురించి చెప్పడం నాకు కష్టమేమో, అతనికి కలిగిన అనుభూతులు, శ్రీగురువులు అతనికి చూపిన అద్భుతాలు-దర్శనాలు-నిదర్శనాలు ఇవన్నీ చెప్పడం నా వల్ల కాదు కదా అనిపించింది. ఎందుకంటే వాటన్నింటికీ ప్రత్యక్ష సాక్షిని, అతనికి అత్యంత సన్నిహితుడను, స్నేహితుడను అయినప్పటికీ గుప్తంగా జీవనయానం సాగిస్తూ తన గురించి లోకానికి తెలియడం ఇష్టంలేని అతని గురించి చెప్పవచ్చునా అని సందేహం. కానీ గురువాజ్ఞ కదా. మరి ఆ వ్యక్తి గురించి విషయాలు, మహద్గురువులు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందుల వారు, శ్రీశ్రీశ్రీ...రాఖాడీబాబా వారు, శ్రీశ్రీశ్రీ...నిత్యానంద భగవాన్ వారు, శ్రీశ్రీశ్రీ... పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామి వారు, శ్రీశ్రీశ్రీ...కృష్ణానందేశుల వారు అతని జీవితాన్ని నడిపించిన తీరు, అతనికి గమ్యం చూపడానికి వారే అతనిని నడిపించిన వైనం... ఆహా...! వివరించడమే శ్రీగురులీలావిలాసాన్ని పునఃస్మరణ చేసుకోవడం కదా! అనిపించింది. 

మరి ఈ గాధకు ఒక పేరు పెట్టాలి కదా! విచిత్రంగా శ్రీశ్రీశ్రీ...మహద్గురువులే ఆ పేరు కూడా సూచించారు. 

అదే “ఆత్మపథ నిర్దేశకుడు”. 

ఇంతకీ ఆ శ్రీశ్రీశ్రీ...మహద్గురువుల దర్శన, వీక్షణ, స్పర్శ భాగ్యములు కలిగిన ఆ ‘యోగ’శాలి పేరు చెప్పనే లేదు కదూ.... వస్తున్నా... అక్కడికే... 

వాడే “నిరూపానంద”.
ఇక ఈ ధారావాహిక కొనసాగుతుంది.

Wednesday, April 8, 2020

Saturday, April 4, 2020

Wednesday, April 1, 2020