శ్రీసత్యానందస్వామి వారి ఆదేశానుసారం “శ్రీదక్షిణామూర్తి స్వామి” వారి
మంత్రం పొందడం కోసం నిరూపానంద విఫలయత్నం చేసిన సంగతి తెలుసుకున్నాం కదా!
అందుకు బాధ పడుతున్న అతనిని చూసి శ్రీసత్యానంద స్వామి వారు “ఇంత పట్టుదలతో
కూడిన నీ ప్రయత్నం వ్యర్థం కాదు శివా...! ఇక సరిగ్గా ఏడు రోజులు వెదుకు.
ఏడవ రోజు దొరుకుతుంది” అని చెప్పారు. అయినా 6 రోజుల పాటు ఎంత ప్రయత్నం
చేసినా దొరకలేదు. సరిగ్గా 7 వ రోజు శ్రీస్వామివారి కోసం ఆ మంత్రం ఎలాగైనా
సంపాదించాలనే పట్టుదలతో ఉన్న అతను మొట్టమొదటి సారిగా తిరుపతిలోని ప్రధాన
గ్రంథాలయానికి అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అసలు ఆ మంత్రం అక్కడ లభ్యం
అవుతుందో లేదో కూడా తెలియదు. దానికోసం ఎలా వెదకాలో తెలియదు. అయినా ప్రయత్న
లోపం ఉండరాదని శ్రీదక్షిణామూర్తి వారిని “స్వామీ! నేను నా స్వార్థం కోసం మీ
మాత్రం కొరకు వెదకడం లేదు. శ్రీసత్యానంద స్వామి వారు అడిగారు. ఎలాగైనా
తెస్తాను అని మాట ఇచ్చాను. ఆ మాట తప్పలేను. కాబట్టి ఈ రోజు ఎలాగైనా అది
దొరికేటట్లు చేయండి” అని ప్రార్థిస్తూ కొన్ని గంటల సేపు వెదికాడు. ఇక
నిరాశగా వెళ్ళిపోదామని అనుకుంటుండగా అకస్మాత్తుగా ఒక గ్రంథం అతనికి దొరకడం,
అందులో శ్రీదక్షిణామూర్తి వారి మంత్రం ఉండటం చూశాడు. వెంటనే ఆనందం
తట్టుకోలేక అది వ్రాసుకుని, మర్నాడు స్వామివారి వద్దకు వెళ్ళి పట్టలేని
ఆనందంతో మనకు మంత్రం దొరికింది అని చెప్పాడు. అందుకు సత్యానంద స్వామి వారు
అతని బుగ్గ గిల్లి, నవ్వుతూ “నాకు తెలుసు శివా! నువ్వు సాధిస్తావని. అసలు ఆ
మాత్రం వెదకమన్నదే నీ కోసం. వెదకడం అనేది నీకు ఇంతవరకు పెద్దగా అలవాటు
కాలేదు. నీ భవిష్యత్ కార్యక్రమాల కోసం ఇలా వెదకడం అలవాటు చేస్తున్నాను.
రేపు ఇంట్లో కూర్చొని ఈ మంత్ర సాధన చేయి శివా!” అని ఒక సారి ఆ మంత్రాన్ని
అతనికి చెప్పి పంపారు.
మర్నాడు గురువారం, మధ్యాహ్నం 1.15 గంటలకు
గురుహోరలో ఆ మంత్ర సాధన కోసం నిరూపానంద తన ఇంట్లోని పూజాగృహంలో కూర్చొని
జపం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం! మంత్ర సాధన మొదలెట్టిన ఖచ్చితంగా 1 గంటలోనే
నిరూపానందకు శారీరిక స్పృహ పోవడం, అలౌకికమైన ఒక విధమైన మత్తులో అతనికి
“శ్రీదక్షిణామూర్తి” వారి భవ్యమైన మూర్తి దర్శనం లభించడం జరిగింది. అలా
కనీసం ఒక 2 గంటల పాటు ఉండిపోయిన నిరూపానంద, వెంటనే శ్రీసత్యానందుల వారి
వద్దకు వెళ్ళి ఈ విషయం చెబుదామని అనుకునేలోగా, శ్రీస్వామి వారు నవ్వుతూ
అతనిని దగ్గరకు పిలిచి, బుగ్గ గిల్లి, శిరస్సు నిమిరి “స్వామి వారి దర్శనం
అయింది కదా శివా...!” అన్నారు. నిరూపానంద స్వామి వారితో “ఇదంతా నిజమేనా?
ఇలా జరుగుతుందా” అని అడుగగా, “అంతా నీ గురువు దయ శివా! వారు అనుకుంటే నీకు
ఏదైనా ఇస్తారు. కానీ నీ కర్మపరిపక్వము కావాలి కదా శివా! వారే వస్తారులే!”
అని దీవించి పంపారు.
ఇక్కడ నాకు అర్థం అయినది ఏమిటంటే...
శ్రీదక్షిణామూర్తి వారి మంత్రం చాలా మందికి తెలుసు. అరే...! ఈ మంత్రం కోసమా
ఈ పిచ్చి నిరూపానంద అంత శ్రమ పడింది అని కూడా మీకు అనిపించవచ్చు. కానీ ఒక
విషయం గమనించాలి. ఈ విషయం జరిగినప్పుడు ఇంటర్నెట్ లేదు. కంప్యూటర్ లభ్యత
చాలా తక్కువ. ఇది చదివేవారు మంత్ర శాస్త్రంలో నిష్ణాతులు అయి ఉండవచ్చు.
కానీ మనం మాట్లాడుకునే వాడు, ఒక మహా మూర్ఖశిఖామణి, మంత్రశాస్త్ర జ్ఞానం
లేని ఒక అర్భకుడు. తనకోసం కాక, తనను అడిగిన స్వామివారి కోసం వెదకడం అనే ఒకే
ఒక పని తప్ప వేరే ఆలోచన లేని వెర్రివాడు. అలాంటి నిరూపానంద చేత
భవిష్యత్తులో శ్రీగురుదేవులు చేయించబోయే పరిశోధనలకు, సాధనలకు ఇలా వెదకడం,
తిట్లు తినడం, ఎవరు ఏమన్నా భరించడం ఇలాంటివన్నీ అవసరం. అందుకేనేమో
మహద్గురువులు శ్రీశ్రీశ్రీ... పూర్ణానందభగవానులు తామే సాక్షాత్
శ్రీదక్షిణామూర్తి అయిననూ, “అనుభవం ఇవ్వడమే గురువు చేసే పని” కనుక వాడిని
అలా అనుగ్రహించారు.
హాస్యాస్పదం కాకపొతే సాక్షాత్ శ్రీదక్షిణామూర్తి
స్వరూపమైన శ్రీపూర్ణానందుల వారు... శ్రీసత్యానందుల వారి పేరుతో
నిరూపానందకు పరిచయం చేసుకుని ఇలా మంత్రం వెదుకమని అడగడం ఏమిటి? మనవాడు ‘ఆయన
కోసం’ అని అనుకుంటూ ఇలా తిరగడం ఏమిటి? మళ్ళీ “నువ్వు సాధించావు శివా!” అని
ఆయన వీడిని అనడం ఏమిటి? విచిత్రంగా అనిపించలేదా! అదే శ్రీగురులీల. నాలాంటి
పిచ్చివాడు ఇలా కొంతవరకే ఆలోచించగలడు. ‘లోగుట్టు పెరుమాళ్ళుకు ఎరుక’
అన్నట్టు మహద్గురువుల చర్యలకు భాష్యం వెదకడానికి నేనెంతవాడను? సాక్షాత్
“శ్రీవిష్ణుభగవానులు” కదా...! ఆ విష్ణుమాయ ఇప్పటికే నన్ను నానా
మాయాప్రభావాలకు గురిచేస్తోంది. కనుక వారి చర్యలను గురించి కాక, వారి
ఆదేశాలే పాటిస్తాను.
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి... ఆ
మంత్రం నిజానికి పరమేష్ఠి గురువునకు సంబంధించినది. అందుకేనేమో! పరమేష్ఠి
గురువులు శ్రీశ్రీశ్రీ... నిత్యానంద భగవాన్ వారి అనుయాయుల సామీప్య సాంగత్యం
ఒక చిన్న బిడ్డ రూపంలో మన నిరూపానందకు కలిగింది.
తదుపరి భాగంలో కలుసుకుందాం.
“సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు”