Tuesday, December 4, 2018

Monday, December 3, 2018

Sunday, December 2, 2018

OM Sri2

0

వచసా చరితం వదామి శంభో
రహ ముద్యోగ విధాసు తేఽపసక్తః |
మనసాఽకృతి మీశ్వరస్య సేవే,
శిరసా చైవ సదాశివం నమామి ||

హే సదాశివా! నాకు ఉన్నతమైన యోగ విద్య గురించి తెలియదు. అందుకే వాక్కుతో నీ చరితామృత గానం చేస్తున్నాను. మనసులో నీ దివ్యరూపమును ధ్యానిస్తున్నాను. శిరసా నీకు నమస్కరిస్తున్నాను. (సత్యం ఏమిటంటే ఇవేవీ నేను చేయడం లేదు, నాలో ఉన్న "ఆ నేను"వైన నీవు చేయిస్తున్నావు)


నమోచ్యుతాయ గురవే జ్ఞానధ్వాన్తైక భానవే |
శిష్య సన్మార్గపటవే కృపా పీయూష సింధవే ||
అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే |
స్వారామోక్తపదేచ్ఛూనాం దత్తం యేనాచ్యుతం పదమ్ ||


అచ్యుతుడు (నాశనం లేనివాడు), శాశ్వతుడు, గురువు (అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే వెలుగుని అందించేవాడు), జ్ఞాన కాంతులు ప్రసరింపజేయు సూర్యుడు, శిష్యులను
ఋజుమార్గంలో (సన్మార్గం/ఉత్తమ మార్గంలో) చరింపజేయువాడు, సమస్త చరాచర జీవ-అజీవరాశులపై అపార సముద్రం వంటి తన కరుణను వర్షించేవాడు, తానే సాక్షాత్తు గుణ-నామ-రూప రహితమైన పరబ్రహ్మమైనవాడు, మోక్షాసక్తులై తనను ఆశ్రయించిన వారికి నాశరహితమైన పరమపదమును దత్తం చేయువాడు (అనగా చేరునట్లు నడిపించువాడు/అందు చేర్చువాడు) ఐన శ్రీశ్రీశ్రీ...మహద్గురువుల పాదపద్మములకు శతసహస్రకోటి వందనములు.
ఓం నమో భగవతే పూర్ణానందాయ ||

ఆత్మపథ నిర్దేశకుడు

0

మనకు తెలిసిన ప్రకృతులు మూడు. అవి స్త్రీ ప్రకృతి, పురుష ప్రకృతి మరియు తృతీయ ప్రకృతి. కానీ ఇవి కాకుండా మరో ప్రకృతి ఉందని నాకు చాలా కాలం క్రితమే తెలిసింది, దానినే “వింత ప్రకృతి" అని పేరు పెట్టుకున్నాను. ఆ వింత విచిత్ర ప్రకృతి ఎవరో కాదు... “నిరూపానంద”. అదేమిటి ఆ వ్యక్తి గురించి ఇలా చెబుతున్నారు అనుకుంటారేమో... ఈ గాథ చదువుతున్నప్పుడు మీకు కూడా ఆ పేరు సరియైనదే అనిపిస్తుంది. 


నిరూపానంద... ఒక విచిత్రమైన వ్యక్తి. అతనిని చాలా కాలంగా అతి సాన్నిహిత్యంగా గమనిస్తున్నాను. అతను ఒక ద్వంద్వ ప్రవృత్తి గల వ్యక్తి. కొందరు అతనిని మహా పుణ్యాత్ముడు అంటారు, మరికొందరు మహా పాపిగా పరిగణిస్తారు. కొందరికి తను జ్ఞానిలా కనబడితే మరికొందరికి అతను బొత్తిగా మొద్దులా కనబడతాడు. కొందరేమో అతనికి మంత్రతంత్రాలు తెలుసు అని అనుకుంటుంటే, ఇంకొందరు అవన్నీ వట్టి అబద్ధాలు నాటకాలు అంటారు. కొందరు అతనిని పిచ్చివాడు అంటే మరికొందరు యోగి అంటారు. ఇలా అన్ని రకాలుగా అందరికీ ద్వైదీభావంగా కనబడే అతనిని, మనం కనుక వీటిలో “నువ్వు ఎవరివి?” అని అడిగితే, అతను మన వంక మనకు అర్థం కాకుండా ఒక రకంగా చూసి “ఇవేవీ నేను కాదు... కానీ ఆ నేను నేను” అంటాడు. “నేను అద్దంలో కనబడే నీ ప్రతిబింబాన్ని” అంటాడు. తనకు గౌరవమర్యాదలు వద్దంటాడు. పాపం ‘నిజమైన’ పిచ్చివాడు కదా...! అనిపిస్తుంది. 

కొందరు అతనిని శ్రీశ్రీశ్రీ... పూర్ణానందుల వారి శిష్యుడు అని అనుకుంటుంటే... మరికొందరు గురువు పేరు చెప్పుకుని అందరినీ మోసం చేస్తున్నాడు అని అనుకొంటారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ’తాను ఎవరో’ వాడు ఎవరికీ చెప్పడు, చెప్పడానికి ఇష్టపడడు. మరి ఇలాంటి వింత ప్రకృతి గురించి మనకెందుకు? అనిపిస్తుంది కదా...! అక్కడికే వస్తున్నా...!
మన దృష్టికోణంలో, మనం చదువుకున్న, ప్రవచన కారుల మాటల్లో విన్న దానిని బట్టి... మహద్గురువులు తమకు శుశ్రూష చేసే వారికి, తమ మాట వినే వారిని, తమ ఎదుట పల్లెత్తు మాట మాట్లాడని వారిని, తాము ఏం చెబితే అదే చేసేవారిని, గొప్ప వారిని, సదాచారవంతులను, పూజలు చేసేవారిని, ఋతుకాలధర్మములను పాటించే వారిని, శాస్త్రపాండిత్యం కలవారిని, తాము అనుగ్రహించిన మంత్రం మొదలైన విద్యలను అక్షరలక్షలు జపంచేసిన వారిని, జ్ఞానులను, పండితులను, విద్వాంసులను... ఇలా అనేక విధములుగా గొప్పవారిని మాత్రమే త్వరగా, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకు వెడతారని, వారిని యోగులుగా, అవధూతలుగా తీర్చిదిద్దుతారని అనుకుంటున్నాం. కానీ... అలాంటివి ఏమీ లేని, ఏమీ రాని... ఒక పనికి మాలిన వాడిని (తన గురించి అలాగే ప్రకటించాలని నిరూపానంద విన్నపం) కూడా ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలకు పరమ గురువులు చేరుస్తారని, వాడు తమ మాట వినకుండా మార్గం తప్పుతుంటే నాలుగు తన్ని మరీ వాడిని దారిలోకి తీసుకొస్తారని, ఇంకా చెప్పాలంటే తన ప్రమేయం లేకుండానే, సరిగా సాధన చేయక పోయినా కూడా అల్పకాలంలోనే అత్యంత సాధనా ఫలితాన్ని తామే అనుగ్రహించి తమకు తాముగా అతనిని నాలాంటి వాడు ఊహించని, అందుకోలేని గొప్ప స్థానానికి చేరుస్తారని... ఈ నిరూపానంద ఉదంతం నాకు తెలిపింది. పరమ గురువులు ఒక వ్యక్తిని తాము అనుగ్రహించదలచుకుంటే ఆ వ్యక్తి యొక్క కులమతాలు, మంచిచెడులు, చదువుసంధ్యలు, ఆచారవ్యవహారాలు, ఆస్తిపాస్తులు, సాధనా సంపత్తులు, తమ పట్ల వినయ విధేయతలు ఇవేవీ పట్టించుకోరని నా లాంటి వాడికి అనుభవం ద్వారా అర్థం కావడానికి... ఈ నిరూపానంద అనే శిలను శిల్పంగా మార్చే ప్రకియ చేపట్టారేమో...!
నిరూపానంద లాంటి ఒక వింత వ్యక్తికి ’నమ్మకం’ కలిగించడానికి పరమ గురువులు రచించిన ప్రణాళికలు, వాడికి చూపించిన అనుభవాలు, అద్భుతాలు ఇలాంటివి అక్షరబద్ధం చేయడానికే వారు ఈ దాసుడిని ఇలా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసినది, తెలుసుకొనవలసినది నిరూపానంద గురించి కాదు, అతనిని ఇలా మార్చి, తమ ఋజుమార్గంలోకి తీసుకువెడుతున్న శ్రీశ్రీశ్రీ... మహద్గురు పూర్ణానందులు మరియు శ్రీశ్రీశ్రీ... కృష్ణానందేశుల వారి లీలాకారుణ్యం గురించి.